నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టంపై రెండోరోజు సుదీర్ఘంగా చ‌ర్చించిన మంత్రుల స‌బ్ కమిటీ

స‌ర్పంచ్‌ల‌కు విస్తృతాధికారాల‌తో పాటు బాధ్య‌త‌

పంచాయ‌తీల‌కు కో అప్ష‌న్ స‌భ్యుడి నియామ‌కం

గ్రామ స‌భ నిర్వ‌హ‌ణ కాల‌వ్య‌వ‌ధిని ఒక‌టి లేదా రెండు నెల‌ల‌కు కుదించే యోచ‌న‌
వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల‌కు ఒకే రిజర్వేష‌న్‌

నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టంపై రెండోరోజు సుదీర్ఘంగా చ‌ర్చించిన మంత్రుల స‌బ్ కమిటీ

హైద‌రాబాద్‌-గ్రామ స‌ర్పంచ్‌ల‌కు విస్తృతాధికారాలు క‌ల్పించేలా తెలంగాణా నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టం సిద్దం అవుతోంది. పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ‌ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన మంత్రివ‌ర్గ ఉప‌సంఘం వ‌రుస‌గా రెండో రోజూ సుదీర్ఘంగా చ‌ర్చించింది. మంగ‌ళ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన
ఉప‌సంఘం స‌మావేశంలో మంత్రులు కేటీఆర్‌, పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు, ఈట‌ల రాజేంద‌ర్‌, ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి పాల్గొన్నారు. చ‌ట్ట రూప‌క‌ల్ప‌న‌లో తీసుకోవాల్సిన న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌కు సంబంధించి అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ప్ర‌కాశ్ రెడ్డితోనూ సుదీర్ఘంగా చ‌ర్చించారు. ప్ర‌జల సౌల‌భ్యం, గ్రామ పంచాయ‌తీల స‌ర్వ‌తోముఖాభివృద్ధికి దోహ‌ద ప‌డేలా నూత‌న చ‌ట్టం ఉండాల‌ని..ఇందులో ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన ఇబ్బందులు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని స‌బ్ క‌మిటీ సూచించింది. స‌ర్పంచ్‌ల చేతికే కార్య నిర్వ‌హ‌ణాధికారాల‌ను పూర్తిగా అప్ప‌గిస్తూ… విధుల‌ను కూడా స్పష్టంగా చ‌ట్టంలో పేర్కొనే దిశ‌గా స‌మావేశంలో చ‌ర్చించారు. నిధులు, కార్య‌నిర్వ‌హ‌క‌ అధికారాల‌తో పాటు స‌ర్పంచ్‌ల‌కు అప్ప‌గించాల్సిన బాధ్య‌త‌ల‌పైనా ప్ర‌ధానంగా చ‌ర్చించారు. దీని ద్వారా గ్రామాల్లో స‌ర్పంచ్‌ల‌, పాల‌క‌వ‌ర్గ స‌భ్యుల‌కు జ‌వాబుదారీత‌నం పెర‌గ‌డంతో పాటు, నిధుల వినియోగంలో పార‌ద‌ర్శ‌క‌త పెరుగుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అయింది.

అదే స‌మ‌యంలో గ్రామాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు, వారి అభిప్రాయాల‌ను తెలుసుకునేందుకు వీలుగా గ్రామ‌స‌భ‌ను త‌ప్ప‌కుండా నిర్వ‌హించేలా చ‌ట్టంలో మార్పులు చేయాల‌నే అభిప్రాయం వ్య‌క్తం అయింది. ప్ర‌ధానంగా గ్రామ స‌భ కాల‌వ్య‌వ‌ధిని ఆరు నెల‌ల నుండి ఒక‌టి లేదా రెండు నెల‌ల‌కు కుదించాల‌నే ఆలోచ‌న చేస్తున్నారు. అలాగే ప్ర‌స్తుతం జిల్లా ప‌రిష‌త్‌, మండ‌ల ప‌రిష‌త్‌ల్లో అమ‌లు చేస్తున్న‌ట్లుగానే పంచాయ‌తీల్లోనూ కో ఆప్ష‌న్ స‌భ్యున్ని నియ‌మించే అంశంపైనా చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టంలోనూ స్వ‌యం స‌హాయ‌క సంఘాలు లేదా ఫంక్ష‌న‌ల్ గ్రూప్‌ల నుండి కో ఆప్ష‌న్ స‌భ్యున్ని తీసుకోవ‌చ్చ‌నే అంశం పొందు ప‌ర్చి ఉన్న‌ప్ప‌టికీ అది అమ‌లు కావ‌డం లేదు. దీనిని అమ‌లు చేస్తూ గ్రామంలోని నిపుణుడు లేదా ఏదైనా విష‌య ప‌రిజ్ఞానం ఉన్న సీనియ‌ర్ వ్య‌క్తిని కో ఆప్ష‌న్ స‌భ్యునిగా నియ‌మించే అంశంపైనా చ‌ర్చించారు.

అలాగే రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా లే అవుట్లతో పాటు… గ్రౌండ్ ప్ల‌స్ రెండు అంత‌స్థుల క‌న్నా ఎక్కువ చేప‌ట్టే భ‌వ‌న నిర్మాణాల కోసం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని ప‌ట్ట‌ణ మ‌రియు గ్రామీణ ప్ర‌ణాళిక శాఖ అనుమ‌తి పొందాల్సి వ‌స్తోంది. దీనిని కొంత స‌ర‌ళీక‌రిస్తూ జిల్లాల్లోనే డీపీఓల ఆధ్వ‌ర్యంలో నిపుణుల క‌మిటీ ఏర్పాటు చేస్తే ఎలా
ఉంటుందన్న దానిపై స‌బ్ క‌మిటీలో చ‌ర్చించారు. ఈ క‌మిటీ కూడా నిర్ణీత కాల ప‌రిమితిలోగా ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించ‌మో, ఆమోదించ‌డ‌మో  చేసేలా చ‌ట్టంలో పొందుప‌ర్చే అంశంపైనా కూలంకుశంగా చ‌ర్చించారు. అలాగే వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల‌కు ఒకే రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌నే అంశంపైనా చ‌ర్చ జ‌రిగింది.  ఏదేమైనా నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టాన్ని పూర్తిగా వాస్త‌విక‌త దృక్పథంలో…వంద‌శాతం అమ‌లు చేసేలా మంత్రుల క‌మిటీ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ చ‌ట్టం ద్వారా గ్రామ స్వ‌రాజ్యం సాకారం కావాల‌ని… స్థానిక పాల‌న‌కు కొత్త రూపు రావాల‌నే దృడ చిత్తంతో క‌మిటీ కూలంకుశంగా చ‌ర్చిస్తోంది. బుధ‌, గురువారాల్లోనూ స‌బ్ క‌మిటీ బేటీ కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *