నేడు జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు

ఢిల్లీ, ప్రతినిధి : జమ్మూ కాశ్మీర్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఐదు విడుతలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్దిసేపట్లో తేలనున్నాయి. ఉగ్రవాదులు, మావోయిస్టుల హెచ్చరికలను భేఖాతరు చేస్తూ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదు కావడంతో ఎన్నికల కమిషన్ పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది.

జమ్మూకాశ్మీర్‌లో 87 అసెంబ్లీ స్థానాల ఫలితాలు
జమ్మూకాశ్మీర్‌లోని 87 అసెంబ్లీ స్థానాల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 821 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని 28 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 5 వేల మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారు. మొదటగా బాలెట్ ఓట్లను లెక్కించి తరువాత ఈవీఎం ఓట్లను లెక్కగట్టనున్నారు. సున్నిత ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేసారు.

జమ్మూకాశ్మీర్‌ ఎగ్జిట్ పోల్స్ బిజెపికి పెద్ద షాక్
మరోవైపు జమ్మూ కాశ్మీర్‌ ఎగ్జిట్ పోల్స్ బిజెపికి పెద్ద షాక్ ఇచ్చాయి. ఇక్కడ మోడీ హవా అంతగా లేదని… బీజేపీ రెండవ స్థానంతో సరిపెట్టుకోనుందని తేల్చిచెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం స్థానిక పిడిపి అత్యధిక స్థానాలు గెలుచుకోనుందని…రెండవ పార్టీగా బీజేపీ, మూడవ స్థానానికి నేషనల్‌ కాన్ఫరెన్స్, నాల్గవ స్థానానికి కాంగ్రెస్ పరిమితమవుతుందని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి.

జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు
ఇక జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. మొత్తం 1136 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ఇందులో 111 మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. జార్ఖండ్‌లో 5 విడతల్లో కలిపి 66 శాతం పోలింగ్ నమోదయ్యింది. మావోయిస్టుల హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్‌ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

కమలనాధుల్లో ఆనందం..
జార్ఖండ్‌లో బీజేపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్‌ పోల్స్ చెప్పడంతో కమలనాధుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రెండవ స్థానంలో జెఎంఎం, మూడవ స్థానంలో కాంగ్రెస్ ఉండనున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. రికార్డు స్థాయిలో రెండు రాష్ట్రాల్లో నమోదైన ఓటింగ్ మరికొద్ది సేపట్లో నాయకుల భవితవవ్యాన్ని తేల్చనుంది. దేశ వ్యాప్తంగా ఉందంటున్న మోడీ మానియా ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో పనిచేసిందో లేదో తేలిపోనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.