నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: రేవంత్ రెడ్డి

నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర్రంలో నిరుద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ వచ్చాక కాంట్రాక్టు, ఔట్ సోరింగ్స్ ఉద్యోగాలన్నింటినీ పర్మినెంట్ చేస్తామని హమీ ఇచ్చిన కేసీఆర్ ప్రస్తుతం ఉన్నవారిని తొలగించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర్రం వచ్చిన తరువాత కూడా ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగాల నియామకాలు చేపట్టడం నిరుద్యోగులను మోసగించమేనని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర్ర హౌసింగ్ కార్పొరేషన్ కు చెందిన ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగులు గురువారం ఉదయం రేవంత్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి తమ సమస్యలను వెల్లబోసుకున్నారు. రాష్ట్ర్ర గృహ నిర్మాణ సంస్ధలో 2006 నుంచి ఔట్ సోర్సింగ్ విధానంలో ఐటీ మేనేజర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, అకౌంట్ అసిస్టెంట్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్, వర్క్ ఇన్స్ పెక్టర్స్, అటెండర్స్, వాచ్ మెన్ లుగా వివిధ హోదాలల్లో పనిచేస్తున్న 1179 మందిని గత మార్చి నెలలో ఉన్న పళానా ప్రభుత్వం తొలగించిందని దీంతో తామందరమూ వీధుల్లో పడ్డామని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ప్రజలను మాయ చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగి ఉండేలా చూస్తానని హమీ ఇచ్చి ప్రస్తుతం ఉన్నవారిని కూడా తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కొత్త జిల్లాలు, కొత్త కార్యాలయాలకు కావల్సిన ఉద్యోగులను కొత్తగా తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్న కేసీఆర్ కు ప్రస్తుతం రాష్ట్ర్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎందుకు గుర్తు రావడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగాలు లేని సమయంలో అతి స్వల్ప వేతనాలకే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా చేరి సేవలందిస్తున్న వారిని పట్టించుకోకపోవడం సమంజసం కాదన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండరని ఆవిధంగా పనిచేస్తున్న వారందరినీ తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తామని హమీ ఇచ్చిన కేసీఆర్ ప్రస్తుతం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. బంగారు తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే
ఉండరని చెప్పిన ప్రభుత్వం మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ పధకాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కొత్తగా తీసుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని, దీంతో తమ జీవితాలు బాగుపడతాయని గత మూడేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారని చెప్పారు. అయితే పర్మినెంట్ చేసే మాటటుంచి ఉన్నవారిని ఊడబెరకడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని అందులో భాగంగానే హౌసింగ్ కార్పోరేషన్ కు చెందిన ఉద్యోగులను కూడా తొలగించారని ఆయన ఆరోపించారు. ఔట్ సోర్సింగ్ విధానంలో గడిచిన దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించి రోడ్డున పడేస్తే వారి పరిస్ధితి ఏమిటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో కొత్తగా తీసుకుంటున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లోనూ ఏజెన్సీలు చేతివాటం చూపిస్తున్నాయని
వారికి చెల్లించాల్సిన మొత్తాలను కాకుండా స్వల్ప మొత్తాలను చెల్లిస్తూ వారి శ్రమను దోపిడి చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకునే జూనియర్ అసిస్టెంట్ లకు రెగ్యులరైజేషన్, ఈపీఎఫ్, ఈఎస్ఐ, సర్వీస్ టాక్స్, ఎజెన్సీ కమీషన్ లను కలిపి
రూ, 20,600 చెల్లిస్తుండగా ఏజెన్సీలు ఈ మొత్తంలో కేవలం రూ. 13 వేలు మాత్రమే చెల్లిస్తున్నాయని దీంతో చాలీచాలని వేతనాలతో ఉద్యోగుల జీవితం దుర్భరంగా మారుతోందని ఆయన వాపోయారు. కేసీఆర్ గతంలో మాట ఇచ్చిన విధంగా కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయటానికి తక్షణం చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. నిధులు లేవన్న కారణంగా తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగాలను ఇవ్వాలని కోరారు. పర్మినెంట్ చేసే ప్రక్రియ ఆలస్యమైన పక్షంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేలు చేయడానికి వారిని కనీసం కాంట్రాక్టు పరిధిలోకి చేరుస్తూ హెచ్ ఆర్ పాలసీని ఏర్పాటు చేస్తే కొంతలో కొంత మేలు జరుగుతుందని సూచించారు. ప్రభుత్వం కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాలలో వారికి వేయిటేజీ ఇవ్వాలని కూడా ఆయన కోరారు. రాష్ట్ర్ర వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ విషయంలో జరుగుతున్న జాప్యం ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలతోపాటు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై కూడా రాబోయే అసెంబ్లీ సమావేశాలలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించారు. ప్రభుత్వం చేస్తున్న అన్నాయంపై నిరుద్యోగులు చేసే ఆందోళనలకు తెలుగుదేశం పార్టీ తరుపున తాము పూర్తి స్ధాయిలో మద్దతునిస్తామని రేవంత్ హమీ ఇచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *