
చావాలని రాసిపెట్టి ఉంటే నువ్వు ఎక్కడున్నా అది వెతుక్కుంటూ వస్తుంది. చచ్చే గడియవస్తే ఈశ్వరుడు కూడా ఆపలేడని నానుడి.. ఇక్కడ ఓ అభాగ్యునికి చావు చంపేదాకా వదల్లేదు.. ఒకసారి యాక్సిడెంట్ కు గురై ఆస్పత్రి పాలైన బాధితుడిని ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయిన మరుక్షణమే మళ్లీ యాక్సిడెంట్ చనిపోయిన ఉదంతం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో చోటుచేసుకుంది.
ఒడిషా రాష్ట్రం గంజి జిల్లాకు చెందిన నీలకంఠ(35) మంచిర్యాల లో కాంట్రాక్టు పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నాడు. అతడు శ్రీరాంపూర్ బస్టాండ్ సమీపంలో రోడ్డుపై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గాయపడ్డాడు. దీంతో స్థానికులు 108లో మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందిన నీలకంఠ ఆస్పత్రి నుంచి డిస్ చార్జ్ అయి వెళుతుండగా మరో గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నీలకంఠ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో చావునుంచి తప్పించుకుందామనుకున్న అతడి ఆశ నెరవేరలేదు. మృత్యువు పగబట్టినట్టు ప్రమాదాల బారిన పడేసి కసితీర కడతేర్చి చంపేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.