
హైదరాబాద్ : పెట్రోలు, డీజిల్ ధరలు దేశం మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మన రాష్ట్రంలో పెట్రోలు మీద 31 శాతం పన్నుతో పాటు రూ. 4 అదనంగా ధర పెంచారని, డీజిల్ మీద 22.2 శాతం పన్నుతో పాటు మరో రూ. 4 అదనంగా వడ్డించారని విమర్శించారు. శుక్రవారం ఆయన లోటస్ పాండ్ లో తన కార్యాలయంలో మాట్లాడారు .
దేశంలోనే ఇక్కడున్న రేట్లు ఎక్కడా లేవని, పోనీ దీనివల్ల రాష్ట్రానికి అధిక వనరులు ఏమి రావడంలేదని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారుతో లోపాయికారీ ఒప్పందం చేసుకొని తెలుగు కాంగ్రెస్ గా మారి కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడారని, కిరణ్ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచినప్పుడు ప్రతిపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించినా , చంద్రబాబు మాత్రం తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేయించి మరీ కిరణ్ సర్కారును బాబుగారు కాపాడారని ఆయన గుర్తుచేశారు. కిరణ్ కుమార్ రెడ్డికి అప్పుడున్న బలం 146 కాగా.. మరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉందని చెప్పారు. ఆరోజు గనక చంద్రబాబు నాయుడు మద్దతు చూసి ఉంటే.. కిరణ్ ప్రభుత్వం ఉండేది కాదని అన్నారు. అలాంటి చంద్రబాబు..ఈ రోజు కిరణ్ ప్రభుత్వాన్ని తిడుతూ తమను పిల్ల కాంగ్రెస్ అని విమర్శిస్తున్నారని ఈ తెలుగు కాంగ్రెస్ పెద్దమనిషి అని చంద్రబాబుని దుయ్యబట్టారు