
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రూ. 15 వేల కోట్ల రుణం అందించడానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పి.ఎఫ్.సి) ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో పి.ఎఫ్.సి సిఎండి ఎం.కె. గోయల్, తెలంగాణ GENCO సిఎండి డి. ప్రభాకర్ రావులు ఆదివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎం.ఓ.యు పై సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమంలో పి.ఎఫ్.సి డైరెక్టర్ అగర్వాల్, జిఎం టి.కె. సింగ్, తెలంగాణ GENCO డైరెక్టర్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా మణుగూరులో ఏర్పాటు చేస్తున్న 1080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంటుకు, నల్లగొండ జిల్లా దామరచర్లలో నెలకొల్పే 4400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కు ఈ రుణం ద్వారా లభించిన నిధులను ఖర్చు చేస్తారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు రుణంపై వడ్డీని 12 నుండి 11.5 శాతానికి తగ్గిస్తున్నట్టు పి.ఎఫ్.సి ప్రకటించింది. దీనివల్ల తెలంగాణ GENCO కు రూ. 300 కోట్లకు పైగా మేలు జరుగుతుంది.