
మంత్రి కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించారు. సిరిసిల్ల మండలం మండెపల్లి వద్ద రూ.16 కోట్లతో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్, రగుడు వద్ద బైపాస్ రోడ్డు కు శంకుస్థాపన చేశాడు. అలాగే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తాను సిరిసిల్ల చేనేతల రుణం తీర్చుకునేందుకే కేసీఆర్ చేనేత,జౌళి శాఖను తనకు అప్పగించారని చెప్పారు. సిరిసిల్ల అభివృద్ధి కోసం తాను సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకొని అయినా నిధులు తెస్సానని స్పష్టం చేశారు. త్వరలోనే 9 గంటల విద్యుత్ ఇస్తామని.. ఎల్ ఎండీ నుంచి లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. చేనేతల రుణమాఫీ చేశామని.. వారి ఉపాధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మహేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీ వినోద్, జడ్పీ చైర్మన్ తుల ఉమ, కలెక్టర్ నీతు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.