దేశంలోనే మహిళలు లేని మంత్రివర్గం మనదే..

KCR_AFP_360x270-అప్రతిష్ట మూట గట్టుకున్న సీఎం కేసీఆర్
-నోరు మెదపని మహిళా సంఘాలు, నాయకురాళ్లు
హైదరాబాద్, ప్రతినిధి : హతవిధీ.. ఏమిటిదీ.. సీఎం కేసీఆర్ సారూ మరో అరుదైన ‘ఘనత’ సాధించారు. గతంలో ఈయన చాలా సాధించారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన యోధుడు.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు.. ప్రజల ఆశీర్వాదంతో  సీఎంగా ఎన్నికై  చరిత్ర సృష్టించిన వీరుడికి ఇప్పుడో కలంకం అంటింది.. అదే విశాల భారత దేశంలో మహిళలకు మంత్రి పదవులు లేని రాష్ట్రం మనదేనట.. దేశవ్యాప్తంగా ప్రతిరాష్ట్రంలో కనీసం ఒక్కరైన మహిళా మంత్రులున్నారు. కానీ మన తెలంగాణలో ఒక్కరూ కూడా లేకపోవడం కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మాయని మచ్చ. దేశవ్యాప్తంగా ఈ విషయంలో మన పరువు పోతోంది.  ఈ ఘనత వహించిన కేసీఆర్ కు త్వరలోనే ‘సన్మానం’చేయాలని ప్లాన్ చేస్తున్నాయట మహిళా సంఘాలు..

జనాభాలో సగం ఉన్న మహిళలకు మంత్రివర్గంలో కనీసం ఒక్కస్థానం కేటాయించని సీఎం కేసీఆర్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఉద్యమంలో మహిళలు కావాలి.. ఓట్లేయడానికి మహిళలు కావాలి.. కానీ మంత్రిపదవులకు తాము వద్దా అని మహిళలు బాధపడుతున్నారు. విచిత్రమేంటంటే మంత్రివర్గంలో మహిళలు చోటు దక్కకున్నా ఇంతవరకు కనీసం ఒక్క మహిళ కూడా నిరసన తెలపలేదు.. ఆందోళన బాట పట్టేలేదు. ఇదేం చిత్రమో అర్థం కాని పరిస్థితి..

ఈసారి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన మహిళలు ఉన్నారు. ఇందులో మంత్రివర్గంలో ముందు నిలిచిన పేరు కొండా సురేఖ.  ఆ తర్వాత కోవా లక్ష్మి(ఆదిలాబాద్ జిల్లా) , సునీతా మహేందర్ రెడ్డి తదితరులు మంత్రివర్గంలో చోటు ఆశించారు. కనీసం మహిళా ప్రాతినిధ్యం కోసమైన ఒక్కరికైనా అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కొండా సురేఖ ఇది వరకు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది. పోనీ గిరిజన కోటాలైనా చందూలాల్ కాకుండా కోవాలక్ష్మికి మంత్రిపదవి ఇస్తే అటు గిరిజన కోటా.. ఇటా మహిళా కోటాలో రెండు బెర్తులు ఒకే పదవితో భర్తీ అయ్యేవి. పోనీ వీరిని వద్దనుకున్న బీఎస్పీనుంచి గెలిచిన రెడ్డి సామాజికవర్గం నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డిని మినహాయించి నల్గొండ జిల్లా ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి కి పదవి ఇచ్చినా  మహిళలను సంతృప్తి నిచ్చేది. కేసీఆర్ ద్యాస అంతా ఇతర పార్టీల వారిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని వారికి మంత్రి పదవులివ్వడానికే సరిపోయింది. సొంత పార్టీ నుంచి గెలిచిన వారిని నట్టేట ముంచారని టీఆర్ఎస్ వర్గాలు లోలోపల విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. , తుమ్మల నాగేశ్వర్ రావు, బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్ రెడ్డిలు వీరంతా టీఆర్ఎస్ నుంచి గెలిచిన వారు కారు.. మరి వీరికి ఇచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యేల్లో అసహనం వ్యక్తం అవుతుంది. తాము ఊహించని షాక్ ఇచ్చారు సీఎం కేసీఆర్ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

రిజిర్వేషన్ ప్రకారం చూసినా 33 శాతంలో కనీసం ఆరుగురికి మంత్రి పదవులు ఇవ్వాలి. పోనీ అందులో 5 శాతం ఇవ్వాలనుకున్నా కనీసం ఒక్క మంత్రి పదవి ఇవ్వాలి కానీ అదీ దక్కలేదు. నవ తెలంగాణలో మహిళలకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం నిజంగా మన దౌర్భాగ్యం.

ఏకవ్యక్తి పాలన ఎలా ఉంటుందో కేసీఆర్ చూపిస్తున్నారు. ఇది కేసీఆర్ మార్క్ పాలన అంటుంటే ఏమో అనుకున్నారు జనాలు .. కానీ నియంతృత్వ పాలన అని ఒక్కొక్కటిగా వెల్లడవుతందంటున్నారు. పార్టీ పునాదుల్లోంచి కష్టపడ్డా కొప్పుల ఈశ్వర్ కు పదవి కాదనడం ఏంటి.. బయట పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులివ్వడమేంటి.. ఇది ప్రజాస్వామ్యమా.. ఏకస్వామ్యమా.. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చా.. కనీసం అవగాహన ఉండొద్దా.. ప్రశ్నించే గొంతుకలు లేవా..?

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.