
కాన్పూర్ , ప్రతినిధి : సంఘ జీవనంలో ఒకరికి ఒకరు ఆసరాగా ఉండాలి.. కానీ అది మనుషుల్లో లోపించింది. యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోకుండా మన పని మనం చేసుకునే ఈ రోజుల్లో ఓ కోతి అందరికీ గుణపాఠం నేర్పింది. విద్యుత్ షాక్ కు గురై ప్రాణాపాయంలో రైల్వే పట్టాలపై ఉన్న తన తోటి కోతిని రక్షించింది. కాన్పూర్ రైల్వేస్టేషన్లో ఆదివారం ఉదయం జరిగిన ఘటన అందర్నీ ఆలోచింపచేసింది.
రైల్లేస్టేషన్ ట్రాక్‌లపై నడుస్తున్న ఓ వానరం హైటెన్షన్ వైర్ల కారణంగా విద్యుత్ షాక్‌కి గురై ట్రాక్‌ల మధ్య పడిపోయి స్పృహ కోల్పోయింది. అక్కడే వున్న మరో వానరం అదిచూసి దాన్ని రక్షించేందుకు ఎంతో ప్రయత్నించింది. దాన్ని కొరుకుతూ, కింద.. పట్టాల మధ్య ఉన్న నీటిలో ముంచుతూ నానా కష్టాలు పడింది. చివరకు పావుగంట తర్వాత బాధిత వానరం కోలుకుంది. ప్రాణగండం నుంచి బయట పడింది. తోటి కోతిని రక్షించేందుకు తాపత్రయపడిన ఈ ఘటనని చాలామంది తమ మొబైల్స్, వీడియోకి ఎక్కించారు.