
నిర్ణయాల అమలులో నిర్లక్ష్యమేలా
నిర్లిప్త వైఖరి అధికారులకు సరికాదు
నిర్లక్ష్యం పునరావృతమైతే చర్యలు తప్పవు
అటవీ శాఖ మంత్రి, జపాట్ చైర్మన్ జోగు రామన్న ఆగ్రహం
జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (జపాట్) సమావేశం
హైదరాబాద్, నవంబర్ 9 : కీలక సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలులో అధికారులు అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఎలా అని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అరణ్య భవన్లో జరిగిన రాష్ర్ట స్థాయి జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (జపాట్) పాలక మండలి సమావేశంలో మంత్రి జోగు రామన్న అంశాల వారీగా క్షుణ్ణంగా సమీక్షించారు. గతంలో జరిగిన పాలకవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌లను ఒక్కొక్కటిగా సమీక్షించారు. అందులో అనేక నిర్ణయాలు ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడంతో మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. జపాట్ అధికారుల తీరు పట్ల మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిర్ణయాల అమలులో అధికారులకు నిర్లిప్త వైఖరి సరికాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్లక్ష్యం పునరావృతమైతే చర్యలు తప్పవు అని ఆయన హెచ్చరించారు. ఉదాహరణకు.. హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్‌ను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో అభివృద్ధి చేయాలన్న నిర్ణయంలో అధికారులు దాటవేసే పద్దతిని అనుసరించడం. నెహ్రూ జూ పార్క్‌లో 15 బ్యాటరీ వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించగా.. అందులో 10 బ్యాటరీ వాహనాలు మాత్రమే కొనుగోలు చేశారు. ఏడు పశు వైద్యాధికారుల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించగా అందులో కేవలం 3 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. నెహ్రూ జూ పార్క్ అంతటా సీసీ కెమెరాలను బిగించాలని పది నెలల కిందట తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ అమలు కాలేదు. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్న నిర్ణయం అమలుకు నోచుకోలేదు. వెటర్నరీ శాఖ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్న నిర్ణయమూ అమలు కాలేదు. జూ పార్కులకు వచ్చే సందర్శకులకు కనీస సౌకర్యాలు నెలకోల్పాలన్న నిర్ణయాలు కూడా అమలు కాలేదు. ఇలా అనేక అంశాలను మంత్రి జోగు రామన్న గురువారం జరిగిన సమావేశంలో లేవనెత్తి.. అధికారులను నిలదీశారు. దీంతో జపాట్ అధికారులు నీళ్లు నమిలారు. ఈ సందర్భంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ కల్పించుకుని ఈ పరిస్థితిని చక్క దిద్ది త్వరలోనే సమగ్ర నివేదికను అందజేస్తానని మంత్రికి హామినిచ్చారు. ఆ తరువాత పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. వార్షిక ప్రణాళికను ఆమోదించారు. ఈ సమావేశంలో పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝా, వైల్డ్‌లైఫ్ పీసీసీఎఫ్ మనోరంజన్ భాంజా, జపాట్ సభ్య కార్యదర్శి కుక్రేటీ, క్యరేటర్ శివాని డోంగ్రె, వరంగల్ సీఎఫ్ అక్బర్, తదితరులు పాల్గొన్నారు.