
సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో త్రాగునీటి సరఫరాలో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. రాంగోపాల్ పేట్ డివిజన్ లోని నల్లగుట్ట లో మంత్రి శనివారం వాటర్ వర్క్స్ ఎండి ధానకిషోర్ తో కలిసి పర్యటించారు. నల్లగుట్టలోని పలు ప్రాంతాలలో త్రాగునీటి సరఫరా సక్రమంగా జరగడంలేదని, కొన్ని చోట్ల త్రాగునీరు కలుషితమవుతుందని శుక్రువారం ఆప్రాంతంలో పర్యటించిన మంత్రి శ్రీనివాసయాదవ్ దృష్టికి పలువురు స్ధానికి ప్రజలు ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి ప్రాంతాలను పరిశీలించారు. నల్లగుట్టలో సమస్యలను గుర్తించిన సుమారు 8 ప్రాంతాలలో సీవరేజ్, వాటర్ సప్లై పైప్ లైన్ ల నిర్మాణానికి 53 లక్షల రూపాయలతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో 26 లక్షల రూపాయలను వాటర్ వర్క్స్ నుండి మిగిలిన నిధులను నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో పనులు చేపట్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించనున్నట్లు ఆయన వివరించారు. జాలమ్మగుడి వద్ద గల నాలాను పరిశీలించి అందులో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి ఆదేశాలు ఇస్తున్నట్లు ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ అతెల్లి అరుణ్ గౌడ్, వాటర్ వర్క్స్ జిఎం సుదర్శన్, డిజిఎం సునీల్, సిజిఎం కృష్ణ, జీహెచ్ఎంసీ ఎస్ఈ సురేష్, ఎలక్ట్ర్రికల్ ఏఈ శ్రీనివాస్, స్ట్ర్రీట్ లైట్ ఏఈ శ్రీనివాస్, శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.