న‌గ‌రంలో గ్రామ‌కంఠం భూముల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తాం – మేయ‌ర్ రామ్మోహ‌న్‌

న‌గ‌రంలో ఫ్లైఓవ‌ర్లు, ఎస్‌.ఆర్‌.డి.పి ప్రాజెక్ట్‌ల‌ నిర్మాణం సంద‌ర్భంగా గ్రామకంఠంలో ఉన్న నిర్మాణాలను ప‌ట్టభూముల మాదిరిగా ప‌రిగ‌ణించి న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లించేందుకు ప్ర‌భుత్వం సూత్ర‌ప్రాయంగా అంగీక‌రించింద‌ని హైద‌రాబాద్ న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్ర‌క‌టించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో వివిధ అభివృద్ది కార్య‌క్ర‌మాల్లో భూముల‌ను కోల్పోయిన వారికి న‌ష్ట‌ప‌రిహారం అందించే విష‌య‌మై బాధితుల‌తో మేయ‌ర్ రామ్మోహ‌న్ నేడు జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించారు. శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, ప‌లువురు కార్పొరేట‌ర్లు, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు హరిచంద‌న‌, శ్రీ‌నివాస్‌రెడ్డి, చీఫ్ సిటీ ప్లాన‌ర్లు దేవేంద‌ర్‌రెడ్డి, శ్రీ‌నివాస‌రావులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. రాష్ట్రంలో మిషన్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ త‌దిత‌ర ప‌థ‌కాల‌కు వ‌ర్తింప‌చేస్తున్న మాదిరిగానే హైద‌రాబాద్ న‌గ‌రంలోనూ గ్రామ‌కంఠం భూములకు ప‌రిహారం చెల్లించాల‌ని కోరామ‌ని తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో రోడ్డు విస్త‌ర‌ణ‌, వివిధ అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు చేప‌ట్టే భూసేక‌ర‌ణ‌లో కోల్పోయే గ్రామ‌కంఠంలో గ‌ల నిర్మాణాల‌కు కూడా ప‌ట్ట‌భూముల మాదిరిగానే న‌ష్ట‌ప‌రిహారాన్ని అందించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోర‌గా ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింద‌ని, ఈ విష‌యంలో మున్సిప‌ల్ ప‌రిపాల‌న శాఖ మ‌రికొద్ది రోజుల్లో అధికారిక ఉత్త‌ర్వులు కూడా జారీ చేయ‌నుంద‌ని తెలిపారు. ఉప్ప‌ల్‌, బాలాన‌గ‌ర్‌, ఖాజాగూడ‌, మ‌జీద్ బండ ప్రాంతాల్లో రోడ్డు విస్త‌ర‌ణ సంద‌ర్భంగా స్థానిక ప్ర‌జ‌ల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల మ‌ధ్య న‌ష్ట‌ప‌రిహారం అందించ‌డంపై స‌మ‌స్య‌లు త‌లెత్తాయ‌ని, ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త‌కోసం ఈ స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన‌ట్టు మేయ‌ర్ పేర్కొన్నారు. ఉప్ప‌ల్ ఫ్లైఓవ‌ర్ సంద‌ర్భంగా ప్ర‌తిపాదిత 200 అడుగుల మేర రోడ్డు విస్త‌ర‌ణ‌ను 150 అడుగుల‌కు పరిమితం చేసే విష‌య‌మై ప్ర‌భుత్వాన్నికోరనున్న‌ట్టు, ఈ విష‌య‌మై జీహెచ్ఎంసీ స్టాండింగ్ క‌మిటిలో తీర్మానంచేసి పంపుతామ‌ని పేర్కొన్నారు. బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్ నిర్మాణానికి కూడా 150 ఫీట్ల రోడ్డు విస్త‌ర‌ణ జ‌ర‌పనున్నామ‌ని, మ‌జీద్‌బండ‌లో 120ఫీట్లు చేప‌డుతున్నామ‌ని తెలిపారు. అంబ‌ర్‌పేట్ ఫ్లైఓవ‌ర్ నిర్మాణం వ‌ల్ల ఆస్తులు కోల్పోయేవారికి ఏవిధ‌మైన ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు చేప‌డుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ఉప్ప‌ల్ న‌ల్ల‌చెరువు అభివృద్ది ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతున్నాయ‌ని బొంతు రామ్మోహ‌న్ అన్నారు. ఈ స‌మావేశంలో ఉప్ప‌ల్ డిప్యూటి క‌మిష‌న‌ర్ డా.యాద‌గిరిరావు, కార్పొరేట‌ర్లు అన‌లారెడ్డి, సాయిబాబా, రాగం నాగేంద‌ర్‌, కొండూరు న‌రేంద్ర‌చార్యా త‌దిత‌రులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *