తెలంగాణ పునర్నిర్మాణ పిండరూపంలో ఉంది – మంత్రి హరీష్ రావు

తెలంగాణ పునర్నిర్మాణం పిండరూపంలో ఉన్నది.పాలమూరు జిల్లా ఇందుకు సాక్ష్యం.గడ్డి కూడా మొలవని నేలలో తుంగ మొలవడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తెలంగాణ వస్తే ఏమొస్తుంది?అనే ప్రశ్నకు పాలమూరు పొలం సమాధానం. పాలమూరు పంట సమాధానం. పాలమూరు చెరువు సమాధానం.కడుపునిండా నీళ్లు తాగిన ఏ చెరువైనా జవాబే.వనపర్తి జిల్లా పెద్ద మందడి మండలం గతంలో కరువుతో అల్లాడింది. ఇప్పుడు ఆకుపచ్చన ప్రాంతంగా ఈ మండలం లోని గ్రామాలు కళ కళ లాడుతున్నవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సాగునీటి రంగంలో అత్యధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు. వలసలకు నిలయంగా ఉన్న ఈ జిల్లాను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కేవలం మూడు సంవత్సరాల్లో వలసలు గణనీయంగా తగ్గినవి. ఈ జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం ఇక్కడకు వలసలు వచ్చే దృశ్యాలు కనిపిస్తున్నవి.జిల్లాలోని నాలుగు ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల ద్వారా ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సిద్ధమవుతున్నది.ఇప్పటికే ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీటిని ప్రభుత్వం అందించింది. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నవి.కాళేశ్వరం కన్నా ఇది పెద్ద ప్రాజెక్టు.145 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం తో పనిచేసే 31 పంపులను ఈ ప్రాజెక్టులో బిగించనున్నారు. సమైక్య రాష్ట్రంలో ఈ పథకానికి జూరాల నుంచి నీటిని తీసుకోవాలని డిజైన్ చేశారు. కానీ కేవలం ఆరేడు టీఎంసీల లైవ్ స్టోరేజీతో ఉండే జూరాలకు ఈ పథకాన్ని ముడిపెడితే మనుగడ ఉండదని కేసీఆర్ భావించారు. జూరాలపై ఆధారపడిన కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులు కూడా ప్రమాదంలో పడే అవకాశముంది. దూరదృష్టితో శ్రీశైలం జలాశయం ఇన్‌టేక్ పాయింట్‌గా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. శ్రీశైలం లో ఏడాది పొడవున నీటి లభ్యత ఉంటుంది. పాత పాలమూరు జిల్లాలో ఏడు లక్షలు, రంగారెడ్డి జిల్లాలో ఐదు లక్షలతో పాటు నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలు,మొత్తం 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.  శ్రీశైలం జలాశయం నుంచి 90 రోజుల్లో రోజుకు రెండు టీఎంసీలను సేకరించి అందులో ఒకటిన్నర టీఎంసీలను ఈ పథకానికి వినియోగించాలని సి.ఎం డిజైన్ చేశారు.ఈ పథకం పూర్తయితే పాత పాలమూరు జిల్లా సస్యశ్యామలం కానుంది. కృష్ణాజలాలకు సంబంధించి సాగర్ మినహా తెలంగాణ పరిధిలో పెద్ద  రిజర్వాయర్లు లేవు. కానీ ఈ పథకంతో 67.85 టీఎంసీల సామర్థ్యంతో అంజనగిరి (నార్లాపూర్), వీరాంజనేయ (ఏదుల), వెంకటాద్రి (వట్టెం), కురుమూర్తిరాయ (కరివెన), ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుంది.

harish rao 1     harish rao 2

21 ప్యాకేజీలకుగాను ఇప్పటికే 18 ప్యాకేజీల్లో సుమారు రూ. 30 వేల కోట్ల విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయి. మంత్రి హరీశ్ రావు సోమవారం నాడు వట్టెం రిజర్వాయర్ పనులను తనిఖీ చేశారు. అంతకుముందు ఆయన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతిని ఉన్నతాధికారులతో సమీక్షించారు.4 రిజర్వాయర్ లు,4 పంపు హౌజ్ ల పురోగతిని సమీక్షించారు.అతి తక్కువ ముంపు,అతి తక్కువ పర్యావరణ నష్టం తో అత్యంత ఎక్కువ ప్రయోజనాలతో నిర్మిస్తున్న దేశంలో నే అతి పెద్ద ప్రాజెక్టు పి.ఆర్.ఎల్.ఐ.ఎస్.అని హరీశ్ రావు మీడియా కు తెలిపారు.మొత్తం 67 టి.ఎం.సి. ల సామర్థ్యం తో నిర్మిస్తున్నప్పటికీ కేవలం 2450 ఇండ్లు ముంపునకు గురైనట్టు తెలిపారు.త్వరలోనే ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధిస్తామని చెప్పారు.పాలమూరు ప్రాజెక్టు స్టేజ్1 అనుమతి కోసం మంగళ,బుధవారాల్లొ పి.ఆర్.ఎల్.ఐ.ఎస్.చీఫ్ ఇంజనీరు లింగరాజు ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి చెప్పారు.కొందరు కాంగ్రెస్ నాయకులు కోర్టులు,గ్రీన్ ట్రిబ్యునల్ లో వేసిన కేసుల మూలంగా పనులలో జాప్యం జరిగినా తిరిగి వేగవంతం చేశామని అన్నారు.ఎదుల  రిజర్వాయర్ పనులు 95 శాతం పూర్తయినట్టు చెప్పారు. మార్చి 31 కల్లా మిగతా పనులు పూర్తి చేసేందుకు టైం లైను పెట్టినట్టు పేర్కొన్నారు.వట్టెం రిజర్వాయర్ కు చెందిన 3 ప్యాకేజిలలో రెండు ప్యాకేజి ల పనులు శరవేగంగా సాగుతున్నట్టు హరీశ్ తెలిపారు. కరివెన రిజర్వాయర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. మొత్తం 5617 ఎకరాల భూసేకరణలో ఇంకా 400 ఎకరాలను సేకరించవలసి ఉందన్నారు. ఎం.ఎల్.ఏ.మర్రి జనార్దన్ రెడ్డి సహకారంతో ఈ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.భూ నిర్వాస్తితులకు నష్టపరిహారం చెల్లింపు లతో పాటు వారు కోరిన విధంగా సహాయ,పునరావాస చర్యలు తీసుకోవాలని, కాలనీలు నిర్మించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగనున్నదని ఆయన వివరించారు. ఈ సమీక్షలో  ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్ రెడ్డి,ఎం.ఎల్.ఏ.మర్రి జనార్దన్ రెడ్డి, సి.ఈ.లింగరాజు, ఎస్.ఈ.రమేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

harish rao 3     harish rao 4

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *