Breaking News

నేల విడిచి సాము చేస్తారా?

KG to PG free but?

కేజీ టు పీజీ ఉచిత విద్య అనేది కేసీఆర్ చాలా కాలంగా చెప్తున్న మాట. వినడానికి చాలా బాగుంది. దీన్ని అమలు చేయడం ఆషామాషీ కాదు. ఎందుకు కాదో తెలుసుకోవాలంటే… ఇప్పుడు సర్కారు బడులు ఎలా ఉన్నాయో తెలియాలి. టీచర్ల కొరత ఉన్న బడులు, సరైన భవనాలు లేని స్కూళ్లు, పైకప్పు సరిగా లేని భవనాలు, బెంచీలు లేక కింద కూర్చునే విద్యార్థులు, టాయిలెట్ల లేక అవస్థ పడే అమ్మాయిలు అబ్బాయిలు, శుభ్రమైన తాగు నీరు లేక దాహం తీరని పిల్లలు… ఇదీ ఈనాటి సర్కారు పాఠశాలల పరిస్థితి.

దేనికైనా మూలం నుంచి పరిష్కారం చూడాలి. మొదలు నుంచి పరిష్కారం చూపాలి. పైపై మెరుగులతో, అందమైన నినాదాలతో పథకాలు పెడితే, నిధుల ఖర్చు తప్ప ఫలితం ఉండదు. ముందు ప్రాథమిక పాఠశాలల నుంచి మరమ్మతులు మొదలు కావాలి. వేళకు పాఠ్యపుస్తకాలు సరఫరా కావాలి. అన్ని సబ్జెక్టులకూ టీచర్లుండాలి. తప్పనిసరిగా టాయిలెట్లుండాలి. శుభ్రమైన మంచినీటి సరఫరా ఉండాలి. కూర్చోడానికి బెంచీలు ఉండి తీరాలి. అలా హైస్కూల్ స్థాయి వరకూ ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ పీజీ స్థాయి వరకూ ఎలాంటి లోటూ లేకుండా, సరైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఉండాలి.

కాలేజీ స్థాయిలో అన్ని సబ్జెక్టులకూ లెక్చరర్లు ఉండటం కూడా కీలకం. ప్రయివేటు కాలేజీల ప్రభావంతో సర్కారు కాలేజీల్లో లెక్చరర్లు దొరకడం, దొరికినా చిత్తశుద్ధితో పాఠాలు చెప్పే వారు లభించడం గగనమై పోయింది. కాబట్టి, ఇది ప్రభుత్వానికి సవాలే. అన్నిటికీ మించి, సర్కారు స్కూళ్లలో ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని ప్రథమ్ సర్వే నివేదిక మొన్ననే తేల్చింది. సర్కారు స్కూళ్లలో ఎనిమిదో తరగతిలో ఉన్నవారు రెండో తరగతి పుస్తకాలను సరిగ్గా చదవలేక పోతున్నారట. ఏడో తరగతి విద్యార్థులు కూడా చిన్న చిన్న భాగహారాలు చేయలేకపోతున్నారట. ఇలాంటి విద్యనే ఉచితంగా బోధిస్తే ఏమి ఉపయోగం?

విద్యాప్రమాణాలను పెంచకుండా ఆదరా బాదరాగా పథకాన్ని మొదలుపెడితే అది ఓట్లను రాల్చ వచ్చేమో గానీ, తెలంగాణ సమాజ భవిష్యత్తుకు బలమైన పునాది మాత్రం వేయలేదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *