దసరా నుంచి యాదాద్రి పనులు ప్రారంభం

యాదగిరిగుట్ట దేవాలయ ప్రాంగణాన్ని మానవ నిర్మిత అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులు, శిల్పులు, నిర్మాణ నిపుణులను కోరారు. ప్రధాన ఆలయం, శివాలయం, గుట్టపైన వచ్చే నిర్మాణాలు, చుట్టూ ఇతర గుట్టల అభివృద్ధి కోసం తయారు చేసిన లే అవుట్లను క్యాంపు కార్యాలయంలో పరిశీలించి, ఆమోదించారు. ఈ డిజైన్ల ప్రకారం దసరా నుంచి పనులు ప్రారంభించాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. యాదగిరిగుట్ట అభివృద్ధి సంస్థ పూర్తి బాధ్యత తీసుకుని పనులను పర్యవేక్షించాలని, ప్రధాన గుట్టయిన యాదాద్రితో పాటు ఇతర గుట్టలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని సిఎం ఆదేశించారు. యాదగిరిగుట్ట అభివృద్ధి సంస్థ(వైటిడిఎ) వైఎస్ ప్రసిడెంట్ కిషన్ రావు నేతృత్వంలో పనులు జరగాలన్నారు. వైటిడిఎ పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరారు.

ఆమోదించిన డిజైన్లు, లే అవుట్ ప్రకారం….

గుట్ట పైన గర్భగుడి యథావిధిగా ఉంటుంది.

గుట్టపైకి పోవడానికి, కిందికి రావడానికి వేర్వేరు దారులుంటాయి. ప్రస్తుతమున్న దారిని గుట్టపైకి పోవడానికి, కొత్తగా నిర్మించే దారికి కిందికి రావడానికి ఉపయోగిస్తారు.

గుట్టపైన 1.9 ఎకరాల విస్తీర్ణంలో బస్టాండ్ ఉంటుంది. అక్కడే భక్తులను దింపి, కిందికి పోయే భక్తులను ఎక్కించుకుని బస్సులు కదులుతాయి.

విఐపిలకు ప్రవేశమార్గం ప్రత్యేకంగా ఉంటుంది.

ప్రధాన ఆలయం చుట్టూ మాఢవీధులు నిర్మిస్తారు. దీని విస్తీర్ణం 2.3 ఎకరాలుంటుంది.

శివాలయానికి కూడా మాఢవీధులు నిర్మిస్తారు.

ప్రధాన ఆలయం తూర్పు దిక్కున దక్షిణానికి అభిముఖంగా 108 అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్టిస్తారు.

గుట్టపైనే అన్నదానం కాంప్లెక్స్ నిర్మాణం ఉంటుంది.

బ్రహ్మోత్సవం జరిగేందుకు కూడా తూర్పు భాగంలో ప్రత్యేక స్థలం ఉంటుంది.

అర్చకులు సేద తీరేందుకు, బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక స్థలం గుట్టపైనే ఉంటుంది.

శ్రీచక్ర భవనం ప్రాంగణాన్ని క్యూ కాంప్లెక్సుగా మారుస్తారు.

దైవ సంబంధ వస్తువుల విక్రయం కోసం గుట్టపైనే షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది.

గుట్టపైన ఉన్న ప్రస్తుత భవనాలన్నీ తొలగిస్తారు. కొత్త లే అవుట్ ప్రకారమే నిర్మాణాలుంటాయి.

నీటి గుండం యధావిధిగా ఉంటుంది. దాని విస్తీర్ణం పెంచుతారు.

ప్రధాన గుట్ట పక్కన ఉన్న ఇతర గుట్టల అభివృద్ది

ప్రధాన గుట్టకు తూర్పు భాగాన వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రెండు గుట్టలను కలిపి యాదగిరిగుట్ట టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తారు.

టెంపుల్ సిటీలో విశాలమైన రహదారులు, ఉద్యానవనాలు, కాటేజీలు, సత్రాలు,పార్కింగ్ ప్లేస్, కళ్యాణ మంటపం నిర్మిస్తారు.

గుట్ట పరిసరాల్లో సువాసనలు వెదజల్లే మొక్కలు పెంచుతారు.

భక్తి గీతాలు, శ్లోకాలు నిరంతరం వినిపించే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు.

ప్రధాన గుట్టకు ఉత్తర భాగంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టను తిరుపతి పద్మావతి అతిథి గృహం మాదిరిగా విఐపి గెస్ట్ హౌజ్ కాంప్లెక్స్ నిర్మిస్తారు.

కొత్త లే అవుట్ కు అనుగుణంగా కరెంటు లైన్లు, డ్రైనేజి, వాటర్ పైప్స్ వేస్తారు.

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, గవర్నర్ శ్రీ నరసింహన్, చిన్నజీయర్ స్వామి కలిసి ఈ ఏడాది మే 30న గుట్టను సందర్శించారు. అప్పుడే అభివృద్ధి పనుల కోసం పూజ చేశారు. ఇప్పుడు లే అవుట్లు కూడా సిద్ధం అయినందున పనులను దసరా నుంచి ప్రారంభించాలని, వచ్చే దసరా నాటికి ఓ రూపం తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పనుల అనుమతులు, తదితర విషయాలన్నీ వైటిడిఏ చూసుకుంటుందని, పనుల్లో జాప్యం ఉండవద్దని చెప్పారు. రెండు బడ్జెట్లలో కలిపి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించామని, భవిష్యత్తులో మరిన్ని కేటాయింపులు చేస్తామని సిఎం చెప్పారు. పాత భవనాలు, కాటేజీలు కూల్చి వేసే సందర్భంలో ఇదివరకు కాటేజీలు నిర్మించిన దాతల పేరుతోనే కొత్త డిజైన్ల ప్రకారం సత్రాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కిషన్ రావుతో పాటు నిర్మాణ నిపుణులు రాజు ఎక్స్ పిడిత్, పి. జగన్ మోహన్, ఆలయ నిర్మాణ నిపుణుడు ఆనందసాయి, స్తపతి సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *