నల్గొండ, ప్రతినిధి : జిల్లాలో భారీగా పట్టుబడ్డ బంగారం కలకలం సృష్టిస్తోంది. ఎలాంటి ఆధారాలూ లేకుండా తరలిస్తున్న సుమారు 5 కోట్ల రూపాయల విలువగల బంగారాన్ని సీటీవో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు సెక్యూరిటీ వాహనంలో విశాఖ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న బంగారాన్ని.. నల్గొండ జిల్లా కోదాడ సమీపంలో అధికారులు పట్టుకున్నారు.
మొత్తం 5 కోట్ల 73 లక్షల 36 వేల రూపాయలు విలుగల బంగారంలో… 73 లక్షల 36 వేల విలువైన బంగారానికి మాత్రమే వాహన డ్రైవర్ బిల్లు చూపించాడు. మిగిలిన 5 కోట్ల రూపాయల విలువైన బంగారానికి ఎలాంటి ఆధారమూ చూపలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు. యుపి 32 ఈఎన్ 6123 నెంబర్ గల వాహనాన్ని సైతం సీజ్ చేశారు. నేపాల్‌కు చెందిన డ్రైవర్‌ను సీటీవో అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా హైదరాబాద్ కు చెందని ఓ జ్యువెలరీ షాపుకు ఈ బంగారాన్ని తరలిస్తున్నారని తెలిసింది.