
మొక్కలు నాటే లక్ష్యం కుదింపు కుదరదు, అన్ని జిల్లాలు పూర్తి చేయాల్సిందే
వచ్చే యేడాది కోసం కొత్త నర్సరీల ఏర్పాటు వెంటనే చేపట్టాలి
కొత్త అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో పనులు వెంటనే ప్రారంభించాలి
అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా వీడియో కాన్ఫరెన్స్..
నాలుగో విడత హరితహారంలో భాగంగా జిల్లాల వారీగా ఇచ్చిన మొక్కలు నాటే లక్ష్యాల కుదింపు ఎంత మాత్రం కుదరదని, అన్ని జిల్లాలు ఈ నెలాఖరుకల్లా తమ తమ లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిందే అన్నారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా. హరితహారం పురోగతిపై సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈయేడాది హరితహారం సంతృప్తికరంగా కొనసాగుతోందని, మేడ్చల్, జగిత్యాల, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు ఇప్పటికే నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేశాయని, ఆ జిల్లాల కలెక్టర్లు, అధికారులు, సిబ్బందిని అజయ్ మిశ్రా ప్రశంసించారు. మిగతా జిల్లాలు కూడా ఈ నెలాఖరుకల్లా మొక్కలు నాటడం కచ్చితంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాల వారీగా కలెక్టర్లతో తాజా పరిస్థితిని, ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ మిశ్రా ఆరాతీశారు. ఉపాధి హామీ పథకం నిధుల సమస్య లేదని, కార్మికులకు వేతనాలు కూడా సకాలంలో అందుతాయని చెప్పారు. వచ్చే యేడాది హరితహారం లక్ష్యం వంద కోట్లు అయినందున ఆమేరకు ప్రతీ గ్రామ పంచాయితీలో ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని, కలెక్టర్లు జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించాలని, ఇక ఎంపీడీవోలు గ్రామ సభలు నిర్వహించి, నర్సరీలకు స్థలాలను గుర్తించటంతో పాటు, ఎక్కడ ఎలాంటి మొక్కలు కావాలో నిర్ణయించాలన్నారు. తెలంగాణ భౌగోళిక లక్షణాలు ఈ ప్రాంతంలో పెరిగే అటవీ జాతుల మొక్కలను ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రణాళికాబద్దంగా జరగాలని, మిగతా ప్రాంతాల కంటే పచ్చదనం అవసరం ఈ పరిధిలోనే ఎక్కువగా ఉందన్నారు. అన్ని ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. మళ్లీ రెండు వారాల తర్వాత హరితహారంపై చీఫ్ సెక్రటరీ సమీక్ష ఉంటుందని ఈలోగా లక్ష్యం మేరకు పనులు పూర్తిచేయటంపై కలెక్టర్లు, సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. సెప్టెంబర్ 16 న నిర్వహించే వి.ఆర్.ఓ పరీక్షల నిర్వహణకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని TSPSC కార్యదర్శి వాణి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను కోరారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశారని తెలిపారు. దాదాపు 11 లక్షల మంది అభ్యర్ధులు వి.ఆర్.ఓ పరీక్షకు హాజరవుతున్నందున దీనిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి వహించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించేలా చూడాలన్నారు. పరీక్షల నిర్వహణ సెంటర్ల వివరాలు పంపామని, వాటి చిరునామను సరిచూసుకోవాలని, అవసరమైన సిబ్బందిని నియమించుకొని వారికి తగు శిక్షణ నివ్వాలన్నారు. ప్రతి జిల్లాలలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకొని తగు భద్రతా ఏర్పాట్లు అవసరమైన సిబ్బందిని నియమించాలన్నారు. పరీక్షల నిర్వహణ కేంద్రాలను ముందుగానే తనిఖీ చేసి వసతులను పరిశీలించాలన్నారు. జిల్లా స్ధాయిలో సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రశ్నాపత్రాల సేఫ్ కస్టడీ, పరీక్షా కేంద్రాలకు చేరవేత (Rout Map) పరీక్షా కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, ఆర్టీసి బస్సుల ఏర్పాటు, పరీక్షా కేంద్రాలలో మంచినీటి సౌకర్యం వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. పాడి గేదల పంపిణీ పై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి గ్రౌండింగ్ ను వేగవంతం చేయాలని పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పాడిగేదల పంపిణీ, ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని సెప్టంబర్, అక్టోబర్, నవంబర్ మాసాలు ముఖ్యమైన సీజన్ అని అన్నారు. పాడిపశువుల పంపిణీలో వెనుకబడ్డ జిల్లాలైన వనపర్తి, వికారాబాద్, జగిత్యాల, భద్రాది కొత్తగూడెం, భూపాలపల్లి, మంచిర్యాల్, కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో గ్రామీణాభివృద్ది శాఖ కమీషనర్ నీతూ ప్రసాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, పీసీసీఎఫ్ పీ.కె.ఝా, సి.ఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్.ఎం.డోబ్రియల్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.