దేశంలో సగం రైతు కుటుంబాలు రుణ గ్రస్తులే..

ఢిల్లీ , ప్రతినిధి : దేశంలో సగం రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయని.. 90 శాతం రైతు కుటుంబాలకు రెండు హెక్టార్ల కన్నా తక్కువ సాగుభూమి ఉందని జాతీయ నమూనా సర్వే ప్రకటించింది. దేశవ్యాప్తంగా 35 వేల రైతు కుటుంబాలపై సర్వే జరిపిన ఈ సంస్థ.. పలు అంశాల్ని సేకరించింది. వ్యవసాయం, ఇతర అనుబంధ మార్గాల ద్వారా ప్రతినెలా ఒక రైతు కుటుంబం పొందుతున్న సగటు ఆదాయం 6 వేల 500 రూపాయల కన్నా తక్కువ ఉందని సర్వే తెలియజేసింది.

జాతీయ నమూనా సర్వే.. 2013-14
దేశంలో వ్యవసాయ కుటుంబాల పరిస్థితిపై 70వ నివేదికను విడుదల చేసిన జాతీయ నమూనా సర్వే.. 2013-14 వ్యవసాయ సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుంది. ఏడాదిలో మూడు వేల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తి చేసిన వ్యక్తులను కూడా ఈ సంస్థ లెక్కలోకి తీసుకుంది. గ్రామాల్లో ఉన్న 58 శాతం కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడిన వారిగా.. ఉపాధి పొందుతున్నారని సర్వే తెలిపింది.

ఉపాధి పొందలేని పరిస్థితిల్లో రైతు కుటుంబాలు
వ్యవసాయం ద్వారా ఉపాధి పొందలేని పరిస్థితిల్లో రైతు కుటుంబాలు ఉన్నాయని.. ఎన్నో రైతు కుటుంబాలు రైతు కూలీలుగా మారిపోతున్నారని జాతీయ నమూనా సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా 42 శాతం రైతు కుటుంబాలు బ్యాంకుల నుంచి రుణాన్ని పొందాయని.. 26 శాతం కుటుంబాలు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాన్ని తీసుకున్నారని.. 42 శాతం రైతు కుటుంబాలకు ఉపాధి హామీ కార్డులున్నాయని సర్వే తెలిపింది.

పేద రైతు కుటుంబాల్లో ఎస్‌సీ, ఎస్టీలే అధికం
మరోవైపు.. అత్యంత తక్కువ సాగుభూమి కలిగిన పేద రైతు కుటుంబాల్లో ఎస్‌సీ, ఎస్టీ, సామాజిక వర్గం వారే అధికంగా ఉన్నారని సర్వే నివేదించింది. ఓబీసీ, ఉన్నత వర్గాలకు చెందిన రైతు కుటుంబాలు అత్యధిక సాగుభూమి కలిగి ఉన్నారని.. ప్రతి మూడు రైతు కుటుంబాల్లో ఒక రైతు కుటుంబానికి ఒక ఎకరం కన్నా తక్కువ సాగుభూమి ఉందని సర్వే తన నివేదికలో తెలిపింది. మరోవైపు ధాన్యం సేకరణలో ప్రైవేటు వ్యాపారస్తుల ఆధిపత్యం కొనసాగుతోందని జాతీయ నమూనా సర్వే అభిప్రాయపడింది.

కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి
జాతీయ నమూనా సర్వే నివేదికను చూసైనా కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. రైతు సంక్షేమం దిశగా నిర్ణయాలు తీసుకొని.. వారికి మరిన్ని సదుపాయాలు, సౌకర్యాలు అందించి వ్యవసాయం మరింత లాభసాటిగా సాగేందుకు తోడ్పాటు అందించాలి. లేకుంటే.. రాబోయే కాలంలో దేశానికి అన్నం పెట్టే అన్నదాత లేకుండా పోయే ప్రమాదం ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.