నేర్చుకోవడంలో మొదటి మెట్టు ఫెయిల్యూర్!

(విద్య – విలువలు)

( బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు )

శ్రీరామాయణం ఉంది. సీతమ్మతల్లిని రావణాసురుడు అపహరించాడు. ఈ విషయం రాముడికి తెలియదు. రాముడు దేముడని రామాయణం ఎక్కడా చెప్పదు. రాముడు మనుష్యుడిగా వచ్చాడు. మీరు కూడా రాముడు మనుష్యుడనే భావనతోనే రామాయణం చదవండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. అది నరుడి కథ. సీతాపహరణం జరిగింది. లక్ష్మణస్వామి వెనక్కి వచ్చేశాడు. ఎవరెత్తుకెళ్ళారో ఆయనకి తెలియదు. ఏం జరిగిందని రాముడు గోదావరినడిగాడు. చెట్లను అడిగాడు. అరణ్యాన్ని అడిగాడు. మృగాలను అడిగాడు. ఏవీ పలకలేదు. ఎత్తుకుపోయినవాడు రావణాసురుడని వాటికి తెలుసు. అన్నీ చూశాయి. కానీ అవి రావణాసురుడికి భయపడ్డాయి. చెప్తే చంపేస్తాడు. ఎవరూ చెప్పకపోయేసరికి రాముడికి విపరీతమైన కోపమొచ్చింది. ఎవరికైనా ఆ క్షణంలో కోపమొస్తుందా, రాదా !

’’నా భార్యను ఎవడో ఎత్తుకుపోయాడు. నేనింతకాలం ధర్మానికి కట్టుబడ్డాను. నా భార్యను ఎత్తుకుపోయిన వాడు ధర్మం విడిచిపెట్టాడు. అయినా వాడికి ఇవి భయపడుతున్నాయి. నేను ధార్మికంగా బతుకుతుంటే నన్ను చేతకానివాడినని అనుకుంటున్నాయి. అంటే ధర్మానికి ఇవి రోజులు కావు. నేనూ ధర్మాన్ని కాసేపు పక్కనబెట్టేస్తా. ఇప్పుడు నా విలువిద్య ఏపాటిదో చూపిస్తా. తమ్ముడా, లక్ష్మణా! నా బాణాలు ప్రయోగిస్తున్నాను. వాటితో శరపంజరాన్ని కడతాను. పక్షులు కాదుకదా, దేవతలు కూడా తిరగలేరు. ఈ భూమ్మీద ప్రాణి అనేది ఉండదిక. సమస్త ప్రాణులనూ లయం చేసేస్తాను’’ అంటూ ఊగిపోతున్నాడు రాముడు.

ధర్మానికి రోజులు కావు అని మనమూ నిత్యవ్యవహారంలో అంటూంటాం. కోపమొస్తే ఎవరికైనా అంతే. రాముడు బాణ ప్రయోగం మొదలుపెడితే ఆయన భుజా లు తాండవం చేస్తాయి. ఒక గంటా 48 నిమిషాల్లో 14 వేలమంది రాక్షసులను మట్టుబెట్టాడు ఒకానొక సమయంలో. ఆయనకు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఎంత అస్త్రవిద్య ఇచ్చారంటే… మీరు బాలకాండ చదివితే తెలుస్తుంది. సంకల్పంచేసి మంత్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే చాలు, సమస్త లోకాల్ని నాశనం చేసేస్తాయి. ఊగిపోతున్నాడు కోపంతో.. బాణంతీసి ఎక్కుపెడుతున్నాడు.

ఇంతలో లక్ష్మణస్వామి వచ్చి కాళ్ళమీద పడి ఒక్కటే ఒక్కమాట అడిగాడు – ‘‘అన్నయ్యా! వదిన కనబడడంలేదని లోకాన్నంతటినీ చంపేయటానికా గురువులయిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మనకు విద్య ఇచ్చింది? అన్నయ్యా! నీ స్వార్థంకోసం ఈ అస్త్రాలను ఎన్నటికీ వాడవనీ, లోక క్షేమం కోసం మాత్రమే వాడతావని గురువులు ఈ విద్యను నీకిచ్చారు. వదిన కనబడనప్పుడు, ఎత్తుకు పోయినవాడు ఎవడో వాడిని వెతికి పట్టుకుని చంపకుండా, వీళ్ళెవరూ నీ ప్రశ్నలకు జవాబు చెప్పలేదనే కోపంతో లోకాలనన్నిటినీ చంపేస్తావా? దానిని లోక క్షేమానికే ఉపయోగించాలన్నయ్యా, వద్దు, వాటి జోలికెళ్ళొద్దు’’ అన్నాడు ప్రాథేయపడుతూ.
రాముడు వెంటనే ఏమన్నాడో తెలుసా… ‘‘తమ్ముడా! మంచి మాట చెప్పావు. నిజంగా ఈ విద్యను గురువుగారు మనకు అందుకు ఇవ్వలేదు. ఎవడు సీతమ్మను అపహరించాడో వాడిని వెతుకుదాం పద. నేనిక ఈ అస్త్రాన్ని ప్రయోగించను’’ అని వెనక్కి తీసుకున్నాడు.

ఒక్కటి ఆలోచించండి. సైంధవుడికి ధర్మరాజు ప్రాణభిక్ష పెడితే పరమశివుడి గురించి తపస్సుచేసి ఒక అక్కరలేని కోరిక కోరి తాను నాశనమవడమే కాకుండా శాశ్వతమైన అపకీర్తి తెచ్చుకున్నాడు. రాముడు మాత్రం ఒక్క క్షణం కోపానికి వివశుడైపోయినా, లోకాన్ని నాశనం చెయ్యకుండా వెంటనే నిగ్రహించుకున్నాడు. రావణుడిని వెతికాడు, చివరకు సంహరించాడు. అందుకే త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం పోయి కలియుగం కూడా వచ్చేసింది.

అయినా ఇప్పటికీ రాముడే ఆదర్శవంతుడయ్యాడు. ఆయనకు దేవాలయం కట్టి పూజ చేస్తున్నాం. నామం జపిస్తున్నాం. ఎందుకంటే… రాముడు దైవమనుకోకండి. ఒకానొక క్లిష్ట సమయం వచ్చినప్పుడు దారుణమైన పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటే శాశ్వతకీర్తి పొందుతాడో అటువంటి అడుగువేశాడు తప్ప, ఆవేశంలో ఊగిపోయినా నిగ్రహించుకుని వెనకముందులాలోచించాడు తప్ప దానికి వశమైపోలేదు. ఒక్క సంఘటనతో పాతాళమంత కిందకు వెళ్ళవలసినవాడు అలా వెళ్ళకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచించి విచక్షణా శక్తిని ఉపయోగించిన ఫలితం ఎలా ఉందో చూసారుగా.

ఇటువంటి సందర్భంలోనే ఆవేశాన్ని నిగ్రహించుకోలేని సైంధవుడు ఎంతగా దిగజారిపోయాడో యుగాలు మారినా అతని బలహీనతని లోకం ఎలా గుర్తుంచుకుని అలా బతకవద్దని తమ పిల్లలకు తరతరాలుగా ఎలా చెబుతూ వస్తుందో చూశారుగా… అలాగే కేవలం గురువుగారికిచ్చిన మాటకోసం ఒక్క రూపాయి కూడా పుచ్చుకోకుండా లక్షా 76వేల పోలియో ఆపరేషన్లు చేసిన ఒక డాక్టర్ ఎందరికో ఆరాధ్యుడయ్యాడు. లోకక్షేమంకోసం గురువుగారికి, పెద్దలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఎవరినైనా ఎంత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందో చూశారుగా.
ఇది విస్ఫోటనా శక్తి. మీరు పిల్లలు. మీలో అంత తేజస్సు, అంత బలం ఉంటుంది అయితే జీవితంలో ఏ పొరబాటు జరిగినా మీరు కోపంతోటి, ఉద్రేకంతోటి పదిమందిని బాధపెట్టే నిర్ణయాలు ఎప్పుడూ చేయకండి. పరిశీలించుకుని – ‘‘నా పొరబాటు దిద్దుకుంటాను, ఎవడు ఏమన్నా అనుకోనీయండి. జీవితంలో పైకి వస్తాను’’ అని సంకల్పించుకుని అలా రావడానికి ప్రయత్నించండి.

మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాంగారంతటివాడి జీవితం ఫెయిల్యూర్‌తోనే స్టార్టయింది. ఆయన కోరుకున్న ఉద్యోగానికి సెలక్ట్ కాలేదు. వేరొకదానికి సెలక్టయి, నిరాశపడి తర్వాత ఒక స్వామీజీ ఉద్బోధంతో వెళ్ళి జాయినయ్యారు. అంతే ఇక మళ్ళీ వెనకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆయన తన అనుభవంతో ఫెయిల్యూర్‌ను అద్భుతంగా నిర్వచించారు. ఎవరికోసమో తెలుసా! మీ పిల్లలందరికోసం. ఫెయిల్యూర్ అంటే జీవితంలో నీవెందుకూపనికిరావని తలుపులు మూసివేయడం కాదు. అది F.A.I.L. – First Attempt In Learning. అంటే నేర్చుకునే క్రమంలో అది మొదటి ప్రయత్నం అని. విఫలమయ్యావు – మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. అంతేకానీ అదే తలచుకుని నీరుకారిపోకూడదు.

About The Author

Related posts