
హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని తెల్లకార్డు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. నూతన సంవత్సరం సందర్భంగా రేషన్ కోటా బియ్యాన్ని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన ప్రతొక్కరికీ ఆరు కేజీల బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు నాలుగు కిలోల బియ్యం మాత్రమే అందేది. ఇప్పటివరకున్న కుటుంబానికి 20 కేజీల పరిమితిని ఎత్తివేసింది. అలాగే ప్రభుత్వ హాస్టళ్లు..పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకానికి సూపర్ ఫైన్ బియ్యాన్ని అందించాలని డిసైడ్ అయ్యింది.
లక్ష టన్నుల బియ్యం సరఫరాకు రంగం సిద్ధం..
కొత్త కోటా బియ్యాన్ని కొత్త ఏడాదిలోనే ప్రారంభించనుంది. జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెలేలు, మండలాల్లో ఎంపీపీ, జడ్‌పీటీసీలు, పంచాయితీల్లో సర్పంచులు ఈ కొత్త కోటాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం దాదాపు లక్ష టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేసారు. కొత్త కార్డులు జారీ అయ్యేవరకు ఇప్పుడున్న తెల్ల కార్డుల మీదే ఈ కొత్త కోటా బియ్యాన్ని ఇవ్వనున్నారు.
ఎలాంటి ఆందోళన చెందవద్దన్న మంత్రి ఈటెల..
ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల తెల్ల కార్డులు వాడుకలో ఉన్నాయి. వీరిలో అనర్హులుంటే తొలగించి, కొత్తగా అర్హులుంటే జాబితాలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బియ్యం కోటా పెంచినంత మాత్రాన కార్డులను తొలగించమని కూడా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలోనే కొత్త కార్డులిస్తామని, ప్రజలు అందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. బియ్యం కోటా పెంచడంతో పాటు.. రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని.. కిందిస్థాయి వరకు పథకం పటిష్టంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.