నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మంత్రి హరీశ్ రావు పర్యటన

కాళేశ్వరం 20,21,22 ప్యాకేజీలను వేగవంతం చేయాలి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్ష.

కాళేశ్వరం లింక్ 7 పనులతో కామారెడ్డి,నిజామాబాద్ సస్యశ్యామలం.

ఏప్రిల్ 3,4 తేదీల్లో  కాళేశ్వరం పనుల పరిశీలన.

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కాళేశ్వరం పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింకు 7 కు చెందిన 20,21,22 ప్యాకేజీ ల పనుల పురోగతిని మంత్రులు హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం ఇక్కడ అసెంబ్లీ కమిటీ హాలులో సమీక్షించారు.ఈ పనులన్నీ పూర్తి అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరవు కాటకాలు ఉండవని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీరాం సాగర్ పునరుజ్జీవ పథకం,  కాళేశ్వరం పనులను క్షేత్ర స్థాయిలో స్వయంగా  పరిశీలించడానికి  ఈ రెండు జిల్లాల్లో ఏప్రిల్ 3,4 తేదీల్లో పర్యటించాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు నిర్ణయించారు.ఈ మూడు ప్యాకేజీలకు ప్రత్యేకంగా పర్యవేక్షణ కోసం ఒక  ఎస్.ఇ .ని  నియమిచాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.21,22 ప్యాకేజీల కింద కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ప్రతిపాదించిన 4 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం పనులను మరింత వేగవంతం చేయాలనీ మంత్రి ఆదేశించారు.20,21,22 ప్యాకేజీల లో 6 రిజర్వాయర్లను 8.50 టి.ఎం.సిల స్టోరేజీ సామర్ధ్యంతో నిర్మిస్తున్నట్టు హరీశ్ రావు తెలిపారు. మధ్య ప్రదేశ్  లో విజయవంతమైన పైప్డ్ ఇరిగేషన్ విధానాన్ని ప్రయోగాత్మకంగా తెలంగాణలో ప్యాకేజీ 20 లో అమలు చేస్తున్నట్టు తెలిపారు.21 ప్యాకేజీ లో 2 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకు రానున్నట్టు మంత్రి హరీశ్ రావు చెప్పారు.ప్యాకేజీ 21  పైప్డ్ ఇరిగేషన్ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయినందున అగ్రిమెంట్ కుదుర్చుకొని వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు.ఇందల్ వాయి, రామడుగు,కంజర, బొడ్డుమాముడి, ఎదుల్ల చెరువులను కాళేశ్వరం నీళ్లతో నింపడానికి పరిశీలించాలని సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో హైడ్రాలజి క్లియరెన్స్ ఉన్న లిఫ్ట్ పథకాలను ప్రభుత్వ ఆమోదానికి పంపాలని ఆదేశించారు.నిజాం సాగర్ దిగువన మంజీర నదిపై చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న నాగమడుగు ఎత్తిపోతల పథకం డి. పి .ఆర్ నీ ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. జుక్కల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో  ఈ పథకం ద్వారా  సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.శ్రీ రాంసాగర్ ఆయకట్టు కింద రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అమలవుతున్న శ్రీరాంసాగర్ పునరుజ్జీవన  పనుల పురోగతిని మంత్రి ఏప్రిల్ 3,4 తేదీల్లో సమీక్షించనున్నారు. కాళేశ్వరం నుంచి వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ జలాశయానికి గోదావరి జలాలను మళ్ళించి శ్రీరాంసాగర్‌కు తిరిగి ఊపిరి పోసి పునర్ వైభవం కల్పించడం ఈ పథకం లక్ష్యమని మంత్రి తెలిపారు.

శ్రీరాంసాగర్ వరద కాలువనే జలాశయంగా మార్చి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ జలాశయానికి నీటి తరలింపు వల్ల శ్రీరాంసాగర్ మళ్ళీ జలకళను సంతరించుకుంటుందన్నారు. 1067 కోట్ల ఖర్చుతో ఈ పునరుజ్జీవన పథకం చేపట్టామని హరీశ్ రావు చెప్పారు . ఎస్.ఆర్.ఎస్.పి పునరుజ్జీవన పథకంలో భాగంగా 22వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం కలిగిన వరద కాలువను రిజర్వాయర్‌గా మార్చుతున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ప్యాకేజీలు 20, 21,22 కింద అప్రోచ్ చానల్స్,టన్నెల్స్, సర్జ్ పూల్ తదితర నిర్మాణ పనులన్నింటినీ వేగవంతం చేయాలని ఇరిగేషన్ మంత్రి కోరారు.ప్యాకేజీ 20,21 కింద నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో 1,06311 ఎకరాలు, ఆర్మూరు లో 1876 ఎకరాలు, బాల్కొండ నియోజకవర్గంలో 71,262 ఎకరాలు, జగిత్యాల నియోజకవర్గంలో 20,000 ఎకరాలు సాగులోకి వస్తాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు. సమీక్షా సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, హనుమంతు షిండే,గంప గోవర్ధన్, ఆశన్నగారి జీవన్
రెడ్డి,ఏనుగు రవీందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ప్రశాంతరెడ్డి, కాళేశ్వరం సి.ఇ. లు హరిరాం,మధుసూదనరావు, వివిధ ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.