నేత కార్మికుల రుణాలు మాఫి: ఈటెల

కరీంనగర్: తెలంగాణలో గత చాలాకాలంగా చేనేత కార్మికులు అవస్ధలుపడుతున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా పట్టించుకోని ప్రభుత్వాల కు భిన్నంగా తమ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, పెండింగ్ లో ఉన్న నేత కార్మికుల రుణాలను త్వరలోనే మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకోబోతున్నామని రాష్ట్ర్ర ఆర్ధిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. మంత్రి శుక్రువారం స్ధానిక ఆర్అండ్ బి వసతి గృహం లో జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మాన కొండూరు, కరీంనగర్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, నగర మేయర్ సర్దార్ రవిందర్ సింగ్ లతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉన్న 36 సంఘాల్లో గత ప్రభుత్వాల పుణ్యం వల్ల ఆరు మూతపడగా, మరో రెండు చివరి దశలోకి చేరుకోగా వాటన్నింటిని పునరుద్దరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలోని 20 సంఘాలు తమకు పక్కాగా షెడ్లను నిర్మించుకునేందుకు ఆర్ధిక సహయం కావాలని కోరగా ఒక్కోదానికి 20 లక్షల చొప్పున కేటాయించడమే కాక 3.81 కోట్లను విడుదల చేశామన్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న క్లస్టర్ లలో భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా మూడు క్లస్టర్లను మంజూరు
చేయించుకున్నామన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ధ్రిప్ట్ ఫండ్ ను ఏర్పాటు చేసి కేంద్రం నాలుగు శాతాన్ని, కార్మికులు నాలుగుశాతంతో నిధి ఏర్పాటు చేసేవారని దానిని ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దీంతో ఆపధకాన్ని తెలంగాణా ప్రభుత్వం పునరుద్ధరించి కేంద్రం ఇచ్చే వాటాను 8 శాతాన్ని రాష్ట్ర్రం సమకూరుస్తున్నదన్నారు. దీనికింద ఇప్పటికే 70 లక్షలను కేటాయించడం జరిగిందన్నారు. చేనేత కార్మికులకు చేయూతగా ఉండే విధంగా పావలా వడ్డీకే రుణాలిచ్చే పధకంలో భాగంగా 3.20 కోట్లను ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 270 పెడల్ లూమ్స్ ఏర్పాటు చేసుకునేందుకుగాను 45వేల చొప్పున 1.21 కోట్లను ఉచితంగా అందించామన్నారు. గతంలో 1500 కండెలు చుడుతూ సంపాదించే మహిళలకు 4వేలు, 5-6 వేలు సంపాదించే కార్మికుడికి 8-10 వేల వేతనం వచ్చేలా చేసేందుకు చేనేత రంగాన్ని విస్తృత పరుస్తున్నామన్నారు. గతంలో సంఘంలో వచ్చే లాభాలను కేవలం 20-30శాతం మాత్రమే వారికి చెల్లించి మిగతావి ఇతరత్రాకు మల్లించే వారని తాము అందుకు పూర్తి భిన్నంగా ప్రతి పైసాకూడా సంఘ సభ్యులకే చెల్లించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆత్మహత్యలు లేని, ఆకలి చావులు లేని నేత కార్మికులను చూడాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. తమ ప్రభుత్వ ప్రతి అడుగు కూడా నేతన్నల వెన్నంటి ఉండేందుకేనని మంత్రి ఈటెల వెల్లడించారు. జిల్లా కేంద్రంతోపాటు జిల్లా వ్యాప్తంగా నివాసిత గృహల సమీపంలోనుంచి ఇల్లపై నుంచి విద్యుత్ వైర్లు వెల్లే వాటన్నింటిని తొలగించి సుదూరంగా వేయాలని ఇప్పటికే నిర్ణయించి 29 కోట్లను కేటాయించి పనులు ప్రారంభించామన్నారు. రోడ్డు మద్యలో పోల్స్ లేకుండా చూడడం, ట్రాన్స్ ఫార్మర్లకు కంచెలు వేయడం తదితర చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదిలా ఉండగా గ్రామపంచాయితీల్లో మూడో వైరులేక విద్యుత్ దీపాలు వేసుకోవడం కష్టంగా మారిందని కొక్కెల్లతో వేయడం వల్ల పగటిపూట కూడా విద్యుత్ దీపాలు వెలిగి ప్రభుత్వానికి ఆర్ధికంగా నష్టం వస్తుందని గుర్తించి ప్రభుత్వమే స్ధానికంగా వేసుకోవడం భారంగా ఉంటుందని భావించి అన్ని పంచాయితీల్లో మూడో లైన్ ను ప్రభుత్వమే వేయిస్తుందన్నారు. దీనికి అయ్యే ఖర్చును జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపిలు తమతమ నిధులనుంచి వెచ్చిస్తున్నామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక సౌకర్యాల కల్పనకు కూడా చర్యలు తీసుకుంటున్నామని. దీనికోసం ఇప్పటికే 15 కోట్లతో ఫర్నీచర్ ను ఆర్డర్ చేయడం జరిగిందన్నారు. ప్రతి ప్రాధమిక పాఠశాలనుంచి మొదలుకుని జూనియర్ కళాశాల వరకు ఫర్నీచర్, ప్రహరీ గోడలు, నిరంతరం తాగునీరు, టాయ్ లెట్లు, కిచెన్ రూంలు నిర్మిస్తున్నామన్నారు. జిల్లాకే తలమానికంగా ఉన్న శాతవాహన యూనివర్సిటీని కూడా అప్ గ్రేడ్ చేయడంతో పాటు హస్టల్ భవనాలు, ఇతరత్రా వసతులు, ఫర్నీచర్ లైబ్రరీలను మెరుగు పరిచేందుకు 15 కోట్లను కేటాయించడం జరిగిందన్నారు. ఈపనులన్నీ కూడా త్వరలోనే ప్రారంభించనున్నామన్నారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాక అభివృద్ధి లో మార్గదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదునాతనంగా వంతెనను కమాన్ నుంచి వంతెనవరకు నాలుగులైన్ల రహదారితో కలుపుకుని 147 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు మురికికాలువలను కూడా ఆధునీకరిస్తున్నామన్నారు. ఇటీవల వర్షాల సమయంలో నగరవాసులు పడ్డ అవస్ధలను స్వయంగా చూసి చలించిపోయానన్నారు. ప్రతి అభివృద్ధి లో కూడా జిల్లాకు చెందిన ప్రతి ప్రజా ప్రతినిధి తన నిధులను కలుపుకుని క్రోడీకరించి జిల్లా మొత్తాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ఒకరి నియోజకవర్గం వేగంగా మరొకరిది ఆలస్యంగా అనేది లేకుండా చూస్తున్నామన్నారు. పాత్రికేయుల సమావేశంలో కార్పోరేటర్లు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *