
హైదరాబాద్, ప్రతినిధి : ఢిల్లీ వీధుల్లో తెలంగాణ బోనాల శకటం రిపబ్లిక్ డే నాడు ప్రదర్శింపబడనుంది.. ఢిల్లీలో జరగనున్న 2015 రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తరపున తెలంగాణ శకటానికి అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా తెలంగాణ సర్కార్‌కి ఓ లేఖ పంపించింది. ఈ పరేడ్‌లో పాల్గొనేందుకుగాను దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 40 శకటాలకు కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. ఆ జాబితాని పరిశీలించిన రక్షణ శాఖ.. అందులోంచి కేవలం 13 శకటాలకు మాత్రమే పరేడ్‌లో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది.
రక్షణ శాఖ ప్రకటించిన ఈ ఫస్ట్ లిస్టులో తెలంగాణ శకటానికి చోటు దక్కకపోవడంతో మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ పారికార్, అరుణ్ జైట్లీలను కలిసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా పరేడ్‌లో పాల్గొనేందుకు అనుమతించాల్సిందిగా కోరారు. దీంతో ఆయన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం, తెలంగాణ రాష్ట్ర శకటానికి కూడా అనుమతి కల్పిస్తున్నట్లు ప్రకటించింది.