నీది, నాది, మనది

“స్వామీ ! ఒక ధర్మ సందేహం”
“సంశయించకుండా అడుగు నాయనా!”
“ప్రతిదీ నాది నాది అనుకుంటాం. దీని నుంచి బయటపడే మార్గం లేదా?”
“ఒక చిన్న కధ చెబుతాను. విన్న తరువాత సందేహం వుంటే అడుగు.
“అనగనగా ఒక ఏకాంబరం. ఒకరొజూ పొరుగూరికి వెళ్లి తిరిగొచ్చేసరికి వున్నఇల్లు మంటల్లో తగలబడిపోతోంది. వూరి జనమంతా చేరి చోద్యం చూస్తున్నారు.
ఏకాంబరం గుండె పగిలిపోయింది. తాతలకాలం నాటి ఇల్లు, కళ్ళఎదుటే పరశురామ ప్రీతి అయిపోతోంది. ఎలా! ఎలా! మనసులో ఒకటే బాధ. ఏం చెయ్యలేని నిస్సహాయత. నిన్ననే ఇంటికి బేరం తగిలింది. అసలు ధరకంటే ఎక్కువే ఇవ్వచూపాడు. కానీ ఇంటి మీద మమకారంతో ఏకాంబరం ఒప్పుకోలేదు.
ఇంతలో అతడి పెద్దపిల్లాడు వచ్చాడు. తండ్రి చెవిలో చెప్పాడు.
“మీరు ఊరెళ్ళినప్పుడు అతగాడు మళ్ళీ వచ్చాడు. ఇంకా ఎక్కువకే కొంటానని మాటతో పాటు చాలా మొత్తం బయానాగా ఇచ్చాడు. బేరం బాగా వుండడం వల్ల మీకు చెప్పకుండానే ఒప్పుకున్నాను”
ఈ మాట చెవినపడగానే ఏకాంబరం మనసు స్తిమిత పడింది. ‘అమ్మయ్య ఇప్పుడు ఇల్లు తనది కాదు. ఈ భానన కలగగానే అతడూ చోద్యం చూస్తున్న వారిలో ఒకడిగా మారిపోయాడు. ఇల్లు అగ్నికి ఆహుతి అవుతోందన్న ఆందోళన సమసిపోయింది.
ఇలా ఉండగానే రెండో కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రితో అన్నాడు.
“ఒక పక్క మన ఇల్లు తగలబడి పోతుంటే మీరేంటి, ఇలా నిర్వికారంగా చూస్తూ నిలబడ్డారు?” తండ్రి జవాబు చెప్పాడు. ‘ఇంకెక్కడ మన ఇల్లు. మీ అన్నయ్య నిన్ననే ఎవరికో అమ్మేశాడు” “భలే వారే ! అతడు మనకు బయానా మాత్రమే ఇచ్చాడు, పూర్తి పైకం ఇవ్వలేదు” ఏకాంబరానికి మళ్ళీ దిగులు పట్టుకుంది. కొంతసేపటి క్రితం వరకు వున్న మనాది మళ్ళీ పట్టుకుంది. “అయ్యో! తగలబడుతోంది నా ఇల్లే” అనే స్పృహ తిరిగి ఆవరించింది. ఇంతలో మూడో కుమారుడు వచ్చి మరో మాట చెప్పాడు. “చూశావా నాన్నా మన ఇల్లు కొన్నవాడు యెంత మంచివాడో! ఈ ప్రమాదం రేపు జరిగి వుంటే ఏమయ్యేది. ఇలా జరుగుతుందని మీకూ తెలియదు, నాకూ తెలియదు.  అంచేత మీ నాన్నను బాధపడవద్దని చెప్పు. ఆ ఇల్లు నాదే. మాట ప్రకారం డబ్బు మొత్తం ఇచ్చేస్తానని అన్నాడు”మళ్ళీ సీను రివర్సు. అంటే. ఆ ఇల్లు తనది కాదు. ఈ భావన అంకురించడంతో మళ్ళీ అతడూ నలుగురిలో ఒకడిగా  మారిపోయాడు.
నిజానికి ఏదీ మారలేదు. మారింది అల్లా తనదీ, పరాయిదీ అనే భావన ఒక్కటే”

– భండారు శ్రీనివాసరావు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.