నార్త్ తెలంగాణ కరవుకు ‘ముక్తి’మార్గం కాళేశ్వరం.

జల తెలంగాణ.
———————–
నార్త్ తెలంగాణ కరవుకు
‘ముక్తి’మార్గం కాళేశ్వరం.
‘ప్రత్యేక’ ప్రాజెక్టు.
———————
మూడు బ్యారేజీలు.
మూడు పంప్ హౌజ్ లు.
మూడు రోజులు.
మూడు షిఫ్టులు.
ఒక ప్రాజెక్టు.
———————-
‘హై స్పీడ్’ప్రాజెక్టుగా కాళేశ్వరం నవచరిత్ర.
————————–
అడవీ,గోదావరి పెనవేసుకున్న చోట రాత్రీ పగలూ ఏకమైనవి. సుందిళ్ళ, అన్నారం,మేడి గడ్డ బ్యారేజీ లు,పంపు హౌజ్ లు నిర్మాణమవుతున్న చోట విద్యుత్ దీపాల కాంతి పగటిని వెక్కిరిస్తున్నది.దాదాపు 125 కిలోమీటర్ల దూరం దాకా ‘గంగ’ను కాళేశ్వరం తన నెత్తిన పెట్టుకొనబోతున్నది. ‘కాళేశ్వరం’
సగం తెలంగాణను ఆకు పచ్చగా మార్చబోతున్నది. ఆ ప్రాంతమంతా పచ్చని బయలు కానున్నది. మంత్రి హరీశ్ రావు మాటల్లో చెప్పాలంటే కాళేశ్వరం ఇండియా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి దిక్సూచి అవుతుంది. ఒక భారీ ప్రాజెక్టు ను ఎంత వేగంగా పూర్తి చేయవచ్చునో చెప్పేందుకు మోడల్ కానుంది.
కేసీఆర్ ప్రసవించిన ‘మేధో సంతానం’ వచ్చే వానాకాలం నడక నేర్చుకుంటుంది.ఉరుకులు,పరుగులుపెడుతుంది. ప్రవహిస్తుంది.పోటెత్తుతుంది. ఉత్తర తెలంగాణ పొలాల నరాల గుండా అది వెచ్చగా పారుతుంది.పొలంలో పంటగానూ మారుతుంది.
అది కాళేశ్వరంప్రాజెక్టు.కాళేశ్వరముక్తీశ్వరస్వామి దీవెనలతో మేడిగడ్డ పైన  భూమిపూజ చేసుకున్నది.’తెలంగాణ జీవగడ్డ’గా మేడిగడ్డ మారుతున్నది.తెలంగాణ రైతుకు సాగునీరందించాలన్నా, ఈ ప్రాంతంలో రైతు ఆత్మహత్యలను అదుపు చేయాలన్నా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దవలసి ఉంది. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంది. ఆన్ గోయింగ్ పధకాలను పూర్తి చేయవలసి ఉన్నది. ఎంత ఖర్చుకైనా వెరవకుండా ప్రాజెక్టులు నిర్మించాలని కెసిఆర్ తలపోశారు. దాని ఆచరణ ను ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు తలకెత్తుకున్నారు. అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల దశ-దిశ ను రీడిజైనింగ్ తో కేసీఆర్ మలుపు తిప్పారు. మంత్రి హరీశ్ రావు మూడు రోజుల పాటు గోదావరి తీరాన, అడవుల్లో, మూడు బ్యారేజీలు,మూడు పంపు హౌజ్ లలో అలుపు లేకుండా పర్యటించారు. క్షేత్రస్థాయిలో  సమస్యలు తెలుసుకున్నారు. సి.ఎం.కల నెరవేర్చేందుకు పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
ఉమ్మడి రాష్ట్రంలో  పంట నష్టం పరిహారం కింద వెయ్యి కోట్లు కేంద్రం పంపితే 900  కోట్లు ఆంధ్రాకు పంపిణీ  చేశారు. విత్తనాల కోసం 24 గంటలు ఇంటిల్లిపాది వంతులు వేసుకొని క్యూ లో నిల్చున్న ఘటనలూఉన్నవి.సకాలంలో ఎరువులు అందక రాస్తారోకోలు, ధర్నాలు జరిగాయి. ప్రతిపక్షాలు తమ ఉనికి కోసమే రైతుల కోసం  మొసలి కన్నీరు కారుస్తున్నారని జనం బలంగా అనుకుంటున్నారు.గతంతో పోల్చుకుంటే తెలంగాణలో రైతుల పరిస్థితి  మెరుగ్గా ఉంది. తెలంగాణ ఉద్యమం ఏ కారణాలతో జరిగిందో , ఏ అన్యాయాలను సరిదిద్దడానికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో … ఆ ‘పట్టాల ‘ మీదనే కెసిఆర్ ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలుగా ప్రయాణిస్తున్నది. ఈ ప్రయాణం ముళ్లబాట . ఎన్నో అడ్డంకులు.మరెన్నో ఒడిదుడుకులు.ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఏలిన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు చేసిన పాపాలను ఒక్క రోజులో, ఒక్క నెలలో, ఒక సంవత్సరంలో తుడిచిపెట్టడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. చంద్రబాబు హయాంలో ఇరిగేషన్ వంటి కీలక రంగాలను నిర్లక్ష్యం చేశారు. అందుకు టిడిపి భారీ మూల్యం చెల్లించుకున్నది.  రాజశేఖర రెడ్డి  ‘జల యజ్ఞ’ ఫలాలు రైతాంగానికి అందలేదు. తెలంగాణ రాష్ట్రమే ‘నీళ్ళు, నిధులు, నియామకాల ‘ డిమాండ్ తో పోరాడి తెచ్చుకున్నాo. ఆ దిశగానే కోటి ఎకరాల సాగునీటి కల్పన లక్ష్యంతో సీఎం కెసిఆర్ ముందుకు పోతున్నారు.18 .80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం,మరో18 లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకురాగలిగిన కాళేశ్వరం కెసిఆర్ ‘ కోటి ఎకరాల మాగాణి’లో మూడో వంతు ఆక్రమిస్తుండడం విశేషం.
ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరువరకు నీటి తరలింపునకు అనుగుణంగా పనులు పూర్తవుతున్నవి.కనుక  మోటర్లను ప్రారంభించేందుకు అధికారులు రంగం సిద్ధంచేశారు. ఇందులో అత్యంత కీలకమైన ప్యాకేజీ-8లోని పంపుహౌజ్‌లో భారీ మోటర్ డ్రైరన్‌కు కూడా  అధికారులు ఏర్పాట్లుచేశారు.  నల్లగొండ జిల్లాలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టును మొదలుపెట్టినపుడు ఆసియాలోనే అది  అతి పెద్ద లిఫ్టు పథకం.ఇందులో ఒక్కో మోటరు 600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్నవి. ఆ తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 30 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లికి నీటిని తరలించిన తర్వాత గ్రావిటీపై జలాలు మేడారం రిజర్వాయర్‌కు వస్తాయి. మేడారం రిజర్వాయర్ నుంచి 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు మోటర్లతో నీటిని లిఫ్టు చేస్తారు. రామడుగు వరకు వచ్చిన ఆ నీటిని అక్కడి పంపుహౌజ్ నుంచి 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు మోటర్ల ద్వారా ఎత్తి ఎస్సారెస్పీ వరద కాల్వలో పోస్తారు. దీంతో జలాలు మిడ్‌మానేరుకు చేరుతాయి. రామడుగు వద్ద ఉన్న పంపుహౌజ్‌లో బిగించిన 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్‌కు డ్రైరన్కు సన్నాహాలు సాగుతున్నవి.
రామడుగు పంపుహౌజ్‌లో బిగించే ఒక్కో మోటర్‌ద్వారా సుమారు 3001 క్యూసెక్కుల డిశ్చార్జి ఉంటుంది. అంటే ఏడు మోటర్ల ద్వారా దాదాపు రెండు టీఎంసీలు ఎత్తిపోయనున్నారు. ఇది ఆసియాలోనే రికార్డు. నెల వ్యవధిలోనే ఒక్కో మోటర్ బిగింపును పూర్తిచేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఎల్లంపల్లి-మిడ్ మానేరు మార్గాన్ని సిద్ధం చేసుకొని మేడారం, అన్నారం, సుందిల్ల పంపుహౌజ్‌లోనూ మోటర్ల ట్రయల్న్స్ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.కాళేశ్వరం పథకంలో మూడు బరాజ్‌లు, మూడు పంపుహౌజ్‌ల పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. బరాజ్‌లు పూర్తికాకున్నా కొంతమేర పని అయినా రోజుకు రెండు టీఎంసీలను ఎత్తిపోసేలా నీటి లభ్యత ఉంటే చాలు. ఇప్పటికే ఆ దశ పనులు కూడా ఎప్పుడో పూర్తయ్యాయి. మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు పనులు కొనసాగుతున్నాయి. మేడారం, అన్నారం, సుందిల్ల పంపుహౌజ్‌లను పూర్తి చేసేందుకు  మంత్రి హరీశ్ రావు ఇరిగేషన్ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.ఈ మూడు పూర్తయితే గోదావరి జలాలను ఎల్లంపల్లికి తరలించవచ్చు.   ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు జలాల తరలింపు పనులు ప్యాకేజీ-6 నుంచి 8 వరకు పూర్తి చేయాలన్న టార్గెట్ ను ప్రభుత్వం ప్రకటించింది.
రీ డిజైన్‌ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్ర జలసంఘం నుంచి అంతర్రాష్ట్ర క్లియరెన్సు సహా పలు కీలక అనుమతులను పొందింది. సీడబ్ల్యూసీ నిబంధనలకు అనుగుణంగా ప్రాజెక్టును ముఖ్యమంత్రి కెసిఆర్  రీ-డిజైన్‌  చేశారు. గోదావరి నదిలో కాళేశ్వరం వద్ద నీరు పుష్కలంగా ఉన్నట్లు  సి.ఎం. గుర్తించారు.  మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించాలని కెసిఆర్ నిర్ణయించారు. సీడబ్ల్యూసీ సూచనల మేరకు జలాశయాల సామర్థ్యాన్ని 11 టీఎంసీల నుంచి 147 టీఎంసీలకు పెంచారు.  రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా రీ-డిజైన్‌ చేశారు. ఇరిగేషన్ రంగంలో సమస్యలు పరిష్కరిస్తేనే ఆకు పచ్చని తెలంగాణను నిర్మించడం సాధ్యపడుతుందని కేసీఆర్ బలంగా నమ్మారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం తీసుకోవలసిన అనుమతుల ప్రక్రియ పూర్తి అయింది.  దశాబ్దాల తరబడి ఎదుర్కొన్న సాగునీటి కష్టాలను దూరం చేయడానికి కాళేశ్వరం శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు తన మూడు రోజుల పర్యటన లో సూచించారు.
 ఎస్.కె.జకీర్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *