తెలంగాణ విద్యను దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలపాలి : గవర్నర్ నరసింహ్మన్

తెలంగాణ విద్యను దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలపాలి- గవర్నర్ నరసింహ్మన్
ఆరుమాసాల్లో యూనివర్శిటీల్లో సర్వీసులన్నీ ఆన్ లైన్ లో – ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
అన్ని యూనివర్శిటీలు, అనుబంధ కాలేజీల్లో బయో మెట్రిక్, సీసి కెమెరాలు తప్పనిసరి
ఆరు నెలల్లో యూనివర్శిటీల్లో 1061 పోస్టులు భర్తీ చేస్తాం
పకడ్బందీగా పిహెచ్ డీ కోర్సులు నిర్వహించాలి
యూనివర్శిటీల్లో చదివిన విద్యార్థులకు ప్లేస్ మెంట్స్ పై దృష్టి పెట్టాలి
వీసీల సమావేశంలో గవర్నర్ నరసింహ్మన్, ఉప ముఖ్యమంత్రి మంత్రి కడియం శ్రీహరి

హైదరాబాద్, అక్టోబర్ 06 : తెలంగాణ విశ్వవిద్యాలయాలను , తెలంగాణ విద్యను దేశంలో నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చే లక్ష్యంతో మన యూనివర్శిటీలు పనిచేయాలని గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహ్మన్ విశ్వవిద్యాలయాల వీసీలకు పిలుపునిచ్చారు. ఆరు నెలల్లో తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో సర్వీసులన్నీ ఆన్ లైన్ చేస్తామని, 1061 పోస్టులు భర్తీ చేస్తామని, గవర్నర్ సూచనలన్నింటిని అమలు చేసి చూపుతామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. వచ్చే ఆరు నెలల్లో యాక్షన్ టెకెన్ రిపోర్టులతో గవర్నర్ అధ్యక్షతన వీసీలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల వీసీలతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో జరిగిన సమావేశంలో గవర్నర్ నరసింహ్మన్, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో పాటు విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయాల వీసీలు, అధికారులు పాల్గొన్నారు.
ఇటీవల కేంద్ర మానవ వనరుల శాఖ విద్యపై నిర్వహించిన వివిధ రాష్ట్రాల సర్వేలో తెలంగాణ జాతీయ సగటు కంటే పై స్థాయిలో ఉందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ముఖ్యంగా ఎస్సీల విద్యలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఎస్టీల విద్యలో దేశంలో రెండో స్థానంలో ఉందన్నారు. అదేవిధంగా న్యాక్ బృందం ఇటీవల ఓయు, కేయు, జెఎన్టీయు విశ్వవిద్యాలయాల్లో పర్యటించి న్యాక్ గుర్తింపునిచ్చిందన్నారు. ఇందులో ఓయుకు గతంలో ఏ గుర్తింపు ఉంటే ఈసారి ఏప్లస్ గుర్తింపు వచ్చిందని, కేయు, జేఎన్టీయు లలో గతంకంటే ఉత్తమ స్కోర్ లభించిందన్నారు. యూనివర్శిటీలు, అనుబంధ కాలేజీల్లో ఆధార్ ఆధారిత అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని, దీనిని కేంద్రం కూడా కొనియాడిందన్నారు. ఈ వీసీల సమావేశంలో విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలు తీసుకుంటున్నచర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గౌరవ గవర్నర్ నరసింహ్నన్ కు వివరించామన్నారు. విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలన్ని సమన్వయంతో అకాడమిక్ క్యాలెండర్ పక్కాగా అమలు చేయాలని గవర్నర్ సూచించారన్నారు. గవర్నర్ సలహా మేరకు వచ్చే విద్యా సంవత్సరంలో కచ్చితంగా జూలైలోనే అకడమిక్ ఇయర్ ప్రారంభం అవుతుందని, అకాడమిక్ క్యాలెండర్ కచ్చితంగా అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. నా ప్రభుత్వంలో జీరో అవినీతి ఉందని, అందుకనుగుణంగా అన్ని సర్వీసులు ఆన్ లైన్ చేయాలని గవర్నర్ సూచించారని, కచ్చితంగా ఆరు నెలల్లో అన్ని యూనివర్శిటీల సర్వీసులను ఆన్ లైన్ చేస్తామని చెప్పారు.
వీసీలకు పదిసూత్రాల ఎజెండాతో ఉప ముఖ్యమంత్రి కడియం దీశానిర్ధేశనం
తెలంగాణ విశ్వవిద్యాలయాలను దేశంలో మిగిలిన వాటన్నింటిని తలదన్నేలా చేసేందుకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి యూనివర్శిటీ వీసీలకు పదిసూత్రాల ఎజెండాతో దిశానిర్ధేశనం చేశారు. దీనికి ఆరు నెలల డెడ్ లైన్ కూడా పెట్టారు. అవి
యూనివర్శిటీలు, వాటి అనుబంధ కాలేజీలు, కేంద్ర ప్రభుత్వ విద్యాలయాల సమన్వయంతో అకాడమిక్ క్యాలెండర్ ను పక్కాగా అమలు చేయడం
ప్రతి యూనివర్శిటీ, దాని అనుబంధ కాలేజీల్లో సీసీ కెమెరాలు, బయో మెట్రిక్ మెషీన్లు ఏర్పాటు చేయడం. దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరులో పారదర్శకత తీసుకురావడం.
2017-18 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల కోసం 419 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ నిధులను ఖర్చుచేయడంలో విశ్వవిద్యాలయాలు వాటి ప్రాధాన్యత రూపొందించుకుని, వేగంగా పనులు చేయాలి.
విశ్వవిద్యాలయాల్లో 1061 పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ ఆమోదం తెలిపారు. ఈ పోస్టుల భర్తీకోసం కమిటీ వేశాం. ఒకటి, రెండు రోజుల్లో ఈ కమిటీ తన నివేదిక ఇవ్వగానే భర్తీ ప్రక్రియ ప్రారంభించి ఆరు నెలల్లోపు పూర్తి చేయాలి
పిహెచ్.డి పట్టాలకు సంబంధించి యూనివర్శిటీలు సీరియస్ గా పరిశోధన చేసే విద్యార్థులకే అవకాశం కల్పించాలి. నిర్ణీత గడువులోనే పిహెచ్.డి పూర్తి చేసేలా చూడాలి. కాలక్షేపం చేసే వారిపట్ల కఠినంగా ఉండాలి. ఈ పిహెచ్.డి పట్టాలకు సంబంధించి ముగ్గురు వీసీలతో కమిటీ వేశాం. కమిటీ నివేదిక మేరకు ఒక యూనిఫామ్ పాలసీ తెచ్చి అమలు చేయాలి.
యూనివర్శిటీలన్నీ సమాచార, సాంకేతిక పరిజ్ణానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. అన్ని సర్వీసులను ఆన్ లైన్ చేయాలి.
యూనివర్శిటీలలో చదివే విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాల లభించేలా దృష్టి పెట్టాలి. విద్యార్థులకు ఉపాధి లభించే విధంగా వారి స్కిల్స్ ను అభివృద్ధి చేయాలి, అవకాశాలు కల్పించేలా యూనివర్శిటీలు చొరవ తీసుకోవాలి.
తెలంగాణ విశ్వవిద్యాలయాల వద్ద ఉన్న సేవల ద్వారా, నైపుణ్యాల ద్వారా వనరులను సమీకరించాలి. స్వయం సమృద్ధిగా ఎదగాలి.
ఇక విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో ఉన్న సీట్ల సంఖ్య, చేరుతున్న విద్యార్థుల సంఖ్యపై సమీక్ష చేసుకోవాలి. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా సీట్లు ఉండేలా చూసుకోవాలి.
విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకుల స్కిల్స్ ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసేలా ఇన్ సర్వీసు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.
ఈ పది సూత్రాలను యూనివర్శిటీలు ప్రాధాన్యత పద్దతిలో అమలు చేయాలని చెప్పారు. ఆరు నెలల తర్వాత తీసుకున్న చర్యల నివేదికలతో మరో సమావేశం నిర్వహిస్తామన్నారు. యూనివర్శిటీ హాస్టళ్లలో కోర్సులు చేస్తున్న విద్యార్థులే ఉండాలని గవర్నర్ చెప్పారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. అదేవిధంగా యూనివర్శిటీలో కోర్సులు ప్రవేశపెట్టేముందు మార్కెట్ డిమాండ్, అవసరం అధ్యయనం చేసి వాటిని డిజైన్ చేయాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.