
హైదరాబాద్ , ప్రతినిధి : తెలంగాణలో ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్‌కు సవాళ్ళు స్వాగతం పలుకుతున్నాయి. తెలంగాణ ఇచ్చినా ప్రజలు ఆదరించక పోవడం.. కష్టకాలంలో ఉన్న పార్టీకి హ్యాండిచ్చి టీఆర్ఎస్ గూటికి చేరుతుండడం కాంగ్రెస్‌ను కోలుకోలేకుండా చేసింది. అధికారపార్టీ టిఆర్ఎస్ జోరుతో ముందుకెళ్తుంటే.. హస్తం నేతల అంతర్గత కుమ్ములాటలు ఆపార్టీ క్యాడర్‌ను డీలాపడేలా చేస్తున్నాయి. ఇదే అదనుగా గులాబీ పార్టీ ఆకర్ష్ ఫార్ములాతో కాంగ్రెస్‌ను మరింత డ్యామేజ్ చేసేందుకు ప్లాన్‌తో ముందుకెళ్తోంది. దీంతో ఇప్పుడు హైకమాండ్ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది.
పార్టీ నాయకత్వంపై పూర్తిస్థాయిలో ఫోకస్ ….
గతంలో పార్టీ ఒటమిపై ఒకసారి నివేదిక తీసుకున్న హైకమాండ్.. ఇప్పుడు పార్టీ నాయకత్వంపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసింది. పార్టీలో నుంచి వలసలు, నేతల అంతర్గత కుమ్ములాటలు, పీసీసీని మార్చాల్సిందే అని వస్తున్న వాదనలను అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. అందుకే పార్టీని బలోపేతం చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే రాష్ర్ట నేతలను ఢిల్లీకి పిలిచి సీనియర్ నేతల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తెలంగాణ వాదం గట్టిగా వినిపించిన మీరేందుకు ఓడారని మాజీలను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పొన్నాలపై ఫిర్యాదు చేసిన వారు యువనేత సమాధానంతో ఖంగుతిన్నారట. పార్టీ ఓటమికి పొన్నాల ఒక కారణమే తప్పా.. మొత్తానికి ఆయనే కారణం కాదని అనడంతో నోటమాట రాలేదట. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విషయంలోనూ రాహుల్ ఇలాగే మాట్లాడారట. దీంతో ఇంతకు అధిష్టానం మదిలో ఏముందో అంతుపట్టడం లేదని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఇదంతా హైకమాండ్ వ్యూహాత్మకంగానే వ్వవహరిస్తోందని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.
రివర్స్‌లో హైకమాండ్…
రాష్ట్ర నేతలను గాడిలో పెట్టేందుకే హైకమాండ్ ఇలా రివర్స్‌లో వస్తోందని సమాచారం. ముందుగా నేతల ప్రవర్తన మార్చడం.. ఆ తర్వాత పార్టీని గాడిలో పెట్టడం అనే ఫార్ములాను ఢిల్లీ పెద్దలు అమలు చేస్తున్నట్లు పార్టీలో టాక్. మరి హైకమాండ్ అమలు చేస్తున్న ఆ కాన్సెఫ్ట్ ఏ మేరకు ఫలితం ఇస్తుందో చూడాలి.