
ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. పండుగ పూట నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. పప్పు దినుసుల ధరలు కొండెక్కాయి.. నూనె కాగుతోంది. ఎన్నడూ ఊహించని రేట్లు వినియోగదారుడిని భయపెడుతున్నాయి. అకాల వర్షాల కారణంగా అపరాల సాగు, దిగుబడి పడిపోయింది. దీంతో ధరలకు రెక్కలొచ్చాయి.. ఇదే అదునుగా వ్యాపారులు బ్లాక్ మార్కెట్ నుంచి తరలించి ధరల్ని పెంచేశారు. కోటా లేదంటూ రేషన్ సరుకులు దొరకని పరిస్థితి నెలకొంది. పండుగ పూట అధిక రేషన్ సరుకులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈసారి ఆ ఊసే మరిచింది. దీంతో సామన్య ప్రజలు పండుగకు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది..
పప్పు కంటే చికెన్ చీప్
కోళ్ల సరఫరా పెరిగిపోయింది.. కిలో కందిపప్పు రూ.200 పలుకుతుండగా.. మార్కెట్లో కిలో చికెన్ ధర 96కు పడిపోయింది.. కరీంనగర్ మార్కెట్లోనైతే కిలో కోడి మాంసం 85 ధర పలికింది.. బాయిలర్ కోడి రైతులకు రూ.60 ధర పెంచడం లేదు. కోడి గుడ్ల ధరలు కూడా భారీగా పడిపోయాయి. ఒక్కో గుడ్డు 2.80 నుంచి 2.90 కే కొంటున్నారు.
శ్రావణ మాసం ప్రభావంతోనే చికెన్, మాంస విక్రయాలు భారీగా తగ్గాయి.. శ్రావణ మాసంలో రైతులు మార్కెట్లోకి కోళ్లను పంపలేదు.. ఇఫ్పుడు సరఫరా భారీగా పెంచినా కొనుగోలు లేక ధరలు తగ్గాయి..