
ఆదిలాబాద్, ప్రతినిధి : ఔషధ నగరి.. చిత్ర నగరి..క్రీడా నగరి..పారిశ్రామిక నగరిలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో కసరత్తు చేసిన సీఎం విద్యుత్ ఉత్పత్తివైపు దృష్టి సారించారు. విద్యుత్ ఉత్పత్తికి అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా అదిలాబాద్ జిల్లా జైపూర్ లో నిర్మిస్తున్న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పై దృష్టి కేంద్రీకరించారు. విద్యుత్ కేంద్ర నిర్మాణంలో ఆటంకంగా ఉన్న సమస్యలను గుర్తించి త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించనున్నారు.
2010లో థర్మల్ పవర్ ప్లాంట్ల పనులు..
2010 ఫిబ్రవరిలో 7500 కోట్ల అంచనా వ్యయంతో థర్మల్ పవర్ ప్లాంట్ల పనులు బీహెచ్ఈఎల్, కన్సల్టెంట్ ఎన్టీపీసీ చేపట్టాయి. 2015 అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ అధికారుల పర్యవేక్షణ, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం కారణంగా ప్రాజెక్టు అంచనా వ్యయం వెయ్యి కోట్లకు పెరిగింది. గడువు సమీపిస్తున్నా పనుల్లో మాత్రం పురోగతి కనిపించడం లేదు. నీటి సరఫరా కేంద్రం, పంప్ హాజ్ నిర్మాణ పనులు, బాయిలర్ టర్బైన్స్ పనులు నత్త నడకన సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిమ్మీ, నీటి రిజర్వాయర్, కూలింగ్ టవర్స్ యాష్ యార్డ్, కోల్ యార్డ్, అంతర్గత రహదారుల పనులు ఇప్పటికీ కొలిక్కి రాలేదు.
సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ల పరిశీలన అనంతరం అధికారులు, కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలతో సీఎం సమీక్షిస్తారని సమాచారం. కేసీఆర్ పర్యటనతోనైనా పవర్ ప్లాంట్ నిర్మాణ సమస్యలు పరిష్కారమవుతాయని స్థానికులు ఎదురుచూస్తున్నారు.