
హైదరాబాద్ , ప్రతినిధి : నవ తెలంగాణ కోసం కేసీఆర్ సర్కార్… కొత్త పనికి శ్రీకారం చుట్టింది. పోటీ పరీక్షల్లోనూ తెలంగాణ మార్క్ కనిపించేలా సిద్ధమవుతోంది. ఏపీ హిస్టరీ ప్లేస్‌లో తెలంగాణ చరిత్రను చేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రొఫెసర్ హరగోపాల్ అధ్యక్షతన 25మంది సభ్యులతో టి-సర్కార్ ఈనెల 3న సిలబస్ కమిటీ నియమించింది. తాజాగా మరో ముగ్గురిని ఈకమిటీలో చేర్చారు. పూర్తి స్థాయిలో ఏర్పడ్డ ఈ కమిటీ తొలిసారి నాంపల్లి లోని టిఎస్పిఎస్సి కార్యాలయంలో సమావేశమై పోటీ పరీక్షల్లో ఉండాల్సిన తెలంగాణా సిలబస్ విధివిధానాలపై చర్చించింది. తెలంగాణా చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, ఎకానమి వంటి సబ్జెక్ట్స్ లో మార్పులు చేయనున్నారు. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యం వంటి అంశాలను చేర్చనున్నారు.
తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా సిలబస్
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వివరాలతో ఉన్న పుస్తకాలను మార్చి తెలంగాణ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయనున్నారు. కమిటీ సభ్యులందరి నుంచి సిలబస్‌కు సంబంధించిన విధివిధానాలు ఏవిధంగా వుండాలనే దానిపై వివరాలు సేకరించారు. ఇప్పటికే అభ్యర్థులు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయిఉన్నందును ఒకే సారి పూర్తి సిలబస్‌ను మార్చబోమని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. ప్రస్తుతానికి కొన్ని మార్పులు చేసి 2016-17నాటికి పూర్తి స్థాయి తెలంగాణ సిలబస్‌ను తయారు చేసి ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని చెప్పారు.
మరో సారి భేటీ కానున్న సిలబస్ కమిటీ
మరో వారం తరువాత రెండో విడత సిలబస్ కమిటీ సమావేశం కానుంది. ఈసమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి సిలబస్‌లో చేర్చాల్సిన అంశాలపై నివేదికను తయారు చేసి కేబినెట్ ముందుంచాలని కమిటీ ప్రణాళిక రూపొందించుకుంది. కేబినెట్ ఆమోదం తర్వాత కొత్త సిలబస్‌ను రూపొందించి పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని టిఎస్పిఎస్సి నిర్ణయించింది.