
కరీంనగర్: ప్రజలు చట్టాలపై అవగాహన పెంపొందించుకొని న్యాయ సేవాధికార సంస్ధ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు న్యాయ మూర్తి జి.చంద్రయ్య అన్నారు. శుక్రువారం జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెనిటైజేషన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఉచిత న్యాయం అందించడానికి ప్రభుత్వం న్యాయ సేవాధికార సంస్ధలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాని కేసులను జాతీయ లోక్ ఆదాలత్ ద్వారా పరిష్కరించి న్యాయం చేయటం జరుగుతొందని అన్నారు. ప్రజలు న్యాయ పరమైన అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని న్యాయ సేవాధికార సంస్ధ ద్వారా ఏర్పాటు చేస్తున్న అవగాహన సదస్సులను వినియోగించుకోవాలని అన్నారు. ప్రజలలో చట్టాలపై చైతన్యం రావాలని కేసుల పరిష్కారానికి న్యాయధికారులను సంప్రదించాలని అన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని అన్నారు. పరిష్కారానికి చట్టాలపై అవగాహన అవసరమని అన్నారు. దీర్గకాలంగా పెండింగ్ లో నున్న కేసులను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని అన్నారు. అలాగే మధ్య వర్తుల ద్వారా న్యాయ సేవా సంస్ధల ద్వారా, ప్రజా కోర్టుల ద్వారా, లోక్ ఆదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని అన్నారు. న్యాయ సేవాధికార సంస్ధ ద్వారా ప్రజలు సమస్యలను న్యాయ బద్దంగా పరిష్కరిస్తారని తెలిపారు. న్యాయ సేవాధికార సంస్ధ ద్వారా పాఠశాల, కళాశాల, విశ్వ విద్యాలయాలలో న్యాయ అక్షరాస్యత తరగతులు నిర్వహించాలని సూచించారు. గ్రామ స్ధాయిలో న్యాయ అక్షరాస్యత సంస్ధ స్ధాపించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. న్యాయాధికార సంస్ధలోని అధికారులు, వాలంటీర్లు సేవా భావంతో పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా జడ్జి నాగమారుతి శర్మ, జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, అడిషనల్ ఎస్.పి. అన్నపూర్ణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి భవానిచంద్ర తదితరులు పాల్గొన్నారు.