త్యాగాల గురుతు నాన్న..

అమ్మ అమృతమైతే.. దాన్ని నింపుకున్న కలశం నాన్న. అమ్మ వెలిగే దీపమైతే.. దాన్ని వెలిగించే వత్తి నాన్న. ఒక్కమాటలో చెప్పాలంటే తండ్రి త్యాగాల గుర్తు. అమ్మ ప్రేమ కంటి ముందుంటే.. నాన్న ప్రేమ గుండెలో ఉంటుంది. అమ్మంటే మెరిసే మేఘం. నాన్నంటే నీలాకాశం. ఫాదర్స్ డే సందర్భంగా మమతల పందిరి కింద తండ్రికి ఒక చిన్న ప్రశంసాపత్రం.
జీవితం దారి మరిచిపోయిన మార్గదర్శి. నో క్యాష్‌ బోర్డ్‌ లేని ఎటిఎం. అస్తమానం పని చేసే గానుగెద్దు. అవసరం వస్తే అడుక్కోవడం కూడా చేతగానోడు. భార్య సంతోషం కోసం తపనపడేవాడు. పిల్లల ఆనందం కోసం తాపత్రయపడేవాడు. కూతరంటే హడలి చచ్చేవాడు. కొడుకంటే బెదిరిపోయేటోడు. అన్నింటికి కలిపి ఒక్కటే పేరు తండ్రి. మనకందరికీ నాణానికి ఒకవైపు మాత్రమే కనిపిస్తాడు. మరోవైపు అర్ధం చేసుకోవాలంటే కొంచెం మనసు కూడా కావాలి.
ప్రకృతి అమ్మైతే, దానికి జీవం పోసే విధాత నాన్న. అమ్మకు నిర్వచనాన్ని గుండెనడిగితే తెలిసిపోతుంది. నాన్నకు అర్ధం వెతకాలంటే ఈ అంతులేని విశ్వం మొత్తాన్ని శోధించాలి. ఆయన మనసు అర్ధంకాని అంతరిక్షం. ఆయన హృదయం తేల్చుకోలేని పాతాళం. విషాన్ని, అమృతాన్ని తాగిన సర్వేశ్వరుడు తండ్రి. ప్రేమకు, ప్రళయానికి సృష్టికర్త. చూడలేనికి వారికి అణుమాత్రంగా గోచరిస్తే.. చూడగలిగినవారికి అండపిండ బ్రహ్మాండాలను దాటి పోయే విశ్వరూపం సాక్షాత్కరిస్తుంది.
నాన్న అర్ధంకాని జీవి. కష్టాన్ని కళ్లకింద దాచి పెడతాడు. సంతోషాన్ని చేతులతో పంచుతాడు. అంగిలేకుండా బాపును చూడు. ఆయన ఛాతీ ఎండిపోయిన నాగార్జున సాగర్‌ డామ్‌లా కనిపిస్తుంది. ఎంత ఒత్తిడిని తట్టుకోవాలి. ఎంతెంత నీటిని కాచుకోవాలి. అందుకే ఆయన్ని చూస్తే అట్టగుడుకు జారిపోయిన ధైర్యం గుండెలోకి ఎగదన్నుకొస్తుంది. ఆయన స్పర్శ కరుకుగానే ఉండొచ్చు. కానీ తాకిచూడు. ఎదో సాధించాలన్న కసి నరనరాల్లోకి సర్రున పాకుతుంది.
నాన్న ఒక వెన్నెల రేడు. భగభగమండే ఎండలను దాచుకుని మలయ మారుతాల్ని పంచుతాడు. విషం తాగి అమృతం పంచుతాడు. తనకోసం ఏమీ దాచుకోడు. అందరి బరువుల్నీ మోస్తాడు. దుఃఖమొస్తే రెప్పల మాటున గుంభనంగా దాచుకుంటాడు. అమ్మతనం వెనుక ఎంత పెయిన్‌ ఉందో.. నాన్న కావడం వెనుకా అంతే బాధుంది. అమ్మ మనసు బంగారమే. కానీ నాన్న మనసు కూడా. కన్నీళ్లూ కష్టాలూ ఒక్కసారిగా ముసిరినప్పుడు, భద్ర గుండె బరువెక్కినప్పుడు నాన్న గుర్తొస్తాడు. ఆయన పోరాట పటిమ గుర్తొస్తుంది. తండ్రి ప్రయాణించిన వేల మైళ్లు గుర్తొస్తాయి.
జీవితమొక నాటకరంగం.. మనమంతా పాత్రధారులం అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత రచయిత షేక్‌స్పియర్‌. పుట్టింది మొదలు చనిపోయేవరకు ఎన్నో పాత్రలు పోషించాలి. కొన్నిట్లో జీవిస్తాం, కొన్నిట్లో నటిస్తాం. ఇతర పాత్రల సంగతి వదిలేస్తే.. తల్లి, తండ్రి పాత్రల్లో ఏ వ్యక్తయినా జీవించడమే తప్ప నటించడం వుండదు. తండ్రి ఎన్నో నేర్పిస్తాడు. ఎంతో తర్ఫీదిస్తాడు. తడబడితే చెయ్యందిస్తాడు. తప్పటడుగులు వేస్తే సరిచేస్తాడు. అందుకే ఆ త్యాగాల ప్రతిరూపానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. రెక్కలు ముక్కలు చేసి బతుకునంతా ధారవోసి బిడ్డల్ని పెంచే నాన్నలంతా వర్ధిల్లాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *