తెలంగాణ రాష్ట్ర  రైతు రుణమాఫీ పథకాన్ని పరిశీలించడానికి వచ్చిన పంజాబ్ అధికారుల బృందం

 

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన  వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పడిన మంత్రుల సబ్-కమిటీ పర్యవేక్షణలో రూపొంది, విజయవంతంగా అమలైన  రైతు రుణ మాఫీ పథకాన్ని తెలుసుకోవడానికి పంజాబ్ రాష్ట్రం నుంచి అధికారుల బృందం హైదరాబాద్ కు వచ్చింది.  వీరిలో  సీనియర్ ఐ.ఎ.ఎస్. పంజాబ్ రాష్ట్ర వ్యవసాయ సహకార విభాగ అదనపు ముఖ్య కార్యదర్శి డిపీ రెడ్డి, పంజాబ్ రాష్ట్ర వ్యవసాయ కమీషనర్ బల్వీందర్ సింగ్,  , .సహకార బ్యాంకుల యం.డి ఎస్ కె బటీష్,   ఆర్థిక శాస్త్రవేత్త (హెడ్) డాక్టర్ సుఖ్పాల్ సింగ్, పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లుధియానా అధికారులు  ఉన్నారు. తెలంగాణ  వ్యవసాయ ఉత్పత్తి కమీషరు & కార్యదర్యి  సి. పార్థసారథి, ఆధ్వర్యంలో తెలంగాణలోని వివిధ బ్యాంకుల అధికారులు, వ్యవసాయ అధికారుల సమక్షంలో హైదరాబాదు సచివాలయంలో   4 ఆగష్టు 2017న  సమావేశం  అయ్యారు.

రైతు రుణ మాఫీ పథకం గురించి వ్యవసాయ ముఖ్య కార్యదర్శి శ్రీ సి. పార్థసారథి, ఐ.ఎ.ఎస్. వివరించారు.  తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా వర్షాధారంగా సాగుతున్న వ్యవసాయమని, రాష్ట్ర అవతరణ జరిగి ఇటీవలే తనదైన ప్రణాళికలతో అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని అన్నారు.  రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ కోసం ఒక  క్యాబినెట్ సబ్-కమిటీని ఏర్పరిచారని వారు రెండు నెలలపాటు శ్రమించి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించారని చెప్పారు.

2014-15లో రూ.4039.98 కోట్లు రుణమాఫీతో 36 లక్షల మంది రైతులు లబ్ది పొందారని, 2015-16లో రూ.4039.98 కోట్లు రుణమాఫీతో 35.3 లక్షల మంది రైతులు, 2016-17 లో రూ.4025.20 కోట్లు రుణమాఫీతో 35.3 లక్షల మంది రైతులు, 2017-18లో రూ.3999.995  కోట్లు రుణమాఫీతో 35.3 లక్షల మంది రైతులు లబ్ది పొందారని తెలిపారు.  మొత్తంగా 17 వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందని చెప్పారు.  ఈ రుణమాఫీ క్రమంలో అసలైన లబ్ది దారులైన రైతులకు అందేలా తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.   ఆ తరువాత పంజాబ్ రాష్ట్ర ప్రతినిధి బృందం వ్యవసాయ శాఖ కార్యదర్శితోను, బ్యాంకు ప్రతినిధులతోను, వ్యవసాయ అధికారులతోను లోతుగా చర్చించారు.

 

 

 

 

అవకతవకలకు అవకాశం లేకుండా జరిగిన రైతు రుణమాఫీ పథకాన్ని పంజాబ్ రాష్ట్ర బృందం అభినందించింది.  తెలంగాణ రాష్ట్ర అనుభవాలు పంజాబ్ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడతాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని శాస్త్రీయంగా అమలు పరిచిందని అభిప్రాయపడ్డారు.  క్షేత్ర స్థాయిలో పథకం అమలుకు ఎదురైన సమస్యలు, అనుభవాలు పంజాబ్ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.  పంజాబ్ రాష్ట్రంలో తాము కూడా చేయవచ్చనే ఆత్మ విశ్వాసాన్ని ఈ సమావేశం మాకిచ్చిందన్నారు.   అన్ని స్థాయిలలో అధికారులు ఈ సమావేశంలో పాల్గొని మా సందేహాలను తీర్చినందుకు వారందరికి కృతజ్ఞతలు తెలియజేశారు పంజాబ్ రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి డి.పి. రెడ్డి, ఐ.ఎ.ఎస్.

 

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు ప్రతినిధులు  రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ ప్రతినిధులు, నాబార్డు ప్రతినిధులు, ఆంధ్ర బ్యాంకు ప్రతినిధి, వ్యవసాయ అదనపు సంచాలకులు-1 జి. నారీమణి,  వ్యవసాయ అదనపు సంచాలకులు-2 కె. విజయ కుమార్ లతో సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

 

 

వ్యవసాయ  శాఖ

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *