
ప్రకాశం, ప్రతినిధి : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిన వ్యక్తి కటకటలాపాలయ్యాడు. నిరుద్యోగుల నుండి సుమారు మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో విజయభాస్కర్ అనే వ్యక్తి బీఈడీ కాలేజీని నిర్వహిస్తున్నాడు. ఏపీ రాష్ట్రంలో తనకు పలుకుబడి ఉందని, అందుచేత తాను కళాశాల స్థాపించడం జరిగిందని ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి నమ్మబలికించే ప్రయత్నం చేశాడు. తనకు వివిధ శాఖల్లో పలుకుబడి ఉందని, తాను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. ఇతని మాటలు నమ్మిన నిరుద్యోగులు విజయ భాస్కర్ అడిగిన డబ్బులను ముట్టచెప్పారు.
ప్రకాశం జిల్లాతో పాటు ఇతర జిల్లాలో కూడా మోసం చేసినట్లు భావిస్తున్నారు. నిరుద్యోగులను మోసం చేసిన విజయ భాస్కర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఎంత మందిని మోసం చేశాడు ? నిరుద్యోగుల నుండి ఎంత వసూలు చేశాడనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.