
కరీంనగర్, ప్రతినిధి :
‘మధ్యాహ్నం బంధువు నుంచి ఫోన్ వచ్చింది.. మా వాడికి 34 ఏళ్లు దాటింది.. ఓ అమ్మాయిను చూడు’ అని.. చెప్పాడు. ఏం చేస్తాడని నేను అడిగితే.. ‘బాగా చదివాడు.. జాబ్ లేక ఖాళీగానే ఉన్నాడు.. ’ అని సమాధానం వచ్చింది. నేటి యువత పరిస్థితి ఇలానే ఉంది..
వైఎస్ రాజశేఖరుడి దయవల్ల ఉచిత చదువుల పుణ్యమా అని ప్రతీవోడు తెగ చదువులు చదివారు. మరీ అంతమందికి ఉద్యోగాలున్నాయా అంటే ఏవీ ఎక్కడ.? ప్రతీ ఇంట్లో ఖాళీగా కనిపించే నిరుద్యోగులే కనిపిస్తారు.. కాంట్రాక్టు జాబ్ లంటూ ఒక ప్రకటన వస్తే చాలు.. ఆ ఆఫీస్ ముందు గేట్ బయటకు పే…..ద్ధ క్యూ కనబడుతుంది. జనం పెరిగారు.. అవసరాలు పెరిగాయి.. డబ్బు పెరిగింది. కానీ ఏవీ ఉద్యోగాలు పెరగలేదే.. దాంతో ఉద్యోగాలు కోసం యువత ఎదురుచూపులు.. కొడుకులకు పెళ్లిళ్లవ్వాలంటూ తల్లిదండ్రుల నీరిక్షిస్తూనే ఉంటున్నారు. ఎవరి ఆశలు తీరక యువకుల వయసు మాత్రం పెరిగిపోతోంది.
ఇక అమ్మాయిల తల్లిదండ్రులను కదిపితే వారి ఆలోచనలు వారికున్నాయి. ప్రతీ అమ్మాయి.. వారి తల్లిదండ్రులు తమకు ఉద్యోగాలు చేసే అబ్బాయిలే కావాలని భీష్మించుకు కూర్చుంటున్నారు. ‘పనిచేయని వాడు పిల్లను ఎలా పోషిస్తాడు.. అసలు పెళ్లి అవసరమా వారికి ’అని అమ్మాయిల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.. మరి ఉద్యోగాలు లేని యువతకు పెళ్లిళ్ల సంగతంటారా.. అది దేవుడెరుగు.. పాపం నిరుద్యోగుల పరిస్థితి ఇప్పడు పెళ్లికి పనికిరాకుండా.. ఉద్యోగాలు దరిచేరకుండా తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు.
ఇవన్నీ కలగలసిన తర్వాత మా బంధువుకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. వాళ్లబ్బాయి పనిచేయడం లేదు. అమ్మాయిలను చూస్తే ముందు వచ్చే అబ్బాయి ఏం చేస్తున్నాడని.. మరి ఇలా ఖాళీగా ఉండేవాడికి పిల్లనెవరు ఇస్తారని అంటున్నారు. మా బంధువుకు సమాధానం చెప్పలేక.. మింగలేక దాటవేయడమే మంచిదనిపించింది..