
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. శారదా ఫైనాన్స్ కుంభకోణంలో ఆమెను విచారించాలనే డిమాండ్ పెరుగుతోంది. శారదా మీడియా వల్ల అందరికంటే ఎక్కువగా లబ్ధి పొందింది మమతనే అని తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండైన ఎంపీ కునాల్ ఘోష్ కోర్టుకు చెప్పారు. ఈ కేసులో నిందితుడైన కునాల్, మమ తను కూడా తనతో పాటు విచారించాలన్నారు.
ఈ కేసులో అత్యధికంగా లాభం పొందింది ఎవరంటే ముందుగా చెప్పాల్సింది మమత పేరే అన్నారు కునాల్. ఈ ప్రకటనను పరిగణన లోకి తీసుకుని కోర్టు మమతను విచారణకు పిలుస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ కోర్టు సమన్లు పంపితే మమతకు మరిన్ని చిక్కులు తప్పక పోవచ్చు.
ఇప్పటికే బీజేపీ మమతపై విమర్శల దాడిని కొనసాగిస్తోంది. కోల్ కతాలోనే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మమతపై విరుచుకు పడ్డారు. అధికార పార్టీ ప్రమేయం లేకుండా కుంభకోణం జరిగేది కాదని, కాబట్టి దీనికి మమత జవాబివ్వాలని డిమాండ్ చేశారు. మమతను విచారించాలన్న కునాల్ ప్రకటనను ప్రస్తావించారు. ఒక వేళ మమత విచారణకు హాజరయ్యే పరిస్థితి వస్తే బీజేపీ మరింత పదునైనా విమర్శల దాడి చేయవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ గణనీయంగా బలపడింది. లోక్ సభ ఎన్నికల్లో సీట్లు ఎక్కువగా రాకపోయినా బెంగాల్లో ఓట్ల పరంగా రెండో స్థానంలో ఉంది. పైగా కేంద్రంలో అధికారంలో ఉంది. కాబట్టి బీజేపీ దాడిని మమత ఎలా ఎదుర్కొంటారో చూడాలి.