పంచాయతీరాజ్ శాఖ బలోపేతం చేస్తున్నాం: మంత్రి దయాకర్ రావు

గ్రామీణ వికాసంలో కీలకమైన పంచాయతీరాజ్‌ శాఖను సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాలకు అనుగుణంగా వెంటనే కార్యాచరణ పూర్తి చేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పంచాయతీరాజ్, మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీలలో అవసరమైన పోస్టుల భర్తీకి అనుగుణంగా విభాగాల వారీగా, హోదాల వారీగా పోస్టుల వివరాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘60 రోజుల కార్యాచరణ ప్రణాళిక’ అమలుకు త్వరగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. సమష్టి కృషితో గ్రామాలను అభివృద్ధి చేసుకునే విధానం వచ్చేలా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్‌ శాఖను సంస్థాగతంగా బలోపేతంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుగారు శనివారం నిర్వహించిన సమావేశంలో ఇచ్చిన ఆదేశాల ఆమలు దిశగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్‌ నీతూప్రసాద్, మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌ రాస్, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎం.సత్యనారాయణ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ వి.వెంకటేశ్వర్లు, సూర్యపేట జిల్లా కలెక్టర్‌ డి.అమోయ్‌కుమార్, సీఈవోలు యాదయ్య, శ్రవణ్‌కుమార్, దేవసహాయం, సీఈవో/డిప్యూటీ సీఈవోల సంఘం ప్రతినిధులు రాఘవేందర్‌రావు, ఎం.శ్రీనివాస్, క్రిష్ణణ్, డీపీవో సంఘం ప్రతినిధులు పద్మజారాణి, రవికుమార్, సరేశ్‌బాబు, వి.వెంకటేశ్వర్లు, ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు సత్తయ్య, ప్రశాంతి, గోపాల్‌నాయక్, జయదేవ్, నర్సింహులు, ఈవోపీఆర్‌ అండ్‌ ఆర్‌డీ సంఘం ప్రతినిధులు శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ… గ్రామాల వికాసం కోసం సమగ్ర విధానం తేనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చెప్పారని… ఈ దిశగా వెంటనే చర్యలు చేపట్టామని చెప్పారు. ‘గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు నిధులు, విధులపై స్పష్టత ఇస్తూ కొత్త పంచాయతీరాజ్‌ చట్టం రూపొందించారు. పటిష్టమైన చట్టం అమలు కోసం చర్యలు తీసుకునేలా సంస్థాగతంగా పంచాయతీరాజ్‌ శాఖను బలోపేతం చేయాలి. సీఎం కేసీఆర్‌గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాలకు డీపీవోలను నియమించాలి. ప్రతి డివిజన్‌కు ఒక్కరు చొప్పున డీఎల్పీవోలు ఉండాలి. ప్రతి మండలానికి ఒక ఎంపీవోను నియమించాలి. ఈవోపీఆర్‌ అండ్‌ ఆర్‌డీ పేరును ఎంపీవోగా మార్చాలి. అన్ని స్థాయిల అధికారులకు పదోన్నతులు కల్పించి పోస్టులను భర్తీ చేయాలి. ఎంపీడీవోలు, పోస్టులను భర్తీ చేయాలి. అర్హత కలిగిన వారితో సూపరింటెండెంట్‌ పోస్టులను భర్తీ చేయాలి. అర్హులైన పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు ఇవ్వాలి. ప్రతి గ్రామాలని ఒక కార్యదర్శి ఉండాలి. అవసరమైన పోస్టులను వేగంగా భర్తీ చేయాలి. ఈ దిశగా వెంటనే చర్యలు మొదలుపెట్టాలి. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం అవసరమైన పారిశుద్ధ కార్మికుల నియామకం, హేతుబద్దీకరణ, గౌరవ వేతనాలు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం కోసం అమలు చేయాల్సిన 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలి. పవర్‌ వీక్, హరితహారం నిర్వహించాలి’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి మాట్లాడుతూ… పంచాయతీరాజ్‌ శాఖ సంస్థాగత బలోపేతానికి అవసరమైన అన్ని వివరాలను… ముఖ్యంగా పోస్టుల వారీగా సమగ్ర వివరాలను, ఖాళీల సంఖ్యను సోమవారంలోపు ఇవ్వాలని పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
పంచాయతీరాజ్‌ శాఖను సంస్థాగతంగా బలోపేతం అంశంపై సమావేశంలో పాల్గొన్న జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. ‘మెరుగైన పరిపాలన, ప్రజలకు సేవలు అందించేలా జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్, గ్రామపంచాయతీలు సమన్వయం ఉండేలా సంస్థాగతంగా అవసరమైన మార్పులు చేయాలి. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేసేందుకు గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లాల పరిషత్‌లకు కొన్ని పర్యవేక్షణ పరమైన అధికారాలు ఇవ్వాలి. సంక్షేమ శాఖల లబ్ధిదారుల ఎంపిక ప్రస్తుతం మండల ప్రజాపరిషత్‌ల ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ఈ శాఖలను, ఈ శాఖల పరిధిలోని విద్యా సంస్థలను పర్యవేక్షణ మండల ప్రజా పరిషత్‌లకు ఉండాలి. అలాగే జెడ్పీ పాఠశాలలపై పర్యవేక్షణ జిల్లా ప్రజా పరిషత్‌లకు, ఎంపీపీ పాఠశాల పర్యవేక్షణ మండల ప్రజాపరిషత్‌లకు ఉంటే మెరుగైన ఫలతాలు ఉంటాయి. గ్రామాల్లోని పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా గ్రామపంచాయతీ బాధ్యత ఉండాలి. ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, పట్టుపరిశ్రమ శాఖలతోపాటు గ్రామాల్లో తాగునీటి సరఫరా నిర్వహణ సమన్వయం సైతం మండల ప్రజాపరిషత్‌లకు ఉంటే పథకాల అమలు తీరు ఇంకా మెరుగ్గా ఉంటుంది’ అని సూచించారు.

errabelli dayakar rao 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *