నేలకొరిగిన కలం యోధుడు కరుణాకర్ రెడ్డి

హైదరాబాద్: ఒక గొప్ప కలం యోధుడు నేలకొరిగాడు.. అనుక్షణం జర్నలిజమే శ్వాసగా తపించి.. అక్షరాల్ని ఆయుధాలుగా మలిచి అవినీతి అక్రమాలను చీల్చిచెండాడిన ఆ కలం చివరకు తుది శ్వాస విడిచింది. ఆ పోరు జర్నలిస్ట్ చివరకు అందరిని ఒంటరిని చేసి వెళ్లిపోయాడు.. కానీ ఆయన రాసిన వార్తలు.. రచించిన వ్యాసాలు అందరి మదిలో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి..

సీనియర్‌ జర్నలిస్టు కె.కరుణాకర్‌రెడ్డి(60) ఆదివారం హైదరాబాద్‌ లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటుగా పత్రికారంగంలో వివిధ హోదాల్లో పని చేసిన కరుణాకర్‌రెడ్డి ఇటీవల ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. జర్నలిస్టు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కరుణాకర్‌రెడ్డి గతంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, ఐజెయూ కౌన్సిల్‌ సభ్యుడుగా పనిచేశారు. సమాచార హక్కు చట్టంపై జర్నలిస్టులకు అవగాహన కల్పించేందుకు ప్రెస్‌ అకాడమీ, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంయుక్తంగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో కరుణాకర్‌రెడ్డి రిసోర్స్‌ పర్సన్‌గా వ్యవహరించారు. కరుణాకర్‌రెడ్డి ఐజెయూ మాజీ సెక్రటరీ జనరల్‌, మన తెలంగాణ పత్రిక ఎడిటర్  కె.శ్రీనివాస్ రెడ్డి కి  సోదరుడు.

నివాళి

కరుణాకర్‌రెడ్డి మరణం పట్ల ఐజెయూ సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌, ఐజెయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నగునూరి శేఖర్‌, విరహత్‌ అలీ, ఐజేయూ నాయకులు కే. అమర్ నాథ్, కే. సత్యనారాయణ, అంబటి ఆంజనేయులు, దాసరి కృష్ణారెడ్డి, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అద్యక్షులు అయిలు రమేశ్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు నల్లి ధర్మారావు, ఐవి.సుబ్బారావు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్, దొంతు రమేశ్,  జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఆలపాటి సురేష్ కుమార్ ఎంఏ మాజిద్, ఏ రాజేశ్, సంపత్ కుమార్,  కోటిరెడ్డి, వెలిచాల చంద్రశేఖర్, అంగిరేకుల సాయిలు, కే. రాంనారాయణ,  టోంజా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్యాంమోహన్ , కోశాధికారి కళ్యాణం శ్రీనివాస్,  తదితరులు తీవ్ర సంతాపం తెలిపారు. ఆస్పత్రి వద్ద కరుణాకర్‌రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

ముగిసిన అంత్యక్రియలు

కరుణాకర్‌రెడ్డి భౌతిక కాయానికి సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్‌లో అంత్యక్రియలు జరిగాయి.. కరుణాకర్ రెడ్డి అంతిమ యాత్రలో పలువురు జర్నలిస్టులు, కళాకారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాగాయకులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. కురుణాకర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. కరుణాకర్ రెడ్డి ఆంధ్రప్రభతో పాటు వివిధ పత్రికల్లో 35 ఏళ్లుగా పనిచేశారు. ప్రస్తుతం మన తెలంగాణ పత్రికలో పనిచేస్తున్న కరుణాకర్ రెడ్డి ఆదివారం తుదిశ్వాస విడిచాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *