
దిల్‌షుఖ్‌నగర్ జంట పేలుళ్ల ఘాతుకానికి పాల్పడిన ముష్కరులకు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేసింది. దిల్‌సుఖ్‌నగర్‌లో విధ్వంసానికి పాల్పడింది ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సభ్యులేనని ఈ నెల 13న ప్రత్యేక న్యాయస్థానం నిర్ధారించిన సంగతి తెలిసిందే. అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, జియా ఉర్ రెహమాన్ అలియాస్ వకాస్, తెహసీన్ అక్తర్ అలియాస్ మోనూ, యాసిన్ భత్కల్, ఐజాజ్ షేక్‌లను నేరస్థులుగా నిర్ధారించి ఉరిశిక్షను విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ తీర్పు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై చర్లపల్లి జైలు సహా హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఉదయం నుంచి ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఐదుగురిని దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం.. తీర్పు ప్రక్రియపై తీవ్ర కసరత్తు చేసింది. తీర్పు ప్రతిని సిద్ధంచేసిన తర్వాత దోషులందరికీ ఉరిశిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. శిక్షలకు సంబంధించి ఈ రోజు ఇరువర్గాల వాదనల్ని న్యాయస్థానం విన్నది. దేశంలో అస్థిరత సృష్టించేందుకు, హత్యలకు పాల్పడినందుకు గాను దోషులందరికీ మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. అయితే, శిక్షపై దోషుల అభిప్రాయాన్ని కోరగా.. తాము చెప్పేదేమీ లేదని, ఏ శిక్ష విధించినా సిద్ధమేనని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో దోషులకు మరణశిక్షా? లేదంటే యావజ్జీవ శిక్ష విధిస్తారా అన్న అంశంపై తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసు శాఖ అప్రమత్తమైంది. చర్లపల్లి జైలువద్ద పోలీసులను భారీగా మోహరించారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసు బలగాలను దించారు. 2013, ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల ఘటనలో 19 మంది మృత్యువాత పడగా… 131 మంది గాయపడ్డారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు మొత్తం 157 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 502 దస్త్రాలు, 201 వస్తువులను ఆధారంగా సమర్పించారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. అతడు పాకిస్థాన్‌లో ఉన్నట్లు గట్టిగా వాదిస్తున్న ఎన్ఐఏ.. ఇంటర్‌పోల్ నోటీసు కూడా జారీచేసింది.