త్రాగునీటి సమస్య గ్రామాలలో రవాణా ద్వారా సరఫరా..

కరీంనగర్: జిల్లాలో త్రాగునీటి సమస్య గల గ్రామాలలో వెంటనే రవాణా ద్వారా త్రాగునీటిని సరఫరా చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేటు నుండి అందరు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓ.లు, స్పెషల్ ఆఫీసర్లతో వేసవిలో త్రాగునీటి సమస్య, ఐఎస్ఎల్ నిర్మాణాలు, మిషన్ కాకతీయ, ఉపాధిహమీ మొదలగు పధకాల ప్రగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో మరో నెల రోజులు గ్రామాలలో ప్రజలకు ఎట్టి పరిస్ధితిలో త్రాగునీటి ఇబ్బందులు కలుగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిధులకు కొరత లేదని నీటి ఎద్దడి గ్రామాలకు వ్యవసాయ బోర్లు, బావులు అద్దెకు తీసుకొని రవాణా ద్వారా త్రాగునీరు అందించాలని ఆదేశించారు. నీటి రవాణా ఖర్చులకు డివిజనుకు 50 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. త్రాగునీటి రవాణా బిల్లులు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ రెండవ విడతలో మంజూరైన చెరువు పనులన్ని వెంటనే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వాతావరణ శాఖ వారి సూచనల ప్రకారం ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశాలు ఉన్నాయని, వర్షాలు వచ్చే లోపు అనగా జూన్ 10లోగా మిషన్ కాకతీయ పనులన్ని పూర్తి చేసేలా యుద్ద ప్రాతిపదికన పనులను నిర్వహించాలని సూచించారు. మిషన్ కాకతీయ రెండవ విడతలో మంజూరైన చెరువులన్నింటికి రెవిన్యూ అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. జిల్లాలో మిషన్ కాకతీయ పనులు జరిగిన చెరువులను ఒక్కో అధికారికి ఒక చెరువు చొప్పున దత్తత తీసుకొనుటకు నిర్ణయించామని తెలిపారు. దత్తత తీసుకొన్న అధికారులు చెరువులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో చెరువులు నీటితో నిండితే గ్రామాలు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. అన్ని గ్రామాలలో చెరువుల నుండి వ్యవసాయ పొలాలకు పోవు ఫీడర్ చానల్ లో ఉపాధి హమీ పధకం క్రింద పూడికతీసి చెట్లను తొలగించి ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రగతిలో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లను పూర్తిచేసి, మంజూరు చేసిన నిధులకు వినియోగ ధృవీకరణ పత్రాలు పంపాలని కలెక్టర్ ఎం.పి.డి.ఓ.లను ఆదేశించారు. జిల్లాలో ఐ.ఎస్.ఎల్. నిర్మాణాలకు మంజూరు చేసిన 6 కోట్ల నిధులకు వినియోగ ధృవీకరణ పత్రాలు ఎం.పి.డి.ఓ.ల నుండి అందవలసిన యున్నాయని తెలిపారు. పూర్తయిన ఐ.ఎస్.ఎల్.లకు వెంటనే చెల్లింపులు చేయాలని జాప్యం చేయకూడదని ఆదేశించారు. ఐ.ఎస్.ఎల్.లను ఆన్ లైన్లో మంజూరు పొందాలని పూర్తయిన వాటికి ఆన్ లైన్లో అప్ లోడ్ చేస్తే వెంటనే పేమెంట్ వస్తుందని తెలిపారు. జిల్లాలో వడదెబ్బతో మరణించిన వారి రిపోర్టులు వెంటనే పంపించాలని తహసీల్దార్లను ఆదేశించారు. రైతుల ఆత్మహత్యల త్రిమెన్ కమిటి రిపోర్టు కూడా వెంటనే పంపించాలని ఆదేశించారు. ఉపాధిహమి పధకం క్రింద గ్రామాలలో ఫాం పాండులు, ఇంకుడు గుంతలు, ఫర్క్యులేషన్ ట్యాంకులు, కాంటూరి కందకాలు, పశువుల త్రాగునీటి తొట్టెల నిర్మాణాలు, డంపింగ్ యార్డు పనులు పెద్ద ఎత్తున మంజూరు పొంది పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, నగర పాలక సంస్ధ కమీషనర్ కృష్ణ భాస్కర్, అదనపు జెసి డా. ఎ.నాగేంద్ర, డి.ఆర్.ఓ. టి. వీరబ్రహ్మయ్య, ఇరిగేషన్ ఎస్.ఇ. వెంకటకృష్ణ, డ్వామా పిడి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.