నీలోఫ‌ర్ దోషుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు

నీలోఫ‌ర్ ఘ‌ట‌న‌పై త్రిసభ్య కమిటీ

మూడు, నాలుగు రోజుల్లో నివేదిక

గాంధీలో ప్ర‌వ‌ళిక‌ది స‌హ‌జ మ‌ర‌ణం

మీడియాతో వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి

హైద‌రాబాద్ ః నీలోఫ‌ర్ ఘ‌ట‌న‌పై విచార‌ణకు ఆదేశించామ‌ని, మూడు, నాలుగు రోజుల్లో నివేదిక అందుతుంద‌ని, దోషులు ఎవ‌ర‌నేది తేలితే, వెంట‌నే వాళ్ళ‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి తెలిపారు. గాంధీలో సాయి ప్ర‌వ‌ళిక‌ది స‌హ‌జ‌మ‌ర‌ణమేన‌ని, ఆమెకు ప్రాణాంత‌క న్యూరో డీ జ‌న‌రేటివ్ డిసీజ్ ఉంద‌ని మంత్రి వెల్ల‌డించారు. వైద్య రంగంలో చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తోపాటు, ఈ మ‌ధ్య నీలోఫ‌ర్, గాంధీ వైద్య‌శాల‌లోని ఘ‌ట‌న‌ల మీద మంత్రి స్పందించారు.

సెక్ర‌టేరియ‌ట్ డి బ్లాక్‌లోని త‌న చాంబ‌ర్ లో వైద్య మంత్రి డాక్ట‌ర్ ల‌క్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా విద్య, వైద్య రంగాలకు సీఎం కెసిఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నార‌న్నారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో వసతులు పెంచి, మెరుగైన వైద్యం అందిస్తున్నామ‌ని చెప్పారు. అందువ‌ల్లే ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల మీద న‌మ్మ‌కం పెరిగి, 20శాతం ఓపి పెరిగిందన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త, పాత‌ జిల్లాల డిఎం అండ్ హెచ్ ఓల తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. అన్ని పిహెచ్ సి , సిహెచ్ సి స్థాయిలో మెరుగైన వసతులు క‌ల్పిస్తున్నామ‌ని మంత్రి వివ‌రించారు. రాష్ట్రంలోని 17 హాస్పిటల్స్ లో ఐసియూలు ఏర్పాటు చేస్తున్నామ‌ని మంత్రి చెప్పారు. 40 హాస్పిటల్స్ లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.

ఎన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా, అప్ర‌మ‌త్తంగా ఉంటున్నా, అక్క‌డ‌క్క‌డా, అప్పుడుప్పుడు కొన్ని అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొన్ని సంద‌ర్భాల్లో లేని, జ‌ర‌గ‌ని సంఘ‌ట‌న‌లు కూడా స‌మ‌స్య‌గా మారుతున్నాయ‌ని చెప్పారు. అయితే ప్ర‌భుత్వం స‌ర్కార్ ద‌వాఖానాల్లో వైద్య ప‌రిక‌రాలు, స‌దుపాయాలు పెంచుతుండ‌టం, విస్త‌రిస్తుండ‌టం, మ‌రోప‌క్క పేద‌లు మ‌రింత‌గా ప్ర‌భుత్వ ద‌వాఖానాల ప‌ట్ల ఆక‌ర్షితుల‌వుతుండ‌టం వ‌ల్ల కొంత ఒత్తిడి కూడా ప‌డుతున్న‌ద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ పేద‌ల ప‌క్ష‌పాతిగా ప్ర‌భుత్వం మాన‌వీయ దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌న్నారు.

నీలోఫ‌ర్ హాస్పిట‌ల్‌లో ఈ మ‌ధ్య ఐదుగురు బాలింత‌లు మృతి చెందిన ఘ‌ట‌న‌ల‌పై విచారం వ్య‌క్తం చేస్తూనే, వాళ్ళు చ‌నిపోవ‌డానికి కార‌ణాలేంటి? ఆ పేషంట్ల గ‌త వివిధ స‌మ‌స్య‌ల హిస్ట‌రీ, ఆ రోజు ఏయే స‌మ‌స్య‌లు వాళ్ళ‌కున్నాయి? అస‌లు ఏం జ‌రిగంంద‌న్న దాని మీద పూర్తి స్థాయి విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు మంత్రి చెప్పారు. అనెస్తీషియా డాక్ట‌ర్ దీప్‌రాజ్ సింగ్‌, పేట్ల బురుజు హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ ప్ర‌తిభ‌, గాంధీలో ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ రాణీల‌తో త్రిస‌భ్య క‌మిటీని నియ‌మించామ‌న్నారు. ర‌క్త ప‌రీక్ష‌లు, మందుల అనాల‌సిస్‌, ఆప‌రేష‌న్ థియేట‌ర్లు, డెత్ ఆడిట్‌ వంటి అన్ని ర‌కాల ప‌రిశోధ‌న చేప‌ట్టార‌న్నారు. విచార‌ణ అనంత‌రం వెలువడే రిపోర్టున‌నుస‌రించి దోషుల మీద చ‌ర్య‌లు తీసుకుంటామని మంత్రి ల‌క్ష్మారెడ్డి చెప్పారు. మూడు నాలుగు రోజుల్లో నివేదిక వ‌స్తుంద‌ని భావిస్తున్నామ‌ని ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా మంత్రి వివ‌రించారు. గ‌త ఏడాది ఒక్క నీలోఫ‌ర్‌లోనే 6,795 డెలివ‌రీలు జ‌ర‌గాయ‌ని, ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 533 ప్ర‌సూతిలు జ‌రిగిన‌ట్లు మంత్రి వివ‌రించారు.

సాధార‌ణంగా నీలోఫ‌ర్ హాస్పిట‌ల్‌కి రెఫ‌ర‌ల్స్ అధికంగా వ‌స్తాయ‌న్నారు. నేరుగా వ‌చ్చేవాళ్ళ‌తోపాటు రోజు 1000 నుంచి 1200 వ‌ర‌కు ఓపీ ఉంటుంద‌ని, 900 నుంచి 1400 వ‌ర‌కు ఐపి ఉంటుంద‌న్నారు. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఎపి ల నుంచి వేలాది పేషంట్లు వ‌స్తుంటార‌ని చెప్పారు. అయితే ప్ర‌సూతిల కోసం వ‌చ్చే పేషంట్ల‌లో అధికంగా కాంప్లికేటెడ్ ఇష్యూస్ తోనే వ‌స్తుంటార‌న్నారు. న‌వ‌జాత శిశువుల‌కి దేశంలోనే మంచి వ‌స‌తులున్న ఏకైక హాస్పిట‌ల్ నీల‌ఫ‌ర్ అంటూ, దేశ విదేశాల నుంచి అనేక మండి డాక్ట‌ర్లు నీలోఫ‌ర్ శిక్ష‌ణ‌కు వ‌స్తుంటార‌ని వివ‌రించారు.

గాంధీలో సాయి ప్ర‌వ‌ళిక అనే బాలిక మృతి స‌హ‌జ మ‌ర‌ణంగా చెప్పారు మంత్రి. ఆమెకు న్యూరో డి జనరేటెడ్ వ్యాధి ఉంది. న్యూ మోనియా, ఫిట్స్ లంగ్స్ ఇన్‌ఫెక్ష‌న్ వంటి అనేక స‌మ‌స్య‌లున్నాయ‌న్నారు. నాలుగు నెల‌ల క్రితం గాంధీలోనే అడ్మిట్ అయింద‌ని, అప్పుడు కొంత న‌య‌మై డిశ్చార్జ్ అయ్యార‌న్నారు. ఆ త‌ర్వాత ప్రైవేట్ హాస్పిట‌ల్స్ చుట్టూ తిరిగి, ఆమె వ్యాధి ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి ఆరు నుంచి 12 ఏళ్ళ లోపు మ‌ర‌ణం త‌ప్ప‌ద‌ని తేల్చ‌డంతో తిరిగి గాంధీలో గ‌తేడాది డిసెంబ‌ర్ 7న చేర్చార‌న్నారు. అయితే మ‌ధ్య‌లో ప్ర‌వ‌ళిక‌కు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తుండగా చ‌లి రావ‌డంతో ఆ ఫ్లూయిడ్ తీసేశార‌ని, ఆ స‌మ‌యంలోనే బాటిల్‌లో పురుగులు వ‌చ్చాయ‌నే దుమారం రేగింద‌న్నారు. అది స‌మ‌సి పోయాక‌, గ‌త 63 రోజులుగా ప్ర‌వ‌ళిక‌కు గాంధీలో వైద్యం జ‌రుగుతున్న‌ద‌న్నారు. ఆమె బ‌ర్త్ డే ను సైతం గాంధీ వైద్యులు, సిబ్బంది అదే హాస్పిట‌ల్‌లో నిర్వ‌హించిన విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. కాస్త న‌య‌మ‌వ‌గా డిశ్చార్జీకి ప్ర‌వ‌ళిక త‌ల్లిదండ్రులు ఒప్పుకోలేద‌న్నారు. గాంధీలోనే ఉంచార‌ని మంత్రి వివ‌రించారు. జ‌న‌వ‌రి 1వ తేదీన ప్ర‌వ‌ళిక‌కు ఊపిరి తీసుకోవ‌డం ఇబ్బందిగా మార‌డంతో వెంటిలేట‌ర్ పెట్టార‌న్నారు. ఆమెకు అంత‌కుముందు కూడా ఇంటి వ‌ద్ద ఆక్సిజ‌న్ మీదే ఉండేద‌ని త‌ర్వా త తెలిసింద‌న్నారు. 3వ తేదీన డ‌యాలిసిస్ చేశామ‌ని, అప్ప‌టికే మల్టీ ఆర్గాన్ పెల్యూర్‌తో బాధ‌ప‌డుతున్న ప్ర‌వ‌ళిక ఏడ‌వ తేదీన తెల్ల‌వారు జామున మూడు గంట‌ల ప్రాంతంలో మృతి చెందింద‌న్నారు. అంద‌రిలాగే సాధార‌ణ ప‌ద్ధ‌తుల్లోనే ప్ర‌వ‌ళిక శ‌వాన్ని ఆమె తల్లిదండ్రుల‌కు అప్ప‌గించార‌ని చెప్పారు. అయితే ప్ర‌వ‌ళిక త‌ల్లిదండ్రులు ఇంటికి వెళ్ళాక స‌మ‌స్య మ‌రోసారి ర‌క‌ర‌కాలుగా తెర‌మీద‌కు రావ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్నారు.

నిజానికి బెంగుళూరు నిమాన్స్ డాక్టర్లు ప్రవళికకు ఉన్న జ‌బ్బు కార‌ణంగా, బ‌త‌క‌డం క‌ష్ట‌మ‌ని తేల్చార‌ని చెప్పారు. ఆ విషయం ప్ర‌వ‌ళిక తల్లిదండ్రులకు తెలుస‌న్నారు. అయిన‌ప్ప‌టికీ ప్రవళిక మృతిని ఇష్యూ చేయటం బాధాకరమ‌ని మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌వ‌ళిక మ‌ర‌ణం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. అయితే, ప్ర‌వ‌ళిక త‌ల్లిదండ్రులు ప్ర‌భుత్వ సాయం కోసం అభ్య‌ర్థ‌న పెట్టుకుంటే, సాయం చేయడానికి ప్ర‌య‌త్నిస్తామ‌ని మంత్రి వివ‌రించారు. ఇక తామెవరు ప్రవళిక తండ్రిని బెదిరించలేదని స్ప‌ష్టం చేశారు. ఉన్న‌వీ లేనివీ నిర్ధారించుకోకుండా ప్ర‌చారం చేయొద్ద‌ని మంత్రి మీడియాని కోరారు.

వైద్య ఆరోగ్య‌శాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ రాజేశ్వ‌ర్ తివారీ, వైద్య విద్య సంచాల‌కులు డాక్ట‌ర్ ర‌మ‌ణి కూడా మంత్రితోపాటు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *