నగరంలో గాంబ్లింగ్

హైదరాబాద్ లో గాంబ్లింగ్ హవా కొనసాగుతోంది. క్రికెట్ బెట్టింగ్ లతోపాటు పేకాట, మట్కా లాంటి చట్ట విరుద్దమైన అక్టివిటీకి తెర లేపుతున్నారు కేటుగాళ్లు. నగరంలో ప్రతి రోజు ఏదో ఒక్క ప్రాంతంలో గాంబ్లింగ్ ముఠాలు పోలీసులకు పట్టుబడుతున్నాయి. గాంబ్లింగ్ వల్లన వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్న.. అలాంటి నేరాలను పోలీసులు అడుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నగరంలో గాంబ్లింగ్ కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. పేకాటను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన పేకాటరాయుళ్లు మాత్రం రూల్స్ ను పట్టించుకోవడంలేదు. గుట్టుచప్పుడు కాకుండా అపార్టుమెంట్స్, పబ్ లు, లాడ్జ్ లు, శివారు ప్రాంతంలోని రిసార్డ్స్ లలో పేకాట దందా జోరుగా కొనసాగుతోంది. అయితే పేకాట స్థావరాలపై పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. దీంతో పోలీసుల దాడుల‌తో భీతిల్లిన పేకాట‌క్ల‌బ్‌లు  పోలీసుల క‌న్నుగ‌ప్పి పేకాటరాయ‌ళ్ల‌ను ఆక‌ర్షించేందుకు  కొత్త రూట్ క‌నుక్కున్నారు. అదే మొబైల్ పేకాట క్ల‌బ్.  అంటే క‌దులుతున్న కారులో ద‌ర్జాగా పేకాట ఆడ‌ట‌మ‌న్న‌మాట‌. ఖ‌రీదైన ఇన్నోవా, స్కార్పియో వాహ‌నాల్లో ప్ర‌యాణిస్తూ మొబైల్ గేమింగ్‌కు తెర‌లేపారు.

ఇటీవల ఈ మొబైల్ గేమింగ్ గుట్టురట్టు చేశారు పోలీసులు. వాహ‌నాల్లో పేకాట ఆడుతున్న విష‌యం తెలిసిన  పోలీసులు వారిని వెంబండించి వ‌న‌స్థ‌లిపురంలోని విష్ణుథియేట‌ర్ వ‌ద్ద  ప‌ట్టుకున్నారు. ఏడుగురు నిందితుల‌ను అరెస్ట్ చేసి వారి వ‌ద్ద నుంచి 89 వేలు, ఏడు సెల్‌ఫోన్లు, 18 సెట్ల పేక‌లు, రెండు వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ పేకాట‌క్ల‌బ్ నిర్వ‌హ‌ణ తీరును చూసి పోలీసులు ఆశ్చ‌ర్య పోయారు. నిర్వాహ‌కులు పేకాట ప్రియులను న‌గ‌రంతో పాటు సైబ‌రాబాద్ ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల నుంచి ఎక్కించుకుని హైద‌రాబాద్, సైబ‌రాబాద్ ప‌రిధిని దాటి న‌ల్గొండ‌, మెద‌క్ జిల్లాల బార్డ‌ర్ల‌లో తిష్ఠ వేస్తున్నార‌ని పోలీసులు తెలుసుకున్నారు.

నగరంలో ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ హవా కూడా కొనసాగుతోంది. ప్రపంచకప్ మ్యాచ్‌ లకు ధీటుగా జంటనగరాల్లో ఐపిఎల్ మ్యాచ్‌ లపై కూడా పందాలు కడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐపిఎల్  సీజన్ మ్యాచ్‌ లు జరిగినప్పుడల్లా పంటర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్ లు ఉన్నప్పుడు జంటనగరాల్లో దాదాపు మూడు వేల మంది బుకీలు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్ కారణంగా నగరంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అయితే గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ వ్యవహారాలు కొనసాగిస్తున్నా.. అడపాదడపా మాత్రమే పోలీసుల చేతికి చిక్కుతున్నారు. క్రికెట్ మ్యాచ్ లపై ఈ మాఫియా రాష్ట్రవ్యాప్తంగా అత్యంత పకడ్బందీగా బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతోంది. నిత్యం కోట్లాదిరూపాయలు ఈ బెట్టింగ్ ద్వారా చేతులు మారుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ బెట్టింగ్ నిర్వాహకులు పకడ్బందీ వ్యూహంతో ముందుకు పోతున్నారు.

అయితే ఇది ఆన్‌ లైన్‌ నెట్‌ వర్క్‌ ద్వారా రాష్ట్ర మంతటా విస్తరించింది. మ్యాచ్‌ జరిగిన రోజు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల బెట్టింగ్‌ లు…. బుకీలు, బెట్టింగ్‌ వీరులు చేస్తున్న మాఫియా వ్యవహారంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం.. మూడో  కంటికి తెలియకుండా ఆన్‌ లైన్‌ సౌకర్యంతో లక్షలాది రూపాయల సంపాదన కావడంతో అందరి దృష్టి ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ లపై పడింది. మ్యాచ్‌ లు ఆరంభమైనప్పటి నుంచి వేలకోట్ల రూపాయల మేరకు క్రికెట్‌ బెట్టింగ్‌లు జరిగుతున్న సమాచారం.

ఒకప్పుడు సెల్‌ఫోన్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న బుకీలు ఇపుడు టెక్నాలజీని వాడుకుంటున్నారు. వాట్స్అప్, చాటింగ్‌ల ద్వారా కూడా బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా కొత్తకొత్త పం«థాలను అనుసరిస్తూ విచ్చలవిడిగా బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. గతంలో గెలుపు ఓటములకు మాత్రమే బెట్టింగ్ జరిగేది. అయితే ఇపుడు ఫ్యాన్సీ బెట్టింగ్‌కు ఆదరణ పెరగడం కూడా బుకీలకు లాభిస్తోంది.

ఇక మాట్కా కూడా బీటర్ల ఆగడాలు పెరిగిపోయాయి. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని స్వైర విహారం చేస్తున్నారు. సామాన్యులే లక్ష్యంగా కొనసాగిస్తున్న దందా ఎన్నో కుటుంబాలను వీధిన పడేస్తుంది. మట్కా వ్యసనంగా మారి బతుకులను నాశనం చేసుకుంటున్న వారిలో యువకులు కూడా ఉంటున్నారు.కాలంతో పాటు మారిన పద్ధతుల్లో మట్కాను నిర్వహిస్తూ అన్ని వర్గాల వారిని వ్యసనపరులుగా మార్చుతున్నారు. గతంలో చీటీలు రాసేవారు… ఇప్పుడు సెల్‌ఫోన్‌ లేదా నెట్‌ ద్వారా మట్కా జూదాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌లో దూల్‌పేట్‌, శివారు ప్రాంతాల్లో మట్కా బీటింగ్ జోరుగా సాగుతోంది. రతన్ లాల్, కళ్యాణ్, మహాసంగ్రాం.. ఇలా కొత్త కొత్త పేర్లతో మట్కా నిర్వహిస్తూ జనాలను బురిడీ కొట్టిస్తుంటారు. ఇందులో ఒకటి నుంచి 99 వరకు అంకెలు ఉంటాయి. వాటిలో ఒక నెంబర్‌ను ఎంచుకుంటారు. మొదటి అక్షరాన్ని ఓపెనింగ్ అని.. రెండోది క్లోజింగ్‌గా పిలుస్తారు. ఈ వ్యవహారమంతా సెల్‌ఫోన్‌లో బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత ముంబై నుంచి నెంబర్లు రిలీజ్ చేస్తారు. వీటిలో ఒక్క నెంబర్ సరిపోతే..9 రెట్లు… రెండు నెంబర్లు కలిస్తే..80 రెట్లు చెల్లిస్తారు.

ఓవైపు పేకాటను రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తుంటే.. మరోవైపు మట్కా జూదం రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్నది. ముంబై కేంద్రంగా సాగుతున్న మట్కా మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడతున్నది. ఈ జూదం కారణంగా ప్రతినెలా 100 కోట్లు ముంబైకి హవాలా రూపంలో తరలుతున్నట్టు అంచనా. భూములు, ఇండ్లు అమ్ముకుని చాలామంది రోడ్డున పడుతుండటంతో మట్కాను అరికట్టడంపై పోలీసులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది.

గాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం ఇండియాలో అన్ని రకాల జూదాలు పందేలపై నిషేధం ఉంది. చట్టవిరుద్దమైనా గాంబ్లింగ్ లకు పాల్పడితే… కఠన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *