
గ్రేటర్ హైదరాబాద్ లో పలు సమస్యల పరిష్కారానికి స్వయం సహాయక మహిళా బృందాల సేవలను వినియోగించుకోవాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. నగర సమస్య పరిష్కారంలో స్లమ్ లేవల్ ఫెడరేషన్లను భాగస్వామ్యం చేసే కార్యక్రమాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ ఎం.దానకిషోర్ లు నేడు లాంఛనంగా ప్రారంభించారు. అడిషనల్ కమిషనర్లు సిక్తా పట్నాయక్, జోనల్ కమిషనర్లు హరిచందన, ముషారఫ్ అలీ, శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, మమత లతో పాటు విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, హైదరాబాద్ జిల్లాకు చెందిన ఆర్.డి.ఓలు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి లో 45,000 స్వయం సహాయక మహిళా బృందాలు ఉండగా వీటన్నింటికీ 1300ల స్లమ్ లేవల్ ఫెడరేషన్లు ఉన్నాయి. ఎస్.ఎల్.ఎఫ్ అధ్యక్షులు/ ప్రతినిధులు తమ బస్తీలు, వాడలు, కాలనీల్లో ఉండే సమస్యలను జిహెచ్ఎంసి కాల్ సెంటర్ 040-21111111 కు గాని డయల్ 100 కు గాని ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తారు. తమ బస్తీల్లో మరమ్మత్తులు, పారిశుద్ధ్య నిర్వహణ లోపం, వీధి కుక్కల బెడద, స్ట్రీట్ లైట్ల సమస్య, బహిరంగంగా చెత్త వేయడం, 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం, మురుగు నీరు ప్రవహించడం, తాగు నీటి సమస్య, నీరు వృధా చేయడం తదితర సమస్యలన్నింటిని గుర్తించి జిహెచ్ఎంసి కాల్ సెంటర్కు సమాచారం అందిస్తారు. ఎస్.ఎల్.ఎఫ్ ప్రతినిధుల నుండి అందే ఫిర్యాదును వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత క్షేత్ర స్థాయి అధికారి కి వివరాలు పంపిస్తారు. ఫిర్యాదుకు ప్రత్యేక నెంబర్ ను నమోదు చేయడంతో పాటు ఫిర్యాదును పరిష్కరించే అధికారి మొబైల్ నెంబర్ ల వివరాలతో సహా సంబంధిత ఎస్.ఎల్.ఎఫ్ ప్రతినిదులకు అందజేస్తారు. ఈ ప్రతినిధులు జిహెచ్ఎంసి తో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మైజిహెచ్ఎంసి ఆప్, ఆన్ లైన్ ఫిర్యాదులు, ప్రజావాణి ద్వారా కూడా అందించే వెసులుబాటును జిహెచ్ఎంసి కల్పించింది. ఈ డిఎల్ఎఫ్ మహిళా ప్రతినిధుల ద్వారా అందే ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను సమీక్షించడానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని నియమిస్తూ జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫిర్యాదుల పరిష్కారంపై ప్రతి వారం రోజులకు ఒకసారి కమిషనర్ స్వయంగా సమీక్ష నిర్వహించనున్నారు. ఎస్ఎల్ఎఫ్ ప్రతినిధుల ద్వారా అంది ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై పాలనా పరమైన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీచేశారు. కేవలం సమస్యలపైనే ఫిర్యాదులు చేయకుండా సంబంధిత బస్తీలు, వాడలు, కాలనీలో మొక్కలు నాటడం, ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తగా వేరుచేసిన స్వచ్ఛ ఆటోలకు అందించడం, నీటి వ్రుధా చేయకుండా చేయడం, భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేయకుండా నిరోధించడం, సాఫ్-షాన్ దార్ హైదరాబాద్ కార్యక్రమాల పై కూడా ఈ ఎస్.ఎల్.ఎఫ్ మహిళా ప్రతినిధులు స్థానికులను చైతన్య పరుస్తారు.
-సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.