పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికేనా.. నిరుద్యోగులకు వద్దా.?

INTERMIDATE EXAMINATION DETE STUDENTSPHOTO/AFTAB ALAM

వరంగల్ : కేసీఆర్ కు సీఎం పదవి, ఆయన కుమారుడికి, అల్లుడికి మంత్రిపదవి, కూతురికి ఎంపీ పదవిని చ్చి కేసీఆర్ ఇంట మాత్రమే  ఉద్యోగాల పంట పండిందని.. నిరుద్యోగులకు మాత్రం మొండిచేయి చూపారని వరంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి సర్వే సత్యనారాయణ విమర్శించారు. హన్మకొండలోని డీసీ సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్వే మాట్లాడారు.

కేసీఆర్ ఇంట్లో అందిరికీ ఉద్యోగాలొచ్చాయని.. తెలంగాణ నిరుద్యోగులకు మాత్రం రాలేదని ఆయన విమర్శించారు.  అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని..  మాట తప్పితే తల నరుక్కుంటానన్న కేసీఆర్ దళితులను మోసం చేసి తానే సీఎం అయ్యాడన్నారు.

ఉప ముఖ్యమంత్రి రాజయ్యను అవినీతి ఆరోపణలతో భర్తరఫ్ చేశాడని.. కేసీఆర్ రాజయ్య చేసిన అవినీతి ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ కేంద్రమంత్రిగా వందల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని.. సీబీఐ ఇంటికెళ్లి విచారించిందని.. ఆ విచారణ పూర్తయ్యే వరకు కేసీఆర్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు కేసీఆర్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లి మోడీ కాళ్లావేళ్లా పడ్డాడని విమర్శించారు.

తాను వరంగల్ లో స్థానికేతరుడన్నా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బిడ్డగా ఎక్కడైనా పోటీచేసే హక్కు తనకుందన్నారు. వరంగల్ లో స్థానికంగా ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తానన్నారు.

మెదక్ వాసి అయిన కేసీఆర్ కరీంనగర్ , మహబూబ్ నగర్ లో ఎంపీగా ఎలా పోటీచేశారని.. హరీష్ కరీంనగర్ నుంచి సిద్దిపేటలో ఎలా పోటీచేశాడని.. సిద్దిపేట కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఎలా గెలిచారని.. కవిత నిజామాబాద్ నుంచి ఎలా గెలిచారని.. వారికి లేని స్థానికత కాంగ్రెస్ అభ్యర్థినైన తనకే ఎలా వస్తుందని సర్వే మండిపడ్డారు.

వరంగల్ లో కాంగ్రెస్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. తాను విజయం సాధిస్తానని సర్వే ధీమా వ్యక్తం చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో  ఏఐసీసీ ప్రధాన  కార్యదర్శి కుంతియా, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం, వరంగల్ డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి , పీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె లక్ష్మన్ గౌడ్, వరంగల్ నగర అద్యక్షులు తాటిశెట్టి విద్యాసాగర్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బండి నర్సాగౌడ్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *