పట్టాదారు రైతులందరికీ రైతుబంధు జీవిత బీమా పథకాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు

4 జూన్, 2018 న హైదరాబాదులోని HICC లో జరిగిన రైతుబంధు జీవిత బీమా పథకం అవగాహన సదస్సులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వయంగా పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే రైతులకు జీవిత బీమా సౌకర్యాన్ని కలిగించిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

ఈ సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎం.పి., ఇతర ప్రజా ప్రతినిధులకు, వ్యవసాయ అధికారులకు, రైతు సమన్వయ సమితి జిల్లా, మండల కో-ఆర్డినేటర్సుకు, విస్తరణాధికారులకు, మీడియా ప్రతినిధులకు వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్., ఐ.ఎ.ఎస్., స్వాగతం చెప్పారు. రైతులను ఆదుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు జీవిత బీమా పథకాన్ని రూపొందించిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో LIC చైర్మన్ వి.కె. శర్మ, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి, ఐ.ఎ.ఎస్. రైతుబంధు జీవిత బీమా పథకానికి సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రంపై సంతకాలు చేసారు. LIC చైర్మన్ వి.కె. శర్మ మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రైతుబంధు జీవిత బీమా పథకం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. రైతుల కోసం చాలా దూర దృష్టి కలిగిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిజంగానే రైతుబంధు అని అన్నారు. తాను స్వయంగా ఒక రైతునని, రైతు కుటుంబానికి చెందిన వాడినని వి.కె. శర్మ అన్నారు. భారత జీవిత బీమా సంస్థ కేవలం మన దేశంలోనే కాదని, ప్రపంచం మొత్తంలోనే అతి పెద్ద బీమా సంస్థని అన్నారు. మన దేశంలో 29 కోట్ల మందికి పైగా బీమా సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో నేను పని చేశాను. కాని మరే రాష్ట్రంలోనూ రైతుల మేలు కోరుతూ చేపట్టిన ఇటువంటి బీమా పథకాన్ని నేను చూడలేదని వి.కె. శర్మ అన్నారు. 35 సంవత్సరాల లోపు యువ వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల సేవలో ఉండడం ముదావహం అన్నారు. రైతుబంధు జీవిత బీమా క్లెయిములను 10 రోజులలోనే చెల్లించి మా వంతు సహకారాన్ని అందిస్తామని వి.కె. శర్మ హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాట్లాడుతూ… కార్యక్రమానికి వచ్చిన వ్యవసాయ మంత్రి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎం.పి., ఎం.ఎల్.ఏ, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ కమిషనర్, జీవిత బీమా సంస్థ అధికారులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, రైతు సమన్వయ సమితి జిల్లా, మండల కో-ఆర్డినేటర్లు, మీడియా ప్రతినిధులు అందరికీ స్వాగతం చెప్పారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు సంబంధించి ఎన్నో విలువైన పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. రైతుబంధు జీవిత బీమా క్లెయిములను 10 రోజుల్లోనే అందజేస్తామన్న LIC కి రాష్ట్ర రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేసారు.

kcr 1     kcr 2

రాష్ట్రంలో ఉన్న 57 లక్షల మంది రైతులకు 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు వారికి ఈ బీమా వర్తిస్తుందని ముఖ్యమంత్రి తెలియజేసారు. ఏ కారణం వల్లైనా రైతు చనిపోయినప్పుడు రు. 5 లక్షల బీమా మొత్తం రైతు కుటుంబానికి అందుతుందని తెలియజేసారు. రైతు మరణ ధృవీకరణ పత్రాన్ని గ్రామ పంచాయితీలోనే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రైతుబంధు సాగుకు పెట్టుబడి పథకం ద్వారా 89 శాతం రైతులు సంతోషంగా ఉన్నట్లు ప్రముఖ దిన పత్రిక ‘The Hindu’ కథనాన్ని గుర్తు చేసారు. దేశం అంతా మనవైపు చూస్తోందని అన్నారు. రైతుబంధు సాగుకు పెట్టుబడి సహకారాన్ని నేను తీసుకోలేదు కాని జీవిత బీమాను మాత్రం తీసుకుంటానని అన్నారు. రాష్ట్రంలో ఒకటి రెండు ఎకరాల లోపు ఉన్న రైతులే దాదాపు 32 లక్షల మంది ఉన్నారని వారందరికి జీవిత బీమా ధైర్యాన్ని ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. సాగుకు పెట్టుబడి, రైతుకు బీమా, సాగుకు నీళ్ళు, నిరంతర విద్యుత్తు అందించడమే సంకల్పంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇక రైతులు కష్టాలనుంచి బయట పడతారని ముఖ్యమంత్రి అన్నారు. రైతు క్షేమం తోనే మనందరి క్షేమం ముడిపడిందని అన్నారు. వ్యవసాయ విస్తరణాధికారులనుద్దేశించి బీమా పత్రాలు నింపే పని మీదేనని, ఈ పనిలో రెవెన్యూ శాఖకు ఒత్తిడి పెట్టడం లేదని అన్నారు. రైతు పూర్తి పేరు, రైతు తండ్రి/భర్త పేరు, నామిని పేరు, మొబైల్ నంబరు ఖచ్చితంగా రికార్డు చేయాలని అన్నారు. 15 ఆగష్టు 2018 నుంచి ఈ పథకం అమల్లోకి రావాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ వాతావరణ స్థితిగతుల ఆధారంగా వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు పంట కాలనీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మన అవసరాలకు తోడు దేశంలో ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని పంటలు పండించాలని అన్నారు. రైతుల అభిప్రాయాలు పరస్పరం పంచుకోవడానికి వీలుగా రైతు వేదికల నిర్మాణాలను వీలైనంత త్వరలోనే పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్రంలోని 2500 వ్యవసాయ క్లస్టర్లలోని వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా యంత్ర పరికరాల అవసరాలను, స్థితిగతులను వెంటనే తెలియజేయాలని అన్నారు. ఉత్పత్తులను అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడకుండా తగిన ప్రణాళికను, మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టిని పెట్టాలని మంత్రికి సూచించారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులతో రైతులు మొగులు చూడనవసరం లేని వ్యవసాయం వైపు రాష్ట్రం పురోగమిస్తోందని అన్నారు. వ్యవసాయ పెట్టుబడి కోసం, నాణ్యమైన విద్యుత్తు కోసం, సాగు నీళ్ల కోసం, రైతుల బీమా కోసం ఎంత ఖర్చైనా రైతాంగానికి ప్రతి ఏటా చెల్లిస్తానని అన్నారు.

సాగుకు పెట్టుబడి కోసం ఇప్పటికే రైతులకు 5 వేల కోట్ల రూపాయలు అందాయని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు ఎక్కడికక్కడ రైతాంగాన్ని సేంద్రీయ వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని కోరారు. రైతు సమన్వయ సమితి సభ్యులు భూముల ఏకీకరణకు రైతులను ప్రోత్సహించాలని, వేరు వేరు చోట్ల ఉన్న భూములను ఒకేవైపు సమీకరించుకునే లాగా సహకరించాలని కోరారు. ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో ఆయా పంటల ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ చేర్పుపై కృషి చేస్తామని అన్నారు. ఈ అవగాహన సదస్సును ఉద్దేశించి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ మాట్లాడారు.

kcr 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *