తెలంగాణ రాష్ట్ర సాంకేతిక వనరుల సమీకరణ, సక్రమ వినియోగంపై వ్యవసాయ కమిషనర్: డా. ఎం. జగన్ మోహన్

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సాంకేతిక వనరుల సమీకరణ

తేదిః 30 జనవరి, 2018 న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సాంకేతిక వనరుల సమీకరణ, సక్రమ వినియోగంపై 2వ వర్క్ షాప్ తెలంగాణ సీడ్స్ కార్పోరేషన్ కాన్ఫరెన్సు హాల్ లో వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్. ఆధ్వర్యంలో జరిగింది. 29 జూన్, 2017న జరిగిన మొదటి వర్క్ షాప్ లో నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పలు పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు పంటల వారీగా ఆ పంటల దిగుబడుల పెంపుదలకు చేపట్టాల్సిన వ్యూహాలను, రాష్ట్రంలో వ్యవసాయ స్థితిగతులపై వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కమిషనర్ వర్క్ షాప్ ఉద్దేశాల గురించి వివరిస్తూ హైదరాబాదులో అనేక వ్యవసాయ పరిశోధనల సంస్థలతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర కేంద్ర స్థాయి పరిశోధన సంస్థలు హైదరాబాదులో పనిచేస్తున్నాయని, వాటి మధ్య సమన్వయం సాధించి రాష్ట్ర రైతాంగానికి మరింతమైరుగైన సేవలు అందించడమే ఈ వర్క్ షాప్ ఉద్దేశం అని అన్నారు.

పలు పరిశోధనల సంస్థల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు రాష్ట్ర్లంలోని ప్రధాన పంటలలో
దిగుబడులలో వ్యత్యాసాలు నివారించడానికి తమ ఆలోచనలు, సూచనలు పంచుకున్నారు. ఇక్రిసాట్ కంది శాస్త్రవేత్త అనుప మాట్లాడుతూ…. కంది పంటలో తక్కువ దిగుబడులకు అనేక కారణాలున్నాయని అయితే అనువైన రకాలతో పంటల యాజమాన్య పద్ధతుల్లోని మార్పులతో మెరుగైన దిగుబడులు సాధ్యమన్నారు. కందిలో విత్తన స్వచ్ఛత కనుగొనే కిట్స్ అందుబాటులో ఉన్నాయని, వాటిని రైతు స్థాయిలో ఉపయోగించేల చేస్తే లాభం జరుగుతుందని అన్నారు. తెలంగాణ సాంకేతిక వనరుల సమీకరణలో తాము కూడా భాగస్వాములౌతామని అన్నారు. వాతావరణ శాఖ నుంచి వచ్చిన శాస్త్రవేత్త వై.కె. రెడ్డి మాట్లాడుతూ… రైతాంగానికి ఉపయోగపడేలాగా వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తున్నట్లు చెప్పారు. రైతుల అభ్యున్నతికి పంటల నష్ట నివారణకు పూర్తి స్థాయిలో తమ సహకారం ఉంటుందని అన్నారు.

వనరుల సమీకరణలో తాము కూడా భాగస్వాములౌతామని అన్నారు. ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వరి, అపరాలు, పత్తి, సోయాబీన్, కంది, మొక్కజొన్న పంటలలో దిగుబడులు పెంచడానికి రాష్ట్రంలో ఆయా పంటలలో జిల్లాల మధ్య దిగుబడులలో వ్యత్యాసం తగ్గించడానికి ఆచరించాల్సిన పద్ధతులను, వ్యూహాలను వర్క్ షాప్ లో 2 వివరించారు. అలాగే వారి కార్యచరణ ప్రణాళికలను స్థానిక పరిస్థితులకు అనుకూలంగా తయారు చేసి నివేదిస్తామని తెలియజేసారు. జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం నుంచి విచ్చేసిన ప్రధాన శాస్త్రవేత్త సి.ఎస్. మూర్తి మాట్లాడుతూ… సాంకేతిక వనరుల సమీకరణ నేటి తక్షణ అవసరమని, ఈ వర్క్ షాప్ సందర్భోచితమని అన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటేనే దిగుబడులలో వ్యత్యాసం తగ్గించడం సాధ్యమౌతుందని అన్నారు. అలాగే జి.ఐ.ఎస్.ఆర్.ఎస్. సాంకేతికతతో ఇది సాధ్యమన్నారు.

అందుబాటులో ఉన్న సాంకేతికతతో రాష్ట్రానికి సంబంధించిన పంటల అట్లాస్ రూపొందించుకోవచ్చని అన్నారు. భూముల వినియోగం, పంట కాలనీలు, క్రాప్ సర్వేలెన్సుకు సంబంధించిన మొబైల యాప్ రూపొందించుకోవచ్చని అన్నారు.డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ ప్రదీప్ మాట్లాడుతూ… పరిశోధనా సంస్థల వలన సాంకేతిక పరిజ్ఞానం పుష్కలంగా ఉందని, దానిని రైతు వద్దకు చేర్చడానికి విస్తృతంగా విస్తరణ సేవలను వినియోగించుకోవాలని అన్నారు.  ఆయా ప్రాంతాలకు పంటలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కరపత్రాలు రూపొందించి విస్తృతంగా అందజేయాలని అన్నారు. వ్యవసాయ కమిషనర్ మాట్లాడుతూ… పంటల యాజమాన్య పద్ధతులలో చిన్న చిన్న మార్పులు, సవరణలతో మంచి దిగుబడులు సాధించవచ్చని అన్నారు. జిల్లాల వారీగా ఆయా జిల్లాలకు అనుకూలమైన పంటల ప్రణాళికను రూపొందించి నివేదిక ఇవ్వాలని శాస్త్రవేత్తలను కమిషనర్ కోరారు.

ఈ సమావేశంలో దయానంద్, జె.డి.డి.ఇ.ఎస్., శాస్త్రవేత్తుల దామోదర్ రాజు, సుదర్శన్, జగన్మోహన్ రెడ్డి, వ్యవసాయ అదనపు సంచాలకులు కె. విజయ కుమార్, వ్యవసాయ అధికారులు, తెలంగాణ స్టేట్ సీడ్ కార్పోరేషన్ అధికారులు, క్రీడా, ఐ.ఐ.ఆర్.ఆర్., ఐ.ఐ.ఓ.ఆర్. శాస్త్రవేత్తలు, భూగర్భజల శాఖ ప్రతినిధులు, వరంగల్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి వచ్చిన అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.