నగరానికి ఏమైంది! ఎవరు ఇందుకు కారణం?

రెండు తెలుగు రాష్ట్రాల పట్ల వరుణుడు ‘సమన్యాయం’ చూపిస్తున్నట్టు వుంది. మొన్నమొన్నటి వరకు చినుకుకోసం ఎదురుచూపులు. ఇప్పుడు  ఆ మాట  వింటేనే ఒణుకు. ఒకే దృశ్యాన్ని టీవీల్లో పదేపదే చూడడం వల్ల పరిస్తితి వున్నదానికంటే భయంకరంగా కానవస్తోంది. మళ్ళీ కొన్నాళ్ళు వానలు తప్పవనీ, కొన్ని చోట్ల కుంభ వృష్టి కురుస్తుందనీ వస్తున్న వార్తలు జనం గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పరిస్తితి అదుపులోనే వుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. సరే! ఈ పరిస్తితిని  ఇలానే వుంచి, కాసేపు టైం మిషన్ లో కొన్నేళ్ళు వెనక్కి వెళ్లి వద్దాము.
1975.
రేడియో  ఉద్యోగంలో చేరడానికి హైదరాబాదు వచ్చాను. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు. భారీ వర్షం పడినా, రోడ్లు ఏరులై పారినా వాన వెలవగానే వరదలా వెల్లువెత్తిన నీళ్లన్నీ చప్పున మాయం అయ్యేవి. రోడ్లమీద  నీళ్ళు నిలిచేవి కావు. ఇప్పుడా పరిస్తితి వుందా! లేదని చెప్పడానికి తడుముకోవాల్సిన పని లేదు.
నగరంలో జర్నలిష్టులకు మరో కాలనీ మంజూరయింది. ఎక్కడో జూబిలీ హిల్స్ అట. చూద్దామని కొందరు మిత్రులతో బయలుదేరాను. పంజాగుట్ట స్మశానం దాటగానే ఊరు కనబడలేదు. రోడ్డుకు అటూఇటూ విసిరేసినట్టు అక్కడక్కడా ఇళ్ళు. చెక్ పోస్ట్ దగ్గర అన్నీ పొలాలే. ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణ కోసం కట్టిన భవంతి ఒక్కటే ఒంటరిగా నిలబడి వుంది. అది  దాటిన తరువాత జర్నలిష్టుల కాలనీ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం. దానికి చివర్లో పెద్ద లోయ. అందులో నిండుకుండలా ఓ తటాకం. చిక్కడపల్లి నుంచి వెళ్ళిన నాకది ఓ అపూర్వ దృశ్యం.
ఇప్పుడా లోయాలేదు, తటాకమూ లేదు. లోయకు పైన జర్నలిష్టుల కాలనీ, లోయని పూడ్చేసి  సంపన్నుల కాలనీ వెలిశాయి. వీటికి ఆనుకుని  ప్రభుత్వాలను, ప్రజలను  శాసించే ఐ.ఏ.ఎస్.,ఐ.పీ.ఎస్., అధికారుల నివాస భవనాలు. అవీ ప్రభుత్వం వారికి కారు చౌకగా ఇచ్చిన స్థలాల్లో.
హైదరాబాదు నగరం చుట్టుపక్కల వేల సంఖ్యలో చిన్నా చితకా చెరువులు వుండేవని నగరం గురించి రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అదేమిటో  అన్ని చెరువులూ  మంత్రం వేసినట్టు మాయమయిపోయాయి. వాటిల్లో చిన్నవాళ్ళు కట్టుకున్న  చిన్న వాడలు, మధ్యతరగతి వాళ్ళు వుండే అపార్ట్ మెంట్లు, వున్నవాళ్ళు నివసించే సంపన్న కాలనీలు అంగుళం జాగా లేకుండా వెలిసాయి.   హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ కుంచించుకు పోయినా ఇంకా మిగిలే వున్నాయి. సంతోషించాలి.
గతంలో గండిపేట చెరువు చూడడానికి విహార యాత్రకు వెళ్ళేవాళ్ళం. అందులో అపార జలరాశిని చూస్తుంటే కడుపు నిండిపోయేది. సరే ఇప్పుడంటే వానల పుణ్యమా అని నీళ్ళు  నిండాయి. నిన్న మొన్నటి వరకు రాళ్ళు తేలి, నీళ్ళు లేని చెరువు గర్భమే కానవచ్చెది.
గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్దయిన హైదరాబాదు నగరం దృశ్యాలను టీవీల్లో చూస్తుంటే ఈ  వెనుకటి జ్ఞాపకాలు మనసులో తిరిగాయి.
ఇప్పటి ఈ  దుస్తితికి కారణం ఎవ్వరు? పట్టించుకోని ప్రభుత్వాలా! లంచాలు పట్టి, అడ్డమైన కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులా! కనబడ్డ చోటల్లా వెంచర్లు వేసి, ప్రజల డబ్బుతో, తగిన అనుమతులు లేకుండానే  అపార్ట్లు మెంట్లు కట్టేసి కోట్లు సంపాదిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులా! అనుమతులు ఉన్నాయా లేవా అని చూసుకోకుండా, చూసినా లెక్కపెట్టకుండా ఇళ్ళు కట్టుకున్న, కొనుక్కున్న ప్రజలా!  ఒక్క ముక్కలో చెప్పాలంటే  ఇది పాపం అనుకుంటే, ఇందులో వీరందరికీ భాగం వుంది. వాటాల్లోనే తేడా! (24-09-2016)

-భండారు శ్రీనివాసరావు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *