
మార్కెటు యార్డులలో పత్తికి కనీస మద్దతు ధర 4160/- కన్న తగ్గిన చో కాటన్ కార్పోరేషన్ ఇండియా వారు రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి పత్తి కొనుగోలు చేస్తుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ తెలిపారు. శుక్రువారం జమ్మికుంట మార్కెటు యార్డును కలెక్టర్ ఆకస్మికంగ తనిఖి చేసి పత్తి కొనుగోళ్ళపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తెచ్చిన పత్తికి ధర ఎంత ఇచ్చారని అడిగారు. రైతులు మాట్లాడుతూ ‘ఎ’రకం పత్తికి 4800/- రూలు ధర లభించిందని తెలిపారు. కొందరు రైతులు పత్తి బాగున్న 4600/- 4700/- ధర చెల్లించట లేదని ఫిర్యాదు చేశారు. పత్తి నాణ్యతను బట్టి ధర చెల్లిస్తారని మార్కెట్ లో కనీస మద్దతు ధర కన్న ఎక్కువ ధర రైతులకు లభిస్తుందని సంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్ సప్ల్త్త్తె ప్రకారం మార్కెటులో రేటు ఉంటుందని ప్రారంభంలో తక్కువ పత్తి వచ్చుట వలన ఎక్కువ ధర లభించిందని ప్రస్తుతం పెద్ద మొత్తం రైతులు మార్కెటుకు పత్తి తెచ్చుట వలన కొంత ధర తగ్గిందని అన్నారు. రాష్ట్ర్రంలో సి.సి.ఐ వారు ఈ సం!! 90 సి.సి.ఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయుటకు నిర్ణయించారని ఈ నెలాఖరు వరకు 45 కేంద్రాలు ప్రారంభిస్తారని నవంబర్ లో అన్ని ప్రారంభిస్తారని తెలిపారు. మార్కెటు యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
వసతి గృహాల ఆకస్మిక తనిఖి: జమ్మికుంటలోని ఎస్.సి. బాలుర బి.సి. బాలుర, ప్రభుత్వ ఆశ్రమ (ఎస్.సి.) పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్భంగా ఎస్.సి. బాలుర వసతి గృహంలో 12 మంది పిల్లలు ఎందుకు రావడం లేదని దసరా సెలవుల తర్వాత ఇంత వరకు తిరిగి రాకుంటే వారి గురించి ఎందుకు వాకబు చేయలేదని, వారి తల్లిదండ్రులతో ఎందుకు మాట్లాడలేదని వసతి గృహ సంక్షేమ అధికారిని మందలించారు. పిల్లలు ఇంటికి వెళ్లేముందు ఎవరి అనుమతి పొందుతున్నారని, వారు ఇచ్చిన సెలవు ధరఖాస్తులు చూపించాలని ఆదేశించారు. పేద విద్యార్దులను తమ స్వంత పిల్లల్లా చూచుకోవాలని, వారి అభివృద్దికి తగిన కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పిల్లలకు తయారు చేసిన భోజనాన్ని పరిశీలించారు. కోడి గ్రుడ్లు ఇస్తున్నారా లేదా అని వాకబు చేశారు. వసతి గృహలను పరిశుభ్రంగా ఉంచాలని బాత్ రూం లను ప్రతిరోజు శుభ్రపరచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో పిల్లలతో పుస్తకాలు చదివించారు. పిల్లలు చదువు వెనుకబడి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు వారం రోజున నుండి విద్యార్ధులకు గ్రుడ్లు ఇవ్వడం లేదని పిల్లలు తెలుపగా వెంటనే గురుకుల పాఠశాల లోని అన్ని స్టాకు రిజిష్టరు స్వాదీనం చేసుకొని, పూర్తి స్ధాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని జమ్మికుంట తహసీల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు.
ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణ పనుల తనిఖి: హుజురాబాద్ నుండి జమ్మికుంట వరకు మంజూరు అయిన నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖి చేశారు. ఈ సందర్భంగా టేపుతో రోడ్డు వెడల్పును కొలతలు వేయించి చూశారు. రోడ్డు నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేయించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ కమిటి ఛైర్మన్ పింగలి రమేష్, వైస్ ఛైర్మన్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.