నాటిన మొక్కలన్నింటిని రక్షించాలి: నీతూప్రసాద్

కరీంనగర్: హరితహరం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నాటిన మొక్కలన్నింటిని రక్షించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేటు నుండి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓ.లు, స్పెషల్ ఆఫీసర్లతో హరితహరం, జిల్లాల పునర్విభజన, స్వచ్చ భారత్ కార్యక్రమాల అమలు పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంతవరకు నాటిన మొక్కలలోచనిపోయిన వాటి స్ధానంలో వెంటనే తిరిగి మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించారు. నాటిన మొక్కలన్నింటికి రక్షణ ఏర్పాట్లు చేసి నీరు పోసి కనీసం 85-90 శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మొక్కల రక్షణకు సెప్టెంబర్ నుండి నెలకు 4 సార్లు నీరు పోయుటకు ప్రభుత్వం అనుమతించిందని, వర్షాలు లేని సమయంలో నీరు పోసి మొక్కలన్ని బతికేలా చూడాలని ఆదేశించారు. జిల్లా, మండల అధికారులు ప్రతివారం గ్రామ సందర్శన పర్యటనల సందర్భంగా తప్పకుండా ఆయా గ్రామాలలో నాటిన మొక్కలను తనిఖీ చేయాలని మొక్కల పరిస్ధితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలో 4 కోట్లకు పైగా హరితహరం కార్యక్రమంలో మొక్కలు నాటి రాష్ట్ర్రంలో జిల్లా 3వ స్ధానంలో నిలిచిందని తెలిపారు. జిల్లాలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు నాటిన మొక్కలన్నింటిని చిన్న పిల్లల్లా కాపాడాలని కోరారు. వివిధ శాఖల ద్వారా నాటిన మొక్కల వివరాలన్నింటిని ఆన్ లైన్లో నమోదు చేయాలని జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్ని శాఖలలో గల కరెంటు ఫైల్లు, డిస్పోజల్ ఫైల్స్ అన్నింటిని రెండు రోజుల్లోగా ఆన్ లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇంతవరకు 60 శాతం ఫైల్స్ ఆన్ లైన్లో అప్ లోడ్ చేశారని ఇంకా 40 శాతం ఫైల్స్ అప్ లోడ్ చేయుటకు పెండింగులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమాల్లోని అన్ని రికార్డులు స్కానింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా పెద్దపల్లి, జగిత్యాల కొత్త జిల్లాలకు ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు కేటాయించామని తెలిపారు. కేటాయించిన భవనాలలో అక్టోబర్ 5 లోగా కావలసిన మరమ్మత్తులు చేయించి అవసరమైన ఫర్నిచర్స్ తో, కంప్యూటర్స్ సమకూర్చుకుని విధులు నిర్వహించుటకు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయాలకు అనువైన భవనాలను గుర్తించాలని కలెక్టర్ ఆర్టీఓను ఆదేశించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఐ.ఎస్.ఎల, నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. పూర్తయిన ఐ.ఎస్.ఎల్.లకు నిధుల కొరత లేదని ఆన్ లైన్లో అప్ లోడ్ చేసిన వెంటనే బిల్లులు చెల్లిస్తారని సూచించారు. జిల్లాలో ఇంతవరకు సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి నియోజకవర్గాలను బహిరంగ మలవిసర్జన రహిత నియోజకవర్గాలుగా ప్రకటించామని తెలిపారు. అక్టోబర్ 2వరకు మానకొండూర్, హుజురాబాద్ నియోజకవర్గాలలో వందశాతం ఐ.ఎస్.ఎల్. నిర్మాణాలు పూర్తిచేసి బహిరంగ మలవిసర్జన రహిత నియోజకవర్గాలుగా ప్రకటించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఏ మండలంలోనైనా వందశాతం ఐ.ఎస్.ఎల్. పూర్తిచేసిన గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ శ్రీదేవ సేన, నగర పాలకసంస్ధ కమీషనర్ కృష్ణభాస్కర్ అదనపు జెసి నాగేంద్ర, డి.ఆర్.ఓ. టి.వీరబ్రహ్మయ్య, డ్వామా పిడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *