నష్టపోయిన వారిని ఆదుకుంటాం: ఈటెల

కరీంనగర్: ఎస్.ఆర్.ఎస్.పి. కెనాల్ కు పడిన గండి వలన నీటి ప్రవాహంలో వివిధ గ్రామాల ప్రజలు, ఆస్తులు, పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర్ర ఆర్ధిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మల్యాల మండలం మానాల గ్రామం వద్ద ఎస్.ఆర్.ఎస్.పి. డి-65 తూము వద్ద మంగళవారం ఉదయం గండిపడి మానాల, మ్యాడంపల్లి, చిల్వకోడూర్ గ్రామాలలోని చెరువులలో భారీగా నీరు ప్రవేశించి గండ్లుపడి గ్రామాలలోనికి నీరు ప్రవేశించడం వలన కొంత మేర ఆస్తి నష్టం జరిగిందని, పంట పొలాలు నీటిలో మునిగి పోయాయని తెలిపారు. నష్టపోయిన వారందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి 150 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించామని అన్నారు. నీటి ఉధృతి తగ్గిన తర్వాత రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో నష్టం అంచనా వివరాలు సేకరిస్తామని మంత్రి తెలిపారు. వీరికి 3,800 రూపాయల నగదు, 20 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్ పంపిణి చేస్తామని మంత్రి తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, పాక్షికంగా కొన్ని ఇండ్లు దెబ్బ తిన్నాయని పంటలు నీటితో మునిగి పోయాయని తెలిపారు. తక్కళ్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో పునరావాస కేంద్రానికి బాదితులను తరలించి భోజన, వసతి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. నిప్పు, నీటితో చలగాటం ఆడవద్దని మంత్రి ఈ సందర్భంగా ప్రజలతో అన్నారు. గ్రామ అవసరాలకు చెరువులు నిండాలనే ఉద్ధేశ్యంతో కాలువలకు రంధ్రాలు చేయకూడదని, ఇలాంటి పనులు చేయడం వలన ప్రజలు నష్టపోతారని, నీటి ఉధృతిని ప్రజలు వీక్షిస్తున్నారని కనుక ఇలాంటి పై సమాచారాన్ని అధికారులకు అందించాలని అన్నారు. ఎట్టి పరిస్దితుల్లోను ఎస్.ఆర్.ఎస్.పి. కాలువకు గండ్లు పెట్టవద్దని, ఇలాంటి వాటిని నాయకులు ప్రోత్సహించకూడదని హితవు పలికారు. చొప్పదండి శాసన సభ్యురాలు బొడిగే శోభ మాట్లాడుతూ, గత సంవత్సరం రాళ్ల వర్షం వలన పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని, ఇప్పడు ఈ వరద నష్టం వలన రైతులు మరింత నష్టపోయారని వారందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. సంఘటన వివరాలు తెలిసినప్పటి నుండి అధికార యంత్రంగం అప్రమత్తమై తక్షణ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మండలంలోని అగ్గిమల్ల నుండి లింగాపూర్ కు వెళ్లే రహదారి పై పూర్తిగా నీరు రావడంతో రాకపోకలు స్తంభించాయి. జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ఉదయం నుండి మానాల గ్రామం వద్ద గండిపడిన ప్రాంతాన్ని సందర్శించి ఎస్.ఆర్.ఎస్.పి. ఎస్.ఇ.ని వివరాల సేకరించి మండలంలోని ఆయా గ్రామాలలో మానాల, దమ్మక్క చెరువు, మ్యాడంపల్లి చెరువు, సుద్దపల్లి బోయచెరువు, రాఘవపట్నం మొగుళ్లపల్లి చెరువు, చిల్వకోడూర్ గ్రామంలోని వాగును సందర్శించి తక్షణ సహయక చర్యలు చేపట్లాలని రెవెన్యూ, పోలీసు, స్ధానిక ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. చిల్వకోడూర్ గ్రామంలో ప్రజలను అప్రమత్తం చేసి వాగు పక్కనే ఉన్న పాఠశాలలకు సెలవు ప్రకటించి విద్యార్ధులను వారి ఇండ్లకు పంపించారు. ప్రతి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా రెవెన్యూ సహయకులను, రెవెన్యూ సిబ్బందిని శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులను అప్రమత్తం చేశారు. జగ్దేవపూర్ గ్రామంలోని జంగల్ నాల ప్రాజెక్టులోని ఈ నీటి ఉధృతి వెళ్లనున్న దృష్ట్యా అక్కడ వేసిన ర్యాంపును తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఉదయం నుండి సాయంత్రం పొద్దు పోయే వరకు అధికారులకు సూచనలు అందిస్తూ, ప్రజా ప్రతినిధుల సహకారం కోరుచూ ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి వెంటది వెంటనే సమాచారాన్ని కలెక్టర్ అందించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ చిల్వకోడూర్ లో జిల్లా కలెక్టర్ ద్వారా పూర్తి వివరాలు సేకరించి ఆయా గ్రామాలను సందర్శించారు. జాయింట్ కలెక్టర్ శ్రీదేవ సేన, అదనపు జాయింట్ కలెక్టర్ డా.ఎ. నాగేంద్ర లను గ్రామాలలో ఉండి ఎప్పటి కప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సత్వర చర్యలు చేపట్టేందుకు కలెక్టర్ ఆదేశించారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ ఛైర్మన్ తుల ఉమ, నాయకులు ఈద శంకర్ రెడ్డి, తదితరలు ఉన్నారు. ఉదయం నుండి కలెక్టర్ వెంట జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక్, జగిత్యాల డి.ఎస్.పి. రాజేంద్ర ప్రసాద్, తహసీల్దార్తు, స్ధానిక, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

varsam     tula-uma     eatela      nethu-prasad

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *